Baton charge: రైతుపై విరిగిన లాఠీ

ABN , First Publish Date - 2022-07-31T16:49:44+05:30 IST

రైతుపై ఖాకీ తన ప్రతాపం చూపించాడు. చేతిలో ఉన్న లాఠీతో కాళ్ల ఎముకలు విరగొట్టాడు. అడ్డుకున్న రైతు భార్యపై కూడా ఆ ఎస్‌ఐ విచక్షణ కోల్పోయి

Baton charge: రైతుపై విరిగిన లాఠీ

- రెచ్చిపోయిన కురుగోడు ఎస్‌ఐ 

- పలు ద్విచక్ర వాహనాల ధ్వంసం

- తిరగబడిన రైతులు

- కాలువ గట్టుపై గంట పాటు ఉద్రిక్తత

- ఇదంతా పొలిటికల్‌ డ్రామా: ఎస్పీ


బళ్లారి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రైతుపై ఖాకీ తన ప్రతాపం చూపించాడు. చేతిలో ఉన్న లాఠీతో కాళ్ల ఎముకలు విరగొట్టాడు. అడ్డుకున్న రైతు భార్యపై కూడా ఆ ఎస్‌ఐ విచక్షణ కోల్పోయి కింద పడేశాడు. ఈ సంఘటన శనివారం బళ్లారి రూరల్‌(Bellary Rural) పరిధిలోని కోళూరు గ్రామ సమీపంలో ఉచ్చప్ప పంట కాలువ గట్టుపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోళూరు గ్రామం వద్ద కాలువ నీటిలో ఒక మహిళ శవం పడి ఉంది. కాలువ గట్టుపై నుంచి పొలానికి వెళ్లే రైతులు చూస్తూ ఆగారు. ఇంతలో పోలీసులు వచ్చారు. కోళూరు గ్రామానికి చెందిన ఈరన్న అనే రైతు కూడా తన భార్యతో పొలానికి ద్విచక్ర వాహనంలో వెళుతూ కాలువలో తేలాయాడుతున్న మహిళా శవాన్ని చూసి ఆగాడు. ఇంతలో కురుగోడు పోలీస్టేషన్‌ ఎస్‌ఐ మణికంఠ(Police Station SI Manikantha), కానిస్టేబుళ్లు వచ్చారు. చాలా మంది రైతులు ఆక్కడ ఆగడంతో పోలీసులు రైతులను మందలించారు. దీంతో రైతులు, పోలీసులకు కొంత మాటా మాటా పెరిగాయి. దీంతో అక్కడే ఉన్న ఈరన్న అనే రైతును ఎస్‌ఐ లాఠీతో చితక బాదాడు. దీంతో అతడి కుడి కాలు ఎముక విరిగింది. అడ్డు వచ్చిన రైతు భార్యను చేతితో తోసి కిందకు పడేశారు. పోలీసులు విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్న రైతుల ద్విచక్రవాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో రైతులు పోలీసులపై తిరగబడ్డారు. ఇలా దాదాపు గంట పాటు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ విషయం కంప్లి ఎమ్మెల్యే గణేష్‌(MLA Ganesh)కు తెలియడంతో ఆయన ఆక్కడికి చేరుకుని సర్దిచెప్పారు. గాయపడిన రైతు ఈరన్న బళ్లారి విమ్స్‌కు అనుబందంగా ఉన్న ట్రామాకేర్‌ అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసులు నమోదు కాలేదని కురుగోడు సీఐ తెలిపారు. కోళూరు వద్ద ఎస్‌ఐ మణికంఠ, రైతుల మధ్య జరిగిన వివాదం ఒక రాజకీయ డ్రామా అని ఎస్పీ సైదూల్‌(SP Saidul) అదావత్‌ పేర్కొన్నారు. ఎస్‌ఐపై ఆధిపత్యం చలాయించడానికి అక్కడ ఒక నాయకుడు కావాలని ఇలా డ్రామా ఆడించాడని ఎస్పీ తెలిపారు. వాస్తవాలు విచారిస్తున్నామని వివరించారు.

Updated Date - 2022-07-31T16:49:44+05:30 IST