బెజవాడ.. బాపు జాడ

ABN , First Publish Date - 2022-08-15T05:47:04+05:30 IST

జాతిపిత గాంధీ నడయాడిన నేల బెజవాడ.

బెజవాడ.. బాపు జాడ

  ఏడుసార్లు నగరానికి వచ్చిన జాతిపిత 

 గాంధీ అడుగుజాడలతో చరిత్రలో నిలిచిన విజయవాడ 

 ఆంధ్రజ్యోతి, విజయవాడ : జాతిపిత గాంధీ నడయాడిన నేల బెజవాడ. ఆ మహాత్ముని అడుగుజాడలకు నిదర్శనంగా బెజవాడ రైల్వేస్టేషన్‌ నిలుస్తోంది. డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రోత్సవాల్లో బెజవాడ ఘనత ఏమిటో.. రైల్వేస్టేషన్‌ చాటి చెబుతోంది. విజయవాడ రైల్వేస్టేషన్‌కు అభిముఖంగా గాంధీ మహాత్ముని ఐకాన్‌ను ఏర్పాటు చేయటం ద్వారా విజయవాడ రైల్వేస్టేషన్‌ ప్రాధాన్యతను చాటి చెప్పారు. విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌లో ఈస్ట్‌ మెయిన్‌ ఎంట్రన్స్‌ రెండు బ్లాకుల్లో గాంధీ పోర్ట్రయిట్స్‌ను ఏర్పాటు చేశారు. మహాత్ముని జాతీయోద్యమ పోరాట సన్నివేశాలతో కూడిన పోర్ట్రయిట్స్‌ ప్రయాణికుల వెయిటింగ్‌ హాళ్లలో ఏర్పాటు చేశారు. గాంధీ రాకకు చిహ్నంగా విజయవాడలో గాంధీహిల్‌ ఉంది. గాంధీ స్పెషల్‌గా విజయవాడ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతోంది. 

విజయవాడలో మహాత్ముడి అడుగులు

 మొదటి సారిగా గాంధీ మార్చి 31, 1919లో విజయవాడ వచ్చారు. రామమోహన్‌రాయ్‌ లైబ్రరీలో పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొనటానికి వచ్చారు. బ్రిటీషు ప్రభుత్వం తీసుకు వచ్చిన రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా స్వాతంత్రపోరాటం జరిపేవారిని చైతన్య చేయటానికి వచ్చారు. 

  గాంధీ రెండో సారి ఆగస్టు 23, 1920లో విజయవాడ వచ్చారు. నాటి మునిసిపల్‌ బంగ్లాలో గాంధీ బస చేశారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా కీలక ఉపన్యాసం చేశారు. 

ఫ మూడవసారి ఆలిండియా కాంగ్రెస్‌ మీటింగ్‌లో భాగంగా మార్చి 31, ఏప్రిల్‌ 1 , 1921లో వచ్చారు. స్వరాజ్య నిధి కింద రూ.25,000 విరాళం ఇచ్చారు. ఇదే సమయంలో స్వాతంత్ర పోరాట వీరుడు పింగళి వెంకయ్య మువ్వన్నెల పతాకాన్ని గాంధీకి అందించారు.  

  నాలుగోసారి ఏప్రిల్‌ 10, 1929లో మహాత్మాగాంధీ విజయవాడ వచ్చారు. ఖద్దరు యాత్రలో భాగంగా గుణదల, మొగల్రాజపురం ఖద్దరు కేంద్రాలను సందర్శించారు. 

  ఐదోసారి డిసెంబర్‌ 16, 1933లో హరిజన యాత్రలో భాగంగా    మొగల్రాజపురంలో మీటింగ్‌లో పాల్గొన్నారు. 

  ఆరోసారి జనవరి 23, 1937లో గాంధీ విజయవాడ వచ్చారు. గుంటూరు జిల్లాలో తుపాను పరిస్థితులను అధ్యయనం చేశారు.

  ఏడోసారి జనవరి 21, 1946 విజయవాడకు ప్రత్యేక రైలులో గాంధీజీ వచ్చారు. హిందీ ప్రచార సభలో భాగంగా వచ్చారు. రైలు నుంచే ప్రజలకు గాంధీజీ అభివాదం తెలిపారు. ఏడు సార్లు మహత్ముడు అడుగుపెట్టిన రైల్వేస్టేషన్‌గా విజయవాడ నిలిచింది.  


Updated Date - 2022-08-15T05:47:04+05:30 IST