Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వర్షాకాలం వ్యాధులకు దూరంగా...

twitter-iconwatsapp-iconfb-icon
వర్షాకాలం వ్యాధులకు దూరంగా...

ఆంధ్రజ్యోతి(13-07-2021)

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం! ముందున్న మూడో వేవ్‌ను వ్యాక్సిన్‌తో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం! అయినప్పటికీ ప్రస్తుత చల్లని వాతావరణం అన్ని వైరస్‌లకు అనుకూలమైనది! కాబట్టి కరోనాతో సహా, ఎటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులూ సోకకుండా శరీరాన్ని దృఢపరుచుకోవాలి! అందుకోసం సమర్ధమైన ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయించవచ్చు!


వర్ష రుతువుతో వాతావరణంలోని క్షారం దేహ వాతాన్ని పెంచి, పిత్తం పేరుకునేలా చేసి శక్తిని కుంటు పరుస్తుంది. ఫలితంగా శరీర కణజాలం బలహీనపడి, రోగనిరోధకశక్తి సన్నగిల్లి పలురకాల ఎలర్జీలు, ఉదర సంబంధ సమస్యలు, శ్వాసకోశ సమస్యల బారిన పడేలా చేస్తుంది. జీర్ణాగ్ని ఈ రుతువులో కుంటుపడుతుంది. కాబట్టి ఈ సమస్యలకు గురి కాకుండా ఉండాలంటే శుద్ధి, పునరుత్తేజ చికిత్సలతో శక్తి పుంజుకోవడంతోపాటు వాత, పిత్త, కఫాల సమతౌల్యం కోసం దోహదపడే ఆహారం, జీవన విధానాలను అనుసరించాలి.


వర్ష రుతువులో శరీరంలోని త్రిదోషాలు విపరీతస్థితికి చేరుకుంటాయి. ఈ స్థితి నుంచి వీటిని సమతుల్యపరచాలి. లేదంటే వ్యాధుల రూపంలో అవి విజృంభిస్తాయి. వర్షాలు, వర్షాలతో పాటు చోటు చేసుకునే చల్లని వాతావరణం వ్యాధులకు మూల కారణం. వర్ష రుతువులో బలహీనపడే దేహాగ్ని కారణంగా త్రిదోషాల మధ్య అసమతౌల్యం చోటు చేసుకుంటుంది. కాబట్టి వాతరోగాలైన ఆర్థ్రయిటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, సయాటికా, వెన్ను నొప్పి, మెడ ఎముకల నొప్పి, నాడీసంబంధ సమస్యలు ఈ కాలంలో పెరుగుతాయి. కఫ దోషం ఎక్కువవడం మూలంగా జలుబు, దగ్గు, ఎలర్జీలు, చర్మసంబంధ రుగ్మతలు పెరుగుతాయి. 


ఆయుర్వేద చికిత్సలు

ఆయుర్వేద చికిత్సలో ఎలాంటి రుగ్మతకు చికిత్స చేయాలన్నా, దాన్ని పంచకర్మ అంటారు. దాని ఫలితం పూర్తిగా శరీరానికి దక్కాలంటే ముందుగా శరీరాన్ని విషరహితంగా మార్చాలి. ఇందుకోసం ‘పూర్వకర్మ’ చికిత్సను అనుసరించక తప్పదు. ఈ చికిత్సలో భాగంగా దేహాన్ని విషరహితంగా మార్చడం కోసం బాహ్యంగా, అంతర్గతంగా తైలాలను వాడతారు. బాహ్యంగా తైల మర్దన చేయవలసి ఉంటుంది. అంతర్గతంగా తైలాలను తాగవలసి ఉంటుంది. తైల మర్దన చికిత్సలన్నీ రోగుల రుగ్మతలు, వారి శరీర తత్వాల ఆధారంగా ఎంచుకోవలసి ఉంటుంది. చికిత్సల్లో కొన్ని నిర్దిష్ట నూనెలు, చూర్ణాలు, మర్దన పద్ధతులు అనుసరిస్తారు. వీటిని ఆయుర్వేద తైల చికిత్సలు అంటారు. వీటిని శరీర తత్వం (వాత, పిత్త, కఫ), రుగ్మతల ఆధారంగా ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. అవేంటంటే....


అభ్యంగ

సాధారణంగా మనం ఇంట్లో కూడా తైల మర్దన చేసుకుంటూ ఉంటాం. దీని ప్రధమ ఉద్దేశం రక్తప్రసరణ పెరుగుదల, కండరాలు, చర్మ పటుత్వాలే! మర్దన వల్ల శరీరంలోని మలినాలు కూడా విసర్జితమై శక్తి పెరుగుతుంది. నిద్ర పడుతుంది. ఇలా ఒళ్లంతా నూనె పట్టించి మర్దనా చేసి, సున్ని పిండితో రుద్ది స్నానం చేసే పద్ధతిని ఆయుర్వేదంలో ‘అభ్యంగనం’ అంటారు. ఇది ఎవరైనా చేయొచ్చు. అయితే ఆయుర్వేద చికిత్సలో భాగంగా పూర్వకర్మ అభ్యంగనను మున్ముందు చికిత్సకు శరీరాన్ని సంసిద్ధం చేయడం కోసం చేస్తారు. 


