బేబీ కిట్లకు బై బై

ABN , First Publish Date - 2022-06-21T06:03:32+05:30 IST

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు ఎక్కువ మంది పేదలే వస్తుంటారు. అక్కడ చికిత్స సంగతి దేవుడెరుగు. చివరకు ప్రసవ సమయంలో అందే పథకాలకు కూడా ప్రభుత్వం బొందపెట్టింది.

బేబీ కిట్లకు బై బై

ప్రభుత్వాసుపత్రుల్లో రెండేళ్లుగా పంపిణీ బంద్‌

పెదవి విరుస్తున్న పేద బాలింతలు

పుట్టపర్తి రూరల్‌

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు ఎక్కువ మంది పేదలే వస్తుంటారు. అక్కడ చికిత్స సంగతి దేవుడెరుగు. చివరకు ప్రసవ సమయంలో అందే పథకాలకు కూడా ప్రభుత్వం బొందపెట్టింది. ఈ కోవలోనే శిశువు ఆరోగ్య సంరక్షణ కోసం ఇచ్చే బేబీ కిట్ల పంపిణీకి రెండేళ్లుగా మంగళం పాడారు. ప్రసవానంతరం ఇంటికి వెళ్లే సమయంలో శిశువు ఆరోగ్య సంరక్షణ కోసం టీడీపీ ప్రభుత్వం 2016 జూలైలో ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో డాక్టర్‌ వైఎ్‌సఆర్‌  బేబీకిట్‌గా ఈ పథకానికి పేరు మార్చి కొన్నాళ్లు అందజేశారు. ఆ తర్వాత రెండేళ్లుగా కిట్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో బాలింతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ ఆరోగ్య సంరక్షణ కోసం పేదలు అప్పు చేసి బహిరంగ మార్కెట్లో బేబీ కిట్లు కొనుగోలు చేయలేని స్థితిలో నిట్టూరుస్తున్నారు. ఆర్థిక భారం మోయలేక, ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు.


గత ఏడాది 11వేలకుపైగా ప్రసవాలు

శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా 32 మండలాలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు 41, కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రాలు 7, ఆర్బన హెల్త్‌సెంటర్లు 18తో పాటు హిందూపురం, ధర్మవరంలో పోస్టుమార్టం యూనిట్లు ఉన్నాయి. జిల్లామొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో  ఏప్రిల్‌, మే నెలల్లో 1959 ప్రసవాలు జరిగాయి. గత ఏడాదిలో 11965 ప్రసవాలు జరిగాయి. వీరందరికీ ఇప్పటికీ బేబీ కిట్లు అందలేదు.


బేబీ కిట్‌లో ఏముంటాయంటే..

బిడ్డ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అందించే బేబీ కిట్‌లో దుప్పటి,  దోమతెర, స్లీపింగ్‌ బెడ్‌, పౌడర్‌, లోషన, నేప్‌కిన, డైపర్స్‌, సబ్బులు ఉండేవి. ఇవన్నీ శిశువు అనారోగ్యం బారినపడకుండా రక్షణ కల్పిస్తాయి. ప్రస్తుతం ఈకిట్‌ బయట కొనాలంటే రూ.1500 నుండి రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది.


ప్రభుత్వం చేయూతనివ్వాలి 

ప్రసవానంతరం బిడ్డ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేయూతనివ్వాలి. గతంలో బేబీ కిట్‌ ఇచ్చేవారు. అవి బిడ్డకు అన్నివిధాలా ఉపయోగకరంగా ఉండేవి. ప్రస్తుతం ఇవ్వకపోవడంతో పేదలు బయట కొనలేకపోతున్నారు.

శిరీష, ఏలుకుంట్ల


కిట్ల పంపిణీ నిలిచిపోయింది

ప్రభుత్వాసుప్రతుల్లో ప్రస్తుతం బేబీ కిట్ల పంపిణీ నిలిచిపోయింది. గతంలో ప్రతి బాలింతకూ అందించాం. కరోనాతో రెండేళ్లుగా ప్రభుత్వం పంపిణీ చేయడంలేదు. కిట్ల పంపిణీపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.

డాక్టర్‌ పద్మావతి, జిల్లా వైద్యాధికారిణి

Updated Date - 2022-06-21T06:03:32+05:30 IST