బీసీలు తెగించి పోరాడితేనే రాజ్యాధికారం

ABN , First Publish Date - 2021-10-28T06:39:15+05:30 IST

బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం కేంద్రంపై పోరాటానికి సిద్ధమని, బీసీలంతా తెగించి పోరాడితేనే రాజ్యాధికారం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

బీసీలు తెగించి పోరాడితేనే రాజ్యాధికారం
ఐక్యతను చాటుతున్న బీసీ సేన రాష్ట్ర, జిల్లా నాయకులు

  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య
రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 27: బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం కేంద్రంపై పోరాటానికి సిద్ధమని, బీసీలంతా తెగించి పోరాడితేనే రాజ్యాధికారం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి జగన్‌ వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తన ఎంపీలతో ప్రైవేట్‌ బిల్లు పెట్టించాలని ఆయన కోరారు. రాజమహేంద్రవరం జాంపేటలోని శ్రీ ఉమారామలింగేశ్వర కల్యాణ మండపంలో బీసీ సేన రాష్ట్ర, జిల్లా నాయకుల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆన్‌లైన్‌ లైవ్‌లో మాట్లాడారు. బీసీల హక్కుల సాధన కోసం మనపోరాటం కేంద్రంపైనే అని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో త్వరలో ప్రధాని మోదీని కలిసే ఆలోచన చేస్తున్నామన్నారు.  రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ బీసీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, 50 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రుడా ఛైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి మాట్లాడుతూ ఆర్‌.కృష్ణయ్య ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా కొత్తగా పదవులు చేపడుతున్నవారు పనిచేయాలని కోరారు. తాను బీసీ కాకపోయినా బీసీల ఆడపడుచునేనని బీసీల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వద్దకు రావచ్చని అన్నారు. బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు శొంటి నాగరాజు, తెలంగాణ-ఆంధ్ర నిరుద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేశ్వరరావు, బీసీ సేన రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనుచంద్రప్రసాద్‌, తెలంగాణ బీసీ విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్‌ బబ్లూ గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చంటి ముదిరాజ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ బీసీలంతా రాజ్యాధికారం దిశగా పోరాటం సాగించాలని అన్నారు.  బీసీ సేన రాష్ట్ర యువజన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బూడిద శరత్‌కుమార్‌, బీసీసేన జిల్లా అధ్యక్షుడిగా దొమ్మేటి స్వర్ణకుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పుష్పరాజ్‌, బీసీ సేన కోస్తాంధ్ర అధ్యక్షుడు పితాని ప్రసాద్‌, పండు, డాక్టర్‌ అనసూరి పద్మలత, దుర్గారావు, ఆరిఫ్‌, చింతా శ్రీనివాసరావు మాట్లాడారు.

Updated Date - 2021-10-28T06:39:15+05:30 IST