బార్లకు.. సిండికేట్‌

ABN , First Publish Date - 2022-08-01T04:50:06+05:30 IST

జిల్లాలో బార్‌ లైసెన్స్‌లకు వేలం నిర్వహించగా వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. కొన్ని చోట్ల అధికార పార్టీ బెదిరింపులతో ఆసక్తి ఉన్నా వ్యాపారులు ముందుకురాలేదని సమాచారం.

బార్లకు.. సిండికేట్‌

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

అధికార బెదిరింపులతో వ్యాపారులు వెనుకంజ

నరసరావుపేటలో నేరుగా రంగంలోకి దిగిన అధికారులు 

బిడ్డింగ్‌లో పాల్గొంటే బార్లను పగలగొడతామని హెచ్చరికలు

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగిన బార్ల లైసెన్స్‌ ప్రక్రియ

జిల్లాలో 53 బార్ల లైసెన్సులకు వేలం ఆదాయం రూ.21.09 కోట్లు 


నరసరావుపేట, జూలై 31: జిల్లాలో బార్‌ లైసెన్స్‌లకు వేలం నిర్వహించగా వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. కొన్ని చోట్ల అధికార పార్టీ బెదిరింపులతో ఆసక్తి ఉన్నా వ్యాపారులు ముందుకురాలేదని సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేతల కనుసన్నల్లో బార్‌ లైసెన్స్‌లకు బిడ్‌ దాఖలు చేసే ప్రక్రియ సాగింది. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీ నేతలకు బార్లు దక్కే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. సిండికేట్‌తో ప్రభుత్వం ఆదాయానికి భారీగా గండి పండిందని చెప్పవచ్చు. అధికార పార్టీ నేతలే ప్రభుత్వ ఆదాయానికి గండి పడటానికి కారుకులన్న విమర్శలున్నాయి. 53 బార్లకు రూ.21.09 కోట్లు ఆదాయం వచ్చిందని ఎక్సైజ్‌ డిపో మేనేజర్‌ తెలిపారు. జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, దాచేపల్లి చిలకలూరిపేట మున్సిపాల్టీల పరిధిలో బార్‌ లైసెన్స్‌లకు ప్రభుత్వం ఆదివారం బిడ్డింగ్‌ నిర్వహించింది. మొత్తం 53 బార్లకు 72 మంది దరఖాస్తు చేశారు. వీరిలో అధికార పార్టీ ఒత్తిళ్లతో 12 మంది బిడ్డింగ్‌లో పాల్గొనలేదు. ఆయా బార్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన అప్‌సెట్‌ ధర కన్నా రెండు మూడు లక్షలు మాత్రమే అదనంగా పలికాయి.  టీడీపీ, జనసేన పార్టీ సానుభూతి పరులను వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. నరసరావుపేటలో ముగ్గురు అధికారులు టీడీపీ, జనసేన సానుభూతి పరులైన ఆరుగురు దరఖాస్తుదారులను పిలిచి బెదిరించినట్టు ప్రచారం జరుగుతున్నది. బిడ్‌ దాఖలు చేసినా వేలంలో పాల్గొనడానికి వీలులేదని, ఒక వేళ వేస్తే బార్‌ను పగల కొడతారని బెదిరించినట్లు తెలిసింది. ఏదైనా సంఘటన జరిగితే రక్షణ కల్పించాల్సిన అధికారులే ఇలా బెదిరింపులకు దిగడం విమర్శలకు దారితీసింది. వాస్తవానికి పల్నాడు ప్రాంతంలో మద్యం గిరాకీ ఉంటుంది. గతంలో దాచేపల్లి, పిడుగురాళ్లలో రూ.2 కోట్లకు పోటా పోటీగా దక్కించుకున్న సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ మారు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అధికార పార్టీ నేతల   బెదిరింపులతో మద్యం వ్యాపారులు బెంబేలెత్తి వేలంలో పాల్గొనలేదని సమాచారం. 

- నరసరావుపేటలో 17 బార్లకు వేలం నిర్వహించారు. వీటికి అప్‌సెట్‌ ప్రైజ్‌ రూ.35 లక్షలు. అయితే మూడు బార్లకు అత్యధికంగా రూ.51 లక్షలు చొప్పున వేలం ఖరారైనట్లు అధికారులు తెలిపారు. అధికార హెచ్చరికలు ఉన్నా టీడీపీకి చెందిన వారుగా చెబుతున్నా ముగ్గురు వ్యాపారులు ఒక్కో బార్‌కు రూ.51 లక్షలకు బిడ్‌ దాఖలు చేశారు. దీంతో అధికార పార్టీ నేతలు ఖంగుతిన్నారు. 12 బార్లకు రూ.49 లక్షలకు ఖరారు చేశారు. రెండు బార్లకు సంబంధించి ఐదుగురు వ్యాపారులు రూ.47 లక్షలకు బిడ్‌ దాఖలు చేయడంతో లాటరీ పద్ధతిలో వీటిని కేటాయించారు. ఈ ప్రక్రియలో జనసేన పార్టీకి చెందిన వ్యక్తికి బిడ్‌ దక్కిందని సమాచారం. ఒక్క నరసరావుపేటలోని బార్లకు రూ.8.35 కోట్లు ఆదాయం రాగా ఇతర పట్టణాల్లోని 36 బార్లకు రూ.12.74 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. వివిధ మున్సిపాల్టీల్లోని బార్లకు అధికార పార్టీకి చెందిన వ్యాపారులు సిండికేట్‌ అయ్యారని అందువల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్న ప్రచారం జరుగుతున్నది.

- చిలకలూరిపేటలో 11 బార్లకు వేలం జరగ్గా 14 మంది వరకు దరఖాస్తు చేశారు. ఈ వేలంలో 11 మంది మాత్రమే పాల్గొన్నారు. దీనినిబట్టి అన్ని బార్లకు  సిండికేట్‌ అయినట్టు సమాచారం. ఇక్కడ లైసెన్స్‌ ఫీజును ప్రభుత్వం రూ.35 లక్షలు నిర్ణయించగా కేవలం నాలుగు అదనంగా రూ39 లక్షలు మాత్రమే కోట్‌ చేసి బార్లను దక్కించుకున్నారు. 

- సత్తెనపల్లిలో నాలుగు బార్లకు 8 దరఖాస్తులు రాగా హెచ్చు పాట రూ.37 లక్షలకు పోయింది.

- పిడుగురాళ్లలో ఆరు బార్లకు 6 దరఖాస్తులు రాగా హెచ్చు పాట రూ.37 లక్షలకు పోయింది. 

- గురజాలలో 2 బార్లకు రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

- దాచేపల్లిలో 3 బార్లకు 4 దరఖాస్తులు వచ్చాయి.  హెచ్చు పాట రూ. 17 లక్షలకు పోయింది. 

- మాచర్లలో 3 బార్లకు 3 దరఖాస్తులు రాగా హెచ్చు పాట రూ.37 లక్షలకు పోయింది. 

- వినుకొండలో 7 బార్లకు 10 దరఖాస్తులు రాగా హెచ్చు పాట రూ.39 లక్షలకు పోయింది. 


Updated Date - 2022-08-01T04:50:06+05:30 IST