Abn logo
Jun 13 2021 @ 00:37AM

టైగర్‌జోన్‌లో కొనసాగుతున్న జంగల్‌ బచావో

పెంబి మండలంలోని ఖానాపూర్‌ అడవుల్లో నిర్మించిన బేస్‌ క్యాంపు

క్రమంగా విస్తరిస్తున్న అడవి, పెరుగుతున్న వన్య ప్రాణులు 

మంత్రి ఇలాకాలో సరికొత్త యాక్షన్‌ ప్లాన్‌ 

రెండేళ్ల నుంచి తగ్గుముఖం పట్టిన చెట్ల నరికివేత, జంతువుల వేట 

నిర్మల్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : అటవీశాఖ జిల్లాలో చేపట్టిన ఆపరేషన్‌ జంగల్‌ క్రమంగా సత్పలితాల దిశగా పయనిస్తోంది. నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలను కలుపుకొని ఏర్పాటు చేసిన కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న జంగల్‌బచావో.. జంగల్‌ బడావో.. యాక్షన్‌ప్లాన్‌ విజయవంతమవుతోంది. ఇం దులో భాగంగానే గత రెండు సంవత్సరాల నుంచి కవ్వాల్‌ అభయారణ్యంలో చెట్ల నరికివేత భారీగా తగ్గుముఖం పట్టడమే కాకుండా అటవీవిస్తీర్ణం కూడా పెరిగిపోయింది. అలాగే వన్యప్రాణుల సంఖ్య కూడా పెరుగుతుండడమే కాకుండా పకడ్భందీ నిఘా, కఠినచర్యలతో జంతువుల వేట తగ్గుముఖం పట్టింది. జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ యాక్షన్‌ప్లాన్‌కు మరింత పదును పెరిగింది. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతి రెండు నెలలకొసారి కవ్వాల్‌ అభయారణ్యంలో చేపట్టిన జంగల్‌బచావో.. జంగల్‌బడావో యాక్షన్‌ ప్లాన్‌ ను సమీక్షిస్తుండడమే కాకుండా సంబందిత శాఖ ఉన్నతాధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓ వైపు హెచ్చరికలు, మరోవైపు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుండడమే కాకుండా అటవీ శాఖకు మార్గ నిర్దేశం చేస్తున్న కారణంగానే ఈ యాక్షన్‌ప్లాన్‌ సక్సెస్‌దిశగా పయనిస్తోందంటున్నారు. కాగా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో విస్తృతమైన తనిఖీలు, నిరంతర నిఘాతో పాటు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అలాగే స్మగ్లర్లకు సహకరించిన వారిపై కఠినచర్యలు తీసుకున్నారు. దీంతో అటవీశాఖలో కొత్త భయపూరితమైన వాతావరణం నెలకొంది. తప్పు చేయాలంటే వణికిపోయే పరిస్థితి మొదలైంది. దీంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది సంయుక్తంగా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఈ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్న తమకు తెలిసిపోయే విధంగా నిఘాను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మారుమూల పల్లెల్లో ఇన్‌ఫార్మింగ్‌ నెట్‌వర్క్‌ను సైతం ఏర్పాటు చేసుకొని ఇటు కలపస్మగ్లర్లు, అటు వన్యప్రాణుల వేటగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు. కొద్దిరోజుల క్రితం విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎఫ్‌డీ ఓ, ఎఫ్‌ఆర్‌ఓ స్థాయి అధికారులను సైతం సస్పెండ్‌ చేయడంతో మిగతా అధికారులు, సిబ్బందిలో భయం మొదలైంది. ఇప్పటి వరకు ఆదిలాబాద్‌ సర్కిల్‌లో విధులను విస్మరించడమే కాకుండా బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించిన 53 మంది సిబ్బందిపై ఉన్నతాధికారులు కొరఢా ఝులిపించారు. అలాగే కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ నిర్మల్‌ సర్కిల్‌లో కూడా 25 మందిపై చర్యలు తీసుకున్నారు. అటవీ, వన్యప్రాణి సంరక్షణలో వీరంతా విఫలమయ్యారన్న ఆరోపణలతో చర్యలకు గురయ్యారు. అలా గే నాకబంధీ, పెట్రోలింగ్‌ను నిరంతరంగా నిర్వహించి అక్రమంగా తిరుగుతున్న 37 వాహనాలను సీజ్‌ చేయడమే కాకుండా వీరి వద్ద నుంచి రూ. 9లక్షలకు పైగా స్వాఽధీనం చేసుకున్నారు. రాజురా, కప్పనపెల్లి, జన్నారం రెంజ్‌లకు చెందిన ఎఫ్‌ఆర్‌ఓలపై కూడా చర్యలు చేపట్టారు. ఇలా నిరాటకంగా ఓ వైపు నిఘా, మరోవైపు కఠిన చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షలతో కవ్వాల్‌ అభయారణ్యం మరింతగా విస్తరిస్తుండడమే కాకుండా పచ్చదనం పెరిగిపోయి వన్యప్రాణుల సంఖ్య రోజు రోజుకు నాలుగింతలవుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు. 

