బేబీ కిట్లకు మంగళం

ABN , First Publish Date - 2021-05-15T05:44:37+05:30 IST

ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో పేదలకు ఆసరా లభించడం లేదు.

బేబీ కిట్లకు మంగళం

 ఆసుపత్రులకు నిలిచిన సరఫరా

ప్రభుత్వ దవాఖానాల్లో పేదలకు దక్కని ఆసరా


నెల్లూరు, మే 14 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో పేదలకు ఆసరా లభించడం లేదు. పేదలకు ఖర్చు లేకుండా ప్రభుత్వమే చంటిబిడ్డలకు అందిస్తున్న బీబీ కిట్లు గత కొన్ని నెలలుగా అందడం లేదు. దీంతో బంధువులే రూ.వేలు పెట్టి బయట కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. చివరగా గతేడాది జనవరిలో నాలుగు వేల కిట్లు జిల్లాకు అందినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలు వాటిని సర్దుబాటు చేసినా ఆ తర్వాత సరఫరా నిలిచిపోయిందని చెబుతున్నారు. 

ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ పేరిట పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్టులో బీబీ బెడ్‌, బేబీ టవల్‌, దోమతెర, లిక్విడ్‌, సబ్బుతోపాటు బ్యాగ్‌ ఉంటుంది. దీనిని బయట కొనుగోలు చేయాలంటే రూ.వెయ్యిపైనే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని డా.వైఎస్‌ఆర్‌ బేబీ కిట్‌గా పేరు మార్చారు. కొన్నాళ్లపాటు సక్రమంగానే ఈ కిట్లను ఆసుపత్రులకు సరఫరా చేశారు. కానీ దాదాపు ఏడాది నుంచి సరఫరా నిలిచిపోయింది. నవజాత శిశువుకు బేబీ బెడ్‌, దోమతెర, టవల్‌ అత్యవసరం. నెల్లూరులోని జిల్లా ప్రసూతి ఆసుపత్రితోపాటు జిల్లా వ్యాప్తంగా 27 ప్రత్యేక ప్రసూతి ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కాన్పులు జరుగుతున్నాయి. ప్రతీ నెలా సరాసరి వెయ్యికి పైగా ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఇక్కడ బేబీ కిట్లు, రూ.1000 నగదు ఇవ్వడం, ఇతర మౌలిక వసతులు కల్పిస్తుండడంతో కొన్నేళ్ల నుంచి ప్రసవాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎక్కువ మంది పేదలు ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు చేసుకుంటున్నారు. వీరిని ఆదుకునే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన బేబీ కిట్‌ పథకం ఇప్పుడు నిలిచిపోవడంతో వారిపై ఆర్థికంగా భారం పడుతోంది. కొన్ని నెలల నుంచి వేల సంఖ్యలోనే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగాయి. వీరికి నగదు ఇచ్చి పంపుతున్నారు తప్ప బేబీ కిట్లు ఇవ్వలేదు. అధికారులేమో ప్రభుత్వం సరఫరా చేస్తే అందరికీ అందిస్తామని అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి కష్టకాలంలో పేదలకు ఖర్చులు తగ్గించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.  

Updated Date - 2021-05-15T05:44:37+05:30 IST