Abn logo
Jul 1 2020 @ 02:16AM

పూర్తి నిషేధం సాధ్యం కాదు

  • వీపీఎన్‌ల ద్వారా వాడే అవకాశం ఉంది
  • ఇన్‌బిల్ట్‌ యాప్‌లనూ తొలగించవచ్చు
  • లేనిపక్షంలో చర్యలు తీసుకొనే అవకాశం 
  • చైనా యాప్‌ల నిషేధం హర్షణీయమే
  • ప్రముఖ టెక్‌ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌

కేంద్ర ప్రభుత్వం 59 చైనా అప్లికేషన్లను నిషేధించడం హర్షించదగ్గ పరిణామమని ప్రముఖ టెక్‌ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌ అన్నారు. అయితే, ఈ టెక్నాలజీ యుగంలో యాప్‌లను పూర్తిగా నిషేధించడం కష్టమని.. వర్చువల్‌ ప్రైవేట్‌ ట్‌వర్క్‌(వీపీఎన్‌)లను వినియోగించేవారు వాటిని వాడే అవకాశం ఉంద న్నారు. చైనా యాప్‌ల నిషేధంపై ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడిన శ్రీధర్‌ వినియోగదారుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఆ విశేషాలు..


నిషేధం ఎలా అమలు చేస్తారు?

వినియోగదార్ల ఫోన్లలో ఉన్న నిషేధిత యాప్స్‌ నిర్వీర్యానికి ప్రభుత్వానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) జోక్యం ద్వారా టెలికం కంపెనీలు, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించే సంస్థల సహకారంతో చైనా అప్లికేషన్ల నుంచి వాటి హోస్ట్‌లకు ఎలాంటి అభ్యర్థనలూ వెళ్లకుండా అడ్డుకోవడం మొద టి పద్ధతి. ఉదాహరణకు మన ఫోన్‌లో ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసిన టిక్‌టాక్‌ యాప్‌ను వాడాలని ప్రయత్నిస్తే ‘నో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌’ అని వస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ పనిచేసింది. ఇంటర్నెట్‌ గేట్‌వే వద్దే సమాచారాన్ని అడ్డుకునే పద్ధతి ఇది. ఇక రెండోపద్ధతి.. వినియోగదారుల ప్రమేయం లేకుండానే యాప్‌ల తొలగింపు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని తయారు చేసిన గూగుల్‌ సంస్థకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఆ పని చేయగలదు. 


ఇన్‌బిల్ట్‌ యాప్‌ల సంగతేమిటి?

షామీ, ఒప్పో, వివో వంటి అనేక చైనా ఫోన్లలో యు.సి.బ్రౌజర్‌, ఎంఐ కమ్యూనిటీ వంటి అప్లికేషన్స్‌ అంతర్గతంగా పొందుపరచబడి(ఇన్‌బిల్ట్‌) ఉన్నాయి. వాటిని తొలగించాలంటే అప్‌డేట్‌ను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వం ఆయా యాప్‌ల నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించవచ్చు. ‘లేనిపక్షంలో మీ ఫోన్ల అమ్మకాలపై చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించడం ద్వారా కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. 


రెండు మార్గాలు..

నిషేధిత అప్లికేషన్లను గూగుల్‌ ప్లేస్టోర్‌లో, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో భారతీయ వినియోగదారులకు కనిపించకుండా చేయవచ్చు. వాటిని పూర్తిగా ఇంటర్నెట్‌ నుంచి కనిపించకుండా చేయడం అసాధ్యం. అవి యాప్‌స్టోర్లలో లభించకపోవచ్చుగానీ.. వాటి ఏపీకే ఫైళ్లను ఏపీకెమిర్రర్‌, ఏపీకెప్యూర్‌ వంటి సర్వీసుల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్‌స్టాల్‌ చేసినా ఆ యాప్‌ను ఇక్కడి నుంచే వినియోగిస్తాం కాబట్టి మన రిక్వెస్ట్‌ దాని సర్వర్‌కు చేరకుండా ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు బ్లాక్‌ చేస్తారు. కాబట్టి, వీపీఎన్‌ సర్వీ్‌సలను ఉపయోగించి నిషేధితఅప్లికేషన్స్‌ను కొంతమంది వాడే అవకాశాలు లేకపోలేదు. భారత ప్రభుత్వం నిషేధించిన 59 అప్లికేషన్లను ఒక యూజర్‌ ఫోన్లో కలిగి ఉండ డం చట్టవ్యతిరేకమని ప్రభుత్వం నిర్ధారించలేదు. కాబట్టి వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయకుంటే చట్టాన్ని వ్యతిరేకించినట్లు భావించాల్సిన పనిలేదు. 


స్వదేశీ యాప్‌ ‘ఫోకజ్‌’

‘జూమ్‌’కి ప్రత్యామ్నాయంగా స్వదేశీ యాప్‌ ‘ఫోకజ్‌’ను కేరళకు చెందిన అంకుర సంస్థ ‘స్కైఈజ్‌ లిమిట్‌ టెక్నాలజీస్‌’ రూపొందించిందని సంస్థ సీఈవో మనోద్‌ మోహన్‌ మంగళవారం ప్రకటించారు. 4 నెలల్లో తయారు చేసిన ఈ యాప్‌ ద్వారా నాణ్యమైన వీడియో, ఆడియో కాల్స్‌ చేసుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్‌లూ నిర్వహించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, విండోస్‌ వంటి సిస్టమ్స్‌లో ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌ను 2 నెలలు ఉచితంగా అందిస్తారు.    - సెంట్రల్‌ డెస్క్‌