స్మగ్లర్లు, వేటగాళ్లపై ఉక్కుపాదం

ఓ వైపు చెట్ల నరికివేతను పూర్తిగా అరికడుతూ స్మగ్లింగ్‌ను నిరోధించి మరోవైపు స్మగ్లర్ల సమాచారాన్ని సేకరించడంపైనే అటవీశాఖ దృష్టి సారిస్తోంది. పకడ్భందీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని తన ఇన్‌ఫార్మింగ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంది. కొద్ది రోజుల క్రితం వరకు కవ్వాల్‌ అభయారణ్యంలో ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేతతో పాటు జోరుగా కలపస్మగ్లింగ్‌ను, ఇష్టానుసారంగా వన్యప్రాణుల వేట కొనసాగేది. హైదరాబాద్‌, ముంబాయ్‌, బెంగుళూర్‌ లాంటి ప్రాంతాల నుంచి వేటగాళ్లు ఇక్కడికి వచ్చి వన్యప్రాణులను వేటాడేవారు. కవ్వాల్‌ టైగర్‌జోన్‌గా ఏర్పడిన నాటి నుంచి అధికారులు చేపట్టిన యాక్షన్‌ ప్లాన్‌ స్మగ్లర్లపై ఉక్కుపాదం పడింది. దీంతో స్థానిక స్మగ్లర్లు, వేటగాళ్లు అభయారణ్య పరిధిలోకి ప్రవేశించేందుకు కూడా సాహసించడం లేదంటున్నారు. అలాగే కలప స్మగ్లర్లు, వేటగాళ్లకు సహకరించే అధికారులు, సిబ్బందిపైనా అలాగే విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపైనా కఠినచర్యలు తీసుకోవడంతో అందరిలో విధుల బాధ్యత ప్రాధాన్యత పెరిగిపోయింది. ఓ ఎఫ్‌డీఓ స్థాయి అధికారి విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా సస్పెన్షన్‌కు గురవ్వడం ఇక్కడి అటవీశాఖలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు, నిఘా విస్తరణతో అడవుల నరికివేత తగ్గిపోయి వాటి విస్తీర్ణం పెరిగేందుకు దోహడపడుతోందంటున్నారు. 

ఫలితమిస్తున్న జంగల్‌ బచావో.. జంగల్‌ బడావో

కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో అమలు చేస్తున్న జంగల్‌ బచావో....జంగల్‌ బడావో యాక్షన్‌ప్లాన్‌ అనూహ్యమైన ఫలితాన్నిస్తోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచి ర్యాల్‌ సర్కిల్‌లపై అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్‌పెట్టి ఈ యాక్షన్‌ప్లాన్‌ను చేపట్టారు. అడవుల సంరక్షణతో పాటు కొత్తగా అడవిని పెంచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేకదృష్టి పెట్టారు. ఏకంగా పులులసంఖ్య కూడా పెరిగినట్లు చెబుతున్నారు. దట్టమైన అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, పెరిగిన అడవుల విస్తీర్ణంతో పాటు వన్యప్రాణుల సంఖ్యను సైతం పరోక్షంగా వెల్లడిస్తున్నాయని చెబుతున్నారు. సీసీ కెమెరాలలో ఇప్పటికే పులి సంచారంతో పాటు పెరిగిన వన్యప్రాణుల సంచారం దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగానే దట్టమైన అడవుల్లో అమలవుతున్న యాక్షన్‌ ప్లాన్‌ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధికారులకు వీలవుతుందంటున్నారు. దీంతో పాటు ఉన్నతాధికారులు నిరాటకంగా తనిఖీలు, పెట్రోలింగ్‌లు, నాకబంధీలు చేపడుతున్నారు. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహారిస్తూ తమ విధులను బాద్యతయుతంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి అన్ని రకాల చర్యల కారణంగా అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్‌కు పూర్వ వైభవం సమకూరుతోందంటున్నారు. 

సీఎం కేసీఆర్‌, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిల సహకారంతోనే

జంగల్‌ బచావో.... జంగల్‌ బడావో యాక్షన్‌ప్లాన్‌ అమలుకు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిల అండదండలే కారణం. వీరిద్దరు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తమ శాఖకు దిశానిర్దేశం చేస్తుండడంతోనే లక్ష్యం విజయవంతమవుతోంది. ఇప్పటికే కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో అటవీ విస్తరణ పెరగడమే కాకుండా వన్య ప్రాణులసంఖ్య కూడా రెట్టింపయ్యింది. తమ శాఖలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపైనా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటు న్నాం. అందరి సహకారంతోనే యాక్షన్‌ప్లాన్‌ సక్సెస్‌ అవుతోంది.