సీసీఎంబీ విస్తరణకు అవరోధం

ABN , First Publish Date - 2022-05-23T06:20:54+05:30 IST

మనిషి,జంతువులు,సూక్ష్మజీవుల మూలకణాలపై పరిశోధనలు చేస్తూ ఆకస్మిక వ్యాధుల కారకాలను గుర్తించే లక్ష్యంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ (సీసీఎంబీ)పరిశోధనాకేంద్రాన్ని రూ.1200కోట్లతో విస్తరించాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది.

సీసీఎంబీ విస్తరణకు అవరోధం

48 ఎకరాల అసైన్డ్‌ భూమి కొలిక్కి

72 ఎకరాల ప్రభుత్వ స్థలంపై కొరవడిన స్పష్టత

సీసీఎంబీ విస్తరణను ఆరేళ్ల క్రితం ప్రతిపాదించిన కేంద్రం

నేటికీ ముందుకు సాగని ప్రాజెక్టు


భువనగిరిటౌన్‌, మే 22: మనిషి,జంతువులు,సూక్ష్మజీవుల మూలకణాలపై పరిశోధనలు చేస్తూ ఆకస్మిక వ్యాధుల కారకాలను గుర్తించే లక్ష్యంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ (సీసీఎంబీ)పరిశోధనాకేంద్రాన్ని రూ.1200కోట్లతో విస్తరించాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన స్థలాన్ని ప్రస్తుత సీసీఎంబీకి సమీపంలో స్థలాన్ని కేటాయించాలని ఆరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరిం ది. ఈమేరకు అధికారులు యాదాద్రి జిల్లా పరిధిలోని బొమ్మాయిపల్లిలో 120 ఎకరాల ప్రభుత్వ,అసైన్డ్‌ భూమిని సీసీఎంబీకి కేటాయించేందు కు 2018లో నిర్ణయించారు. ఇప్పటి వరకు అసైన్డ్‌ భూమి సేకరణ తుది దిశకు చేరుకోగా, ప్రభుత్వ భూమి కేటాయింపు మాత్రం హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల వద్ద పరిశీలన దశలోనే ఉంది. భూ కేటాయింపులో జాప్యంతో దేశంలో నే ఏకైక సీ సీఎంబీ పరిశోధనా కేంద్రం కార్యకలాపాల విస్తరణకు విఘాతం కలుగుతోంది.


భూ కేటాయింపులో జాప్యం

బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ సమీపంలో, మరో ప్రాంతంలో సీసీఎంబీకి స్థలాన్ని కేటాయించాలని అధికారులు తొలుత నిర్ణయించారు. ఆ స్థలాలపై కోర్టు వివాదాలు ఉండటంతోపాటు అనువుగా లేకపోవడంతో సీసీఎంబీ నిరాకరించింది. దీంతో భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని బొమ్మాయిపల్లి రెవెన్యూలోని 85 సర్వే నంబర్‌లోని 120 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూమిని స్థానిక అధికారులు ఎంపికచేశారు. దీనికి సీసీఎంబీ ఆమోదం తెలపడంతో రెవెన్యూ అధికారులు నాలుగేళ్ల క్రితం భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. 36 మంది రైతుల నుంచి 48 ఎకరాల అసైన్డ్‌ భూమి సేకరణకు 2020, ఆగస్టు 11న నోటిఫికేషన్‌ జారీ చేసి ఇప్పటి వరకు 33మంది రైతుల నుంచి 43ఎకరాలు సేకరించారు. ఎకరాకు రూ.16లక్షల చొప్పున రూ.5,40,28,916 పరిహారం కూడా చెల్లించారు. పెండింగ్‌ లో ఉన్న మరో ముగ్గురు రైతులకు చెందిన సుమారు 5ఎకరాల భూ సేకరణ ను కూడా త్వరలో పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే సర్వే నెంబర్‌లోని 72 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సీసీఎంబీకి కేటాయించేందుకు జిల్లా అధికారులు 2018, ఆగస్టు 8న ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి పలు కారణాలతో 72ఎకరాల ప్రభుత్వ స్థల కేటాయింపుపై స్పష్టత రాకపోవడంతో సీసీఎంబీ ఏర్పాటులో ఆలస్యం అవుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి భూ కేటాయింపు లో జాప్యాన్ని నివారించాలని పలువురు కోరుతున్నారు.


సీసీఎంబీ ఇలా..

పరిశోధనా రంగంలో కీలకమైన సీసీఎంబీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతోంది. తార్నాక సమీపంలోని 10ఎకరాల్లో సీసీఎంబీ ప్రధాన పరిశోధనా కేంద్రం, సమీపంలోని ఎన్‌జీఆర్‌ఐలో 5ఎకరాల్లో, అత్తాపూర్‌లో మరో 5ఎకరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సీసీఎంబీ లో సుమారు 70 మంది శాస్త్రవేత్తలు మానవ, జీవ కణాలపై నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. సుమారు 150మంది పీహెచ్‌డీ విద్యార్థులు పలు అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.


సీసీఎంబీ ఏర్పాటైతే

భువనగిరి బొమ్మాయిపల్లిలో 120ఎకరాల్లో రూ.1200కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సీసీఎంబీ వినియోగంలోకివస్తే పూర్తిస్థాయిలో పరిశోధనా రంగం విస్తృతం కానుంది. అదేవిధంగా రాష్ట్రంతోపాటు, ప్రత్యేకించి యాదాద్రిజిల్లాకు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం లభించనుంది.అలాగే బొమ్మాయిపల్లి 85 సర్వేనెంబర్‌లో మరింత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో మరిన్ని ప్రభుత్వ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం కూడా ఉంది.దీంతో ఈప్రాంతం పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.

Updated Date - 2022-05-23T06:20:54+05:30 IST