ఆ ఒక్క అసెంబ్లీ సీటు కోసం..

ABN , First Publish Date - 2022-04-27T17:16:24+05:30 IST

శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందే బళ్లారి కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల గోల మొదలయింది. అందుకు కారణం లేకపోలేదు. విభజన తర్వాత జిల్లాలో మొత్తం ఐదు స్థానాలు ఉండగా

ఆ ఒక్క అసెంబ్లీ సీటు కోసం..

 - బళ్లారి సిటీ ఎమ్మెల్యే టికెట్‌ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ

 - రేసులో డజను మందికి పైగానే..


శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందే బళ్లారి కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల గోల మొదలయింది. అందుకు కారణం లేకపోలేదు. విభజన తర్వాత జిల్లాలో మొత్తం ఐదు స్థానాలు ఉండగా ఒకే ఒక స్థానం జనరల్‌కు మిగిలింది. బళ్లారిలో ఎన్నికలంటే ముందు నుంచి కూడా బాగా ఖరీదు. ఇక్కడ పోటీ చేసే వారందరూ ఘనులే. బడా పారిశ్రామిక వేత్తలు, ‘ఘనులు’ ఉన్న బళ్లారిలో టికెట్‌ సాధించడమే పెద్ద సమస్యగా మారింది. ఎవరికి వారే అటు సిద్దరామయ్య, ఇటు డీకే శివకుమార్‌తో పాటు ఢిల్లీ స్థాయిలో కూడా అప్పుడే పైరవీలు మొదలు పెట్టారు. సుమారు డజనుకు పైగా ఆశావహులు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. 


బళ్లారి(కర్ణాటక): జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికల వేడి మొదలయింది. జనరల్‌ కేటగిరికి ఎమ్మెల్యే స్థానం ఒక్కటే ఉండగా ఆశావాహులు మాత్రం డజను మందికి పైగా క్యూలో నిల్చున్నారు. ఇదీ బళ్లారి కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిస్థితి. ఉమ్మడి బళ్లారి జిలాల్లో మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాలుండేవి. విడిపోయిన తరువాత విజయనగర జిల్లా పరిధిలోకి 5, బళ్లారి జిల్లా పరిధిలోకి 5 ఎమ్మెల్యే నియోజక వర్గాలు వస్తాయి. బళ్లారి జిల్లాలో బళ్లారి సిటీ, బళ్లారి రూరల్‌, కంప్లి, సిరుగుప్ప, సండూరు ఉండగా.. విజయనగర జిల్లాలో కూడ్లిగి, హర్పనహళ్లి, హగరిబొమ్మనహళ్లి, విజయనగర ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి జి ల్లాగా ఉన్నప్పుడు 5 శాసనసభ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్‌ కాగా, ఎస్సీలకు 2, జనరల్‌కు 3 స్థానాలు కేటాయించారు. విడిపోయాక బళ్లారి జిల్లా కు వచ్చిన 5 శాసనసభ స్థానాల్లో 4 స్థానాలు ఎస్టీలకే రిజర్వ్‌ కింద వెళతాయి. వీటిలో బళ్లారి రూరల్‌, కంప్లి, సిరుగుప్ప, సండూరు, ఎస్టీలకు రిజర్వ్‌ కాగా బళ్లారి సిటీ మాత్రమే జనరల్‌కు మిగిలింది. విజయనగర జిల్లాలో 5 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా కూడ్లిగి ఎస్టీకి, హగరిబొమ్మనహళ్లి, హువ్విన అడగలి స్థానాలు ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యాయి. విజయనగర, హర్పనహళ్లి మాత్రమే జనరల్‌ కోటాకు కేటాయించారు. బళ్లారి జిల్లాలో జనరల్‌కు మిగిలిన ఒక్కే ఒక్క ఎమ్మెల్యే స్థానం బళ్లారి సిటీ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలో సుమారు డజను మందికి పైగా పోటీ పడుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిసున్నాయి. కాంగ్రెస్ లో బళ్లారి సిటీ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న వారిలో మాజీ మంత్రి ముండ్లూరు రామప్ప తనయుడు ముండ్లూరు అనూఫ్‌ కుమార్‌, మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్‌ బాబు, లేదా తనయుడు ముండ్లూరు అనుమకిషోర్‌, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కేసీ కొండయ్య, లేదా తనయుడు కేసీ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే, కేపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు నారా సూర్యనారాయణరెడ్డి లేదా తనయుడు నారా భరత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అల్లం వీరభద్రప్ప కుమారుడు అల్లం ప్రశాంత్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త బలిజ సునీల్‌, మాజీ బుడా అధ్యక్షుడు జేఎస్‌ ఆంజనేయులు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి అనిల్‌ లాడ్‌, ప్రస్తుత ఎంపీ (రాజ్యసభ) నాసీర్‌ హుసేన్‌, ముల్లంగి రవీంద్రబాబు లేదా ఆయన తనయుడు ముల్లంగి నందీష్‌ బాబు.. ఇలా దాదాపు డజను మందికి పైగా బళ్లారి సిటీ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఆశలు పెట్టుకుని కాంగ్రెస్‌ పెద్దలతో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. బళ్లారి జిల్లాలో ఒకేఒక్క స్థానం జనరల్‌కు ఉండడం ఈ పోటీకి ప్రధాన కారణం. ఎక్కువ స్థానాలు ఎస్టీకి రిజర్వు కావడంతో జనరల్‌ కేటగిరికి చెందిన అతిరథ మహారథులు టికెట్‌ కోసం ప్ర యత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌ టికెట్‌ సాధించాలని చాలా మంది నాయకులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొందరు ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు. మరికొందరు రాష్ట్ర నాయకులు డీకే శివకుమార్‌, సిద్దరామయ్యతో టచ్‌లో ఉన్నారు. బళ్లారి నుంచి కాంగ్రెస్‌ నాయకులు ఎవరు రాష్ట్ర నాయకులతో కలిసినా తమకే టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. టికెట్‌ దక్కించుకోవడమే అగ్నిపరిక్ష అని చాలా మంది కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. బళ్లారి జిల్లా అంటే రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువు. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీ రాజకీయాలకు బళ్లారే కీలకం. ఇలాంటి కీలక స్థానంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏమి చేస్తుందనేది ప్రశ్న. బళ్లారి సిటీ అభ్యర్థి గెలిస్తే దాదాపు జిల్లాలో చాలా స్థానాలు ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తారనే సెంటిమెంట్‌ కూడా ఉంది. బళ్లారి సిటీ, బళ్లారి రూరల్‌, కంప్లి, సిరుగుప్ప, సండూరు ఇలా అన్నింటికి బళ్లారి కేంద్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దింపుతుందనేది ఆసక్తిగా మారింది. చాలా మంది శ్రీమంతులు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈసారి బళ్లారి సిటీ ఎమ్మెల్యే టికెట్‌కు ఆశిస్తున్నారు. మరి ఎవరికి కాంగ్రెస్‌ అండగా నిలుస్తుందో చూద్దాం అని నాయకులు అంటున్నారు. 

Updated Date - 2022-04-27T17:16:24+05:30 IST