శేషాచలంలో బుల్లిజీవుల అందాలు

ABN , First Publish Date - 2022-05-20T07:58:13+05:30 IST

వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ అనగానే మిసైల్‌ లాంచర్‌లాంటి కెమెరాలు గుర్తుకొస్తాయి

శేషాచలంలో బుల్లిజీవుల అందాలు

మొబైల్‌ కెమెరాలో చిత్రిస్తున్న తిరుపతి యువకుడు 

ఐనేష్‌ సిద్ధార్ధకు ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు 


తిరుపతి(కొర్లగుంట), మే 19: వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ అనగానే మిసైల్‌ లాంచర్‌లాంటి కెమెరాలు గుర్తుకొస్తాయి. వాటిని మోసుకుంటూ అడవుల్లో తిరుగుతూ ఫోటోలు పడుతుంటారు. తిరుపతి యువకుడొకరు ఇందుకు భిన్నంగా అరచేతిలో ఇమిడిపోయే మొబైల్‌ఫోన్‌ కెమెరాతోనే అరుదైన ఫోటోలు తీశారు. అవి కూడా అతి సూక్ష్మ క్రిమి కీటకాల బొమ్మలు. ఆరుద్ర పురుగులు, సీతాకోకచిలుకలు, తూనీగలు, ఈగలు, చీమలు, మిడతలు.. ఇవీ ఐనేష్‌ వెంటబడి ఫోటోపట్టిన అందాలు. ట్రైపాడ్‌ మీద మూరడు పొడవుండే లెన్స్‌లు న్న కెమెరా బిగించుకుని దూరం నుంచీ వన్యప్రాణుల ఫోటోలు తీస్తుంటారు. ఐనేష్‌ మాత్రం మొబైల్‌ ఫోన్‌కి చిన్న మాక్రో లెన్స్‌ పెట్టుకుని కీటకాలను వేటాడుతుంటారు.  ఆరుగంటల పాటూ ఓపిగ్గా నిరీక్షించి ఈయన తీసిన ఎర్రతూనీగ ఫోటోకి చిత్తూరు జిల్లా వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ పోటీల్లో తొలి బహుమతి వచ్చింది. వంగపూత రంగు అద్దినట్టుండే నల్లరెక్కల తూనీగను ఐనేష్‌ ఇటీవలే తన మొబైల్‌లో చిత్రించారు. అరుదైన ఈ తూనీగను తెలుగు రాష్ట్రాల్లో తొలిగా  గుర్తించినది ఈయనే. శేషాచలంలో ఐదు రకాల అరుదైన తూనీగల ఫోటోలు తీసిన ఐనేష్‌, ఇదే అడవిలో దాదాపు 60 రకాల కీటకాల అందాలను మొబైల్‌లో బందించారు. తన ఫోటోలను నేషనల్‌ జియోగ్రఫీ, డిస్కవరీలకు పంపుతుంటారు ఐనేష్‌. ఎప్పటికైనా వారి దృష్టిలోపడి ఒక డాక్యుమెంటరీ అవకాశం రాకపోతుందా అనే ఆశతోనూ, నమ్మకంతోనూ. ఆయన కల సాకారం అవుతుందని ఐనేష్‌  సూక్ష్మచిత్రాలు చెబుతున్నాయి. ఈయన ఫోటో పట్టిన బుల్లిజీవుల అందాలను ఇన్‌స్టాగ్రామ్‌లో జీుఽ్ఛటజిఝ్చఛిటౌట లో చూడచ్చు.

 


శేషాచలం అడవులను తన ఫోటో అన్వేషణకు కేంద్రంగా ఎంచుకున్న ఇతని పేరు ఐనేష్‌ సిద్ధార్ద. తిరుపతి భవానీ నగర్‌లో నివాసం. శ్రీవిద్యానికేతన్‌లో మైక్రోబయాలజీలో బీఎస్సీ చేశారు. తండ్రి శ్రీనివాసులు ఇరిగేషన్‌ విభాగంలో ఉద్యోగి. అమ్మ విజయలక్ష్మి గృహబాధ్యతలు చూస్తారు. ఐనేష్‌ ఫోటో పిచ్చికి తల్లిదండ్రులు తొలుత ఆందోళనపడినా, ఇతని ప్రతిభ చూసి ప్రోత్సహిస్తున్నారు. బుల్లిజీవుల ఫోటోలు తీసినందుకు గానూ ఐనేష్‌కు ఇంటర్నేషనల్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది. 25 ఏళ్లు కూడా నిండని వయసులో 150 సూక్ష్మ కీటకాల ఫోటోలు తీసినందుకు ఈ గుర్తింపు లభించింది. 







Updated Date - 2022-05-20T07:58:13+05:30 IST