ఉద్వర్తనం

ఈ మర్దన పురుషుల కోసం ఉద్దేశించినది. ఏమాత్రం తడి లేకుండా పూర్తిగా చూర్ణాలతో సాగే ఈ మర్దన సున్నిత చర్మం కలిగి ఉండే మహిళలకు పనికి రాదు. కాబట్టి ఉద్వర్తనం మినహా ఉద్ఘర్షణం, ఉత్సాదనం మర్దనలు మాత్రమే మహిళలకు ఉద్దేశించినవి. పిల్లల చర్మం మరింత సున్నితంగా ఉంటుంది కాబట్టి పూర్తి నూనెలతో సాగే ఉత్సాదనం మర్దన ఒక్కటే వారికి అనుసరించవలసి ఉంటుంది. ఈ చికిత్సతో రక్తప్రసరణ, మెటబాలిక్‌ రేట్‌ (శరీరం శక్తిని ఖర్చు చేసే వేగం), మరీ ముఖ్యంగా కొవ్వు కరిగే వేగం పెరుగుతాయి. 


ఉద్ఘర్షణం

ఇది తడి చూర్ణాలతో చేసే మర్దన. కీళ్ల దగ్గర వృత్తాకారంలో, ఎముకల దగ్గర పొడవుగా సాగే ఈ మర్దన రెండు రకాల మర్దన పద్ధతుల్లో సాగుతుంది. కఫ తత్వ లక్షణాలైన అధిక బరువు, ఒంట్లో నీరు నిల్వ ఉండిపోవడం, నిస్తేజం, రక్తప్రసరణ లోపం ఉన్న వారికి ఉద్ఘర్షణం వల్ల ఫలితం ఉంటుంది. దీర్ఘకాలంలో శరీరంలోని కలుషితాలన్నీ విరిగి రక్తప్రవాహంలో కలుస్తాయి. ఫలితంగా కొవ్వు కూడా కరగడం మొదలు పెడుతుంది. 


ఉత్సాధనం

వేర్వేరు నూనెల మిశ్రమంతో చేసే మర్దన


శిరోధార

ఈ చికిత్సలో శరీరానికి తైల మర్దన చేసి, ఆ తర్వాత నుదుటి మీద తైలం చుక్కలుగా పడే చికిత్స చేస్తారు. ఇలా నూనె నేరుగా నుదుటి మీద పడడం వల్ల మెదడులోని పిట్యూటరీ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. శిరోధార చికిత్సను క్రమంతప్పక తీసుకుంటే మెదడులో సెరటోనిన్‌, డోపమైన్‌ హార్మోన్లు సక్రమంగా స్రవిస్తాయు. పార్కిన్సన్‌ రుగ్మతలో డోపమైన లెవెల్స్‌ తగ్గుతాయి. అలాంటివాళ్లకి ఈ చికిత్స ఫలితమిస్తుంది. శిరోధార వల్ల కార్టిసాల్‌, సెరటోనిన్‌ స్రావాలు మెరుగవుతాయి. కాబట్టి ఒత్తిడి వల్ల తలెత్తే రుగ్మతలకు ఈ చికిత్స చక్కని ఫలితాలనిస్తుంది. నిద్రలోపం కూడా తొలగుతుంది. 


కషాయధార

చూర్ణాలతో తయారైన కషాయాన్ని శరీరం మీద ఒంపి, నొప్పులు, వాపులను తొలగించే చికిత్స ఇది. సమమైన వేడితో ఉన్న కషాయాన్ని శరీరం మీద, రెండు వైపులా ఒకే దిశలో పోస్తూ ఈ చికిత్స చేస్తారు. వాపులు, నొప్పులు ఉన్నప్పుడు ఈ చికిత్స చేయుంచుకోవడం వల్ల కషాయంలోని మూలికలు ఆ నొప్పులకు కారణాలను నేరుగా చేరుకుని చికిత్స చేస్తాయి. ఊపిరితిత్తుల్లో, పొట్టలో నీరు పేరుకుపోయే ఎడిమా సమస్యకూ ఈ చికిత్స చక్కని ఫలితం ఇస్తుంది. 


కాయసేగం

శరీరం మొత్తాన్నీ తైలాలతో మర్దన చేసే ఈ చికిత్స వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది. పక్షవాతం, మస్క్యులర్‌ డిస్ట్రోఫీ సమస్యలకు కాయసేగం ఫలితాన్నిస్తుంది. 

వర్షాకాలం వ్యాధులకు దూరంగా...

ఆయుర్వేద మర్దనలో వాడే నూనెలు, చూర్ణాలు

వ్యాధి, శరీర తత్వం ఆధారంగా మర్దన కోసం ఉపయోగించవలసిన నూనెలు, చూర్ణాలు ఎంచుకోవలసి ఉంటుంది. కాబట్టి మర్దన నూనెల్లో లెక్కలేనన్ని రకాలు వాడుకలో ఉన్నాయి. అయితే పొడుల్లో ఔషధంలా తీసుకునే పొడులు బోలెడన్ని. శరీరం మీద మర్దనకు వాడేవి మూడు లేదా నాలుగు రకాలుంటాయి. వీటిలో...


కోలగులతాది చూర్ణం: కొవ్వును కరిగించడంతోపాటు, కొవ్వు కరిగే వేగాన్ని పెంచి, అధిక బరువును తగ్గిస్తుంది.

త్రిఫలాది చూర్ణం: రక్తప్రసరణ మెరుగవుతుంది.

జడామయాది చూర్ణం: కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

ఏలాది చూర్ణం: చర్మ సంబంధ సమస్యలకు ఉపయోగకరం. 


వేడి నూనె, చూర్ణం

గోరువెచ్చని నూనెను చర్మం తేలికగా పీల్చుకుంటుంది. కాబట్టి మర్దన కోసం వాడే నూనెను వేడి చేస్తారు. అయితే ఈ నూనెను పొయ్యి మీద ఉంచి నేరుగా వేడి చేయకూడదు. గిన్నెను వేడి చేసి, పొయ్యి నుంచి దింపