మూడు నెలలైనా.. మారలేదు

ABN , First Publish Date - 2022-07-04T05:10:06+05:30 IST

కార్యాలయాలు లేవు.. ఉంటే వసతులు లేవు.. అధికారులున్నారు.. కాని సబ్బింది నియామకాలు లేవు.. మరికొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేశారు.

మూడు నెలలైనా.. మారలేదు
బాపట్ల కలెక్టరేట్‌లో ఒక కార్యాలయం కోసం జరుగుతన్న మరమ్మతు పనులు

నేటికీ జిల్లా ఆవిర్భావం నాటి పరిస్థితులే 

కొలిక్కిరాని కార్యాలయాలు, సిబ్బంది నియామకం

కళాశాలల ఆవరణల్లోనే ఇంకా తాత్కాలిక కార్యాలయాలు 

అరకొర వసతుల మధ్యే కార్యాలయాల్లో కార్యకలాపాలు

తమ గురించి పట్టించుకునే వారే లేరంటూ అధికారుల అసంతృప్తి


 బాపట్ల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కార్యాలయాలు లేవు.. ఉంటే వసతులు లేవు.. అధికారులున్నారు.. కాని సబ్బింది నియామకాలు లేవు.. మరికొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేశారు. ఇదీ బాపట్ల జిల్లా పరిస్థితి. జిల్లాగా బాపట్ల ఆవిర్భవించి సోమవారానికి సరిగ్గా మూడు నెలలు అవుతుంది. అయితే ఆవిర్భావ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేటికి కూడా అవే పరిస్థితులు. తొలుత హడావుడిగా కార్యాలయాలు ఏర్పాటు చేశారు.. ఆ తర్వాత నిదానంగా భవనాలు, వసతుల ఏర్పాటుతో పాటు సిబ్బంది నియామకాలు జరుగుతాయని భావించారు. అయితే మూడు నెలలైనా ఇప్పటికీ కార్యాలయాలలో సిబ్బంది, మౌలిక వసతుల కల్పన సదుపాయం ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఉద్యోగులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. తమను ఆయా శాఖలకు పంపించి వదిలేశారే తప్ప కనీసం విభాగాల ప్రధాన కార్యాలయాల అధిపతులు పట్టించుకోలేదని వాపోతున్నారు. కొత్త జిల్లాలో తమ బాగోగుల గురించి ఆయా శాఖల ప్రధాన కార్యాలయాల అధికారులు పట్టించుకోకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ పర్యటనలను, కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించే సమాచార పౌర సంబంధాలశాఖ వారు వాహనానికి పెట్రోలు ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కార్యాలయాల్లో కంప్యూటర్లు, కుర్చీలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అసలే సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న కార్యాలయాలు ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో కొంతమంది పొరుగు జిల్లాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ, కార్మిక శాఖ కార్యాలయాలకు సంబంధించి కనీస సిబ్బంది నియామకం కూడా చేపట్టలేదు. మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేదు. కలెక్టరేట్‌లో చాలా కార్యాలయాల మరమ్మతు పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.


కళాశాల భవనాల్లో కార్యాలయాలు..

మూడు నెలల క్రితం తాత్కాలికంగా కళాశాల భవనాల్లో వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున తమకు ఇబ్బంది అవుతుందని ఆయా కళాశాలల నిర్వాహకులు వాపోతున్నారు. అయితే ఈ విషయాన్ని బాహటంగా వారు చెప్పలేకపోతున్నారు. బాలసదనంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దానిని కూడా అక్కడి నుంచి తరలిస్తే అక్కడ పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుంది.  

Updated Date - 2022-07-04T05:10:06+05:30 IST