బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైని ఎంపిక చేశారు. బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన్ను సీఎంగా ఎన్నుకున్నారు. అధిష్టాన పరిశీలకులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు. సీఎం రేసులో కర్ణాటక హోం మంత్రి బసవరాజు బొమ్మై, అరవింద్ బెల్లాడ్, సీటీ రవి ఉన్నారని ప్రచారం జరిగినా చివరకు బసవరాజు బొమ్మైనే బలపరిచారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా బొమ్మై పేరునే సూచించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం గురువారం ఉండే అవకాశముంది. కొత్త కేబినెట్లో భారీ మార్పులు జరిగే అవకాశముందని భావిస్తున్నారు.