కరోనా టైంలో బార్బర్ హెల్ప్.. ఫ్రీగా హెయిర్ కట్!

ABN , First Publish Date - 2020-09-15T17:47:26+05:30 IST

కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా అల్పాదాయ వర్గాల వారు నానాఇబ్బందులూ పడ్డారు. వారికి పూటగడవడమే కష్టమైంది.

కరోనా టైంలో బార్బర్ హెల్ప్.. ఫ్రీగా హెయిర్ కట్!

కోచి: కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా అల్పాదాయ వర్గాల వారు నానాఇబ్బందులూ పడ్డారు. వారికి పూటగడవడమే కష్టమైంది. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తేసినా వారి జీవితాలు గాడిన పడాలంటే ఇంకా సమయం పడుతుంది. ఈ క్రమంలో ఇలాంటి వారికి సాయం చేస్తున్నాడో బార్బర్. తను కోటీశ్వరుడిని కాకపోయినా, కోట్లు విలువ చేసే మనసుందని నిరూపిస్తున్నాడు.


లాక్‌డౌన్ కారణంగా బార్బర్‌ షాపులు కూడా తీవ్రంగా నష్టపోయాయి. లాక్‌డౌన్ తొలగించినా బార్బర్ షాపులకు వెళ్లడానికి ప్రజలు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో తనలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి చేతనైన సాయం చేయాలని కేరళకు చెందిన గోపి అనుకున్నాడు. కోచి ప్రాంతంలో ఇతనికి ఓ హెయిర్‌ సెలూన్ ఉంది.


సాయం చేసేందుకు తన వద్ద బార్బర్ విద్య తప్ప, డబ్బు లేదని గోపీకి తెలుసు. అందుకే తన విద్యనే విరాళం ఇవ్వాలనుకున్నాడు. 14ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా హెయిర్ కట్ చేస్తానని బోర్డు పెట్టేశాడు. ఇది చూసిన చాలామంది అల్పాదాయ వర్గాల వారు గోపీ షాపుకు క్యూ కడుతున్నారు. కరోనా కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడం కూడా కష్టమైందని, దీంతో కనీసం పిల్లలకు హెయిర్‌ కట్ చేయించే స్థోమత కూడా తమకు కరువైందని వీళ్లు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో గోపీ సాయం తమకు చాలా మేలు చేస్తోందంటున్నారు.


14ఏళ్లలోపు పిల్లలంటే ఎక్కువగా స్కూలు పిల్లలే ఉంటారని, వీరికి సాయం చేయడం తనకు కూడా సంతోషమేనని గోపీ చెప్పాడు. లాక్‌డౌన్ సమయంలో దాదాపు 5నెలలు షాపు మూసి ఉండటంతో తాను కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించాడు. తనలాంటి వారికి ఏదైనా సాయం చేయాలని బాగా ఆలోచిస్తే ఈ ఐడియా తట్టిందని వివరించాడు.


"మామూలుగా హెయిర్ కట్ చేస్తే 100 రూపాయలు చార్జ్ చేస్తాం. కానీ ఈ కరోనా కాలంలో ఎవరి దగ్గరా సరిగా డబ్బులేదు. అందుకే వారిపై భారం తగ్గించేందుకు పిల్లలకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తున్నా. ఒక్కోసారి పెద్దవాళ్లు కూడా 100 రూపాయలు ఇవ్వలేరు. అప్పడు వారు ఇచ్చినంతే సంతోషంగా తీసుకుంటా" అని గోపీ చెప్పాడు.


గోపీకి కోచిలో మూడు బార్బర్‌ షాపులున్నాయి. వాటిలో ఒక దానిలో ఈ ఫ్రీ హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. ఒక్కోసారి పెద్దవాళ్లకు కూడా ఉచితంగా హెయిర్ కట్ చేస్తున్నాడట. కరోనా మహమ్మారి బెడద తగ్గేవరకూ తన సేవను కొనసాగిస్తానని గోపీ స్పష్టంచేశాడు. గోపీ సేవను తాము ఎప్పటికీ మర్చిపోవడం జరగదని స్థానికులు మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2020-09-15T17:47:26+05:30 IST