ఇదేం... చెత్త పని?

ABN , First Publish Date - 2022-05-16T05:42:03+05:30 IST

‘బీచ్‌ ఏంటి ఇంత డర్టీగా ఉందని ఓ విదేశీయుడు అన్న మాటను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బీచ్‌క్లీనింగ్‌ పేరిట ఆదివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదేం... చెత్త పని?

 జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందితో చేయించలేరా?

 బీచ్‌ క్లీన్‌ కార్యక్రమంపై కొంతమంది ఉద్యోగుల అసహనం 

- సెలవు రోజు ఉదయాన్నే తీరానికి ఉరుకులు, పరుగులు  

-  మద్యం సీసాలు ఏరిన గజిటెడ్‌ అఽధికారులు

-  చెత్త ఏరి, సొమ్మసిల్లిన మహిళా ఉద్యోగిణులు


మద్దిలపాలెం, మే 15:

మన బీచ్‌ మనమే శుభ్రం చేసుకోవాలి అంటే.. ఎలా.. ప్రతి పనికి ఒక విభాగం, నిబంధనలున్నాయి.. నగర పరిశుభ్రతకు జీవీఎంసీ పారిశుధ్య విభాగం ఉంది. బీచ్‌లో చెత్త ఉంటే పారిశుధ్య కార్మికులతో ఏరించాలి. కానీ మమ్మల్లి చెత్త ఏరమని చెప్పడమేంటి?. మా కార్యాలయంలో చెత్త పేరుకుపోయింది... పక్క డిపార్ట్‌మెంట్‌ వారు వచ్చి ఎత్తండి అంటే ఎత్తుతారా...?

- ఓ గజిటెడ్‌ అధికారి ఆవేదన ఇది. 

నవరత్నాల అమలు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, రాజకీయ ప్రముఖల పర్యటనలతో వారంలో ఆరు  రోజులూ పరుగులు పెడుతూ.. ఆదివారం కాస్త ప్రశాంతంగా నిద్రిద్దామంటే... ఉదయం 6 గంటలకే చెత్త ఏరడానికి రావాలని ఆదేశించారు... చెత్త ఏరడం మా పనా...?

-  వాపోయిన మరో అధికారి


‘బీచ్‌ ఏంటి ఇంత డర్టీగా ఉందని ఓ విదేశీయుడు అన్న మాటను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బీచ్‌క్లీనింగ్‌ పేరిట ఆదివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా హాజరై, బీచ్‌లో చెత్త ఏరాలని ఆదేశాలిచ్చారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌కే బీచ్‌, గోకుల్‌పార్క్‌, జోడుగుళ్లపాలెం, పెదజాలారిపేట బీచ్‌లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు చెత్త పనిచేశారు. బీచ్‌ క్లీన్‌లో భాగంగా జీవీఎంసీ పారిశుధ్య విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌లు ఆ దిశగా  చర్యలు తీసుకోకుండా, జిల్లా ఉద్యోగులతో చెత్త ఏరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.  బీచ్‌లో చెత్త ఎత్తడాన్ని, మద్యం సీసాలను ఏరాల్సి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని కొందరు వాపోయారు. రెండు గంటలపాటు చెత్త ఎత్తే కార్యక్రమంలో పాల్గొనడంతో కొంతమంది నీరసం వచ్చి కూలబడిపోయారు. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టినప్పటికీ తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. 


పరిశుభ్రతలో విఫలమైన జీవీఎంసీ 

బీచ్‌లు పరిశుభ్రంగా ఉంచడంలో జీవీఎంసీ వైఫల్యం కనిపించింది. పారిశుధ్య కార్మికుల కొరతతో పనులు చేపట్టడం లేదని తెలుస్తోంది. అందుకే జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సాగరతీర స్వచ్ఛత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే వాదన వినిపిస్తోంది. జీవీఎంసీ పారిశుధ్య విభాగంలో 5,600 మంది కార్మికులు అవసరం. కానీ 5130 మంది మాత్రమే ఉన్నారు. అయితే వాస్తవంగా 4,500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌  సర్వీసెస్‌ ఏర్పడి 570 మంది కార్మికులను తొలగించింది. అంతేకాకుండా లేని కార్మికులను రిజిస్టర్లలో చూపించి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా సుమారు 500మంది కార్మికుల వరకు అదనంగా చూపుతున్నారని చెబుతున్నారు.  


విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం..

బీచ్‌లో పూర్తిగా ప్లాస్టిక్‌ను నిషేధించినప్పటికీ, తీరంలోని అన్ని దుకాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. బీచ్‌కు వచ్చే సందర్శకులకు తినుబండారాలను ప్లాస్టిక్‌ వస్తువుల్లోనే విక్రయిస్తున్నారు.  దీంతో బీచ్‌లో పాలిథిన్‌ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, వాటర్‌ బాటిల్స్‌ ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడి దుకాణాల నుంచి నెలవారీ మూమూళ్లు అందుకుంటున్న అధికారులు ప్లాస్టిక్‌ నిషేధంపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా బీచ్‌రోడ్డులో డస్ట్‌బిన్‌లు ఏర్పాటుచేసిన జీవీఎంసీ యంత్రాంగం సందర్శకులు ఎక్కువగా ఉండే సముద్రం ఒడ్డున మాత్రం ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో సందర్శకులు ప్లాస్టిక్‌ వస్తువుల్లో తినుబండారాలను తీసుకువెళ్లి, అవి ఖాళీ అయిన తరువాత అక్కడే పడేస్తునారు. అందుకే బీచ్‌ చెత్తతో నిండిపోతోంది. ఇటీవల తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి టన్నుల కొద్దీ చెత్త తీరానికి చేరింది. నగరంలో ప్లాస్టిక్‌ నిషేధం సక్రమంగా అమలుకాకపోవడం, కాలువలు, గెడ్డల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం తదితర కారణాలతో ఇలా వర్షం నీటితో కలిసి సముద్రంలో కలిసిపోతోంది. ఫలితంగా పర్యావరణానికి చేటు జరగడమే కాకుండా సముద్ర జీవులకు ముప్పు ఏర్పడుతోంది. దీనిపై దృష్టి సారించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు ఉద్యోగులతో చెత్త ఏరించడాన్ని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-05-16T05:42:03+05:30 IST