ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2022-06-30T06:42:17+05:30 IST

చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్మంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పలువురు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండండి
సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ చిత్తూరు పార్లమెంటు ఇన్‌చార్జి బీద రవిచంద్ర

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం 

జగన్‌ భూకబ్జాదారుడని ఉప ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు

టీడీపీ సమావేశంలో నేతల వ్యాఖ్యలు 

చిత్తూరు సిటీ, జూన్‌ 29: చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్మంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పలువురు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు ఇన్‌చార్జి బీద రవిచంద్ర మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తూ, వ్యాపారాలను దెబ్బతీస్తూ, వెంటాడి వేధిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ బై ఎలక్షన్‌లలో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీసులను, ప్రభుత్వ అధికారుల అండతో తప్పుడు ఐడీ కార్డులు, ఆధార్‌ కార్డులు పెట్టుకుని ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌ చేసిన విషయం దేశం మొత్తం తెలుసన్నారు. రాబోయే ఎన్నికలకు వైసీపీ ఇప్పటి నుంచే ఎత్తుగడవేసిందని అందులో భాగంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి, వైసీపీ మద్దతుదారులను చేర్చే కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. దీన్ని గ్రామస్థాయి నుంచి పరిశీలించి ప్రతిఘటించాలని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి చెప్పారు. మాజీ మేయర్‌ కటారి హేమలతపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కొనసాగించాలని పులివర్తి నాని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి  పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. వైసీపీ చేస్తున్న కులరాజకీయాల ట్రాప్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు పడొద్దని ఎమ్మెల్సీ దొరబాబు సూచించారు. వైసీపీ నేతలు పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి భూకబ్జాదారుడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఒప్పుకోవడం అభినందనీయమని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల పరిశీలకులు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, చెన్నూరు సుధాకర్‌, బి.సురేంద్ర, బి.హరిప్రసాద్‌, జి.ఖాదర్‌బాషా, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులు, కార్యదర్శి సురేంద్రకుమార్‌,  పార్టీ రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి పాచిగుంట మనోహర్‌ నాయుడు, చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, పార్టీ రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథవాసు, స్టేట్‌ మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌వర్మ, నేతలు భానుప్రకాష్‌, చిట్టిబాబు నాయుడు, త్యాగరాజన్‌, తెలుగుమహిళ అధ్యక్షురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T06:42:17+05:30 IST