Modi Karnataka Visit : నాసిరకం రోడ్డు నిర్మాణం... ఇద్దరు ఇంజినీర్ల సస్పెన్షన్...

ABN , First Publish Date - 2022-07-23T20:40:51+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటన నేపథ్యంలో నిర్మించిన

Modi Karnataka Visit : నాసిరకం రోడ్డు నిర్మాణం... ఇద్దరు ఇంజినీర్ల సస్పెన్షన్...

బెంగళూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటన నేపథ్యంలో నిర్మించిన రోడ్డు కుంగిపోవడంతో ఇద్దరు ఇంజినీర్లను బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) శుక్రవారం సస్పెండ్ చేసింది. వీరిలో ఒకరు వచ్చే నెలలో పదవీ విరమణ చేయవలసి ఉంది. జూన్ 20న మోదీ ఈ నగరంలో పర్యటించారు. 


దక్షిణ బెంగళూరులోని జ్ఞాన భారతి (Jana Bharathi) మెయిన్ రోడ్డును రూ.6.05 కోట్లతో ఆధునికీకరించారు. బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రాంగణం పరిధిలోని 3.6 కి.మీ. రోడ్డును బీబీఎంపీ వేసింది. ప్రధాని మోదీ జూన్ 20న  ఈ రోడ్డుపై నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌ (Dr B R Ambedkar School of Economics)కు వెళ్ళారు. జూన్ 21న కొద్దిపాటి వర్షం కురిసింది. అనంతరం ఈ స్కూల్ గేట్ నుంచి కొద్ది దూరంలోని రోడ్డు భూమిలోకి కుంగిపోయింది. 


ఆధునికీకరించిన రోడ్డు ఒక రోజులోనే కుంగిపోవటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం కూడా దీనిపై ఓ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. 


బీబీఎంపీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఎమల్షన్ బదులు కిరోసిన్ వాడారని, 110 నుంచి 140 డిగ్రీల ఉష్ణోగ్రతతో బిటుమెన్‌ను జల్లవలసి ఉండగా, 90 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతతో దీనిని జల్లారని తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హెచ్‌జే రవి, అసిస్టెంట్ ఇంజినీర్ ఐకే విశ్వాస్‌లను బీబీఎంపీ శుక్రవారం సస్పెండ్ చేసింది. వీరిలో రవి ఆగస్టులో పదవీ విరమణ చేయవలసి ఉంది. 


Updated Date - 2022-07-23T20:40:51+05:30 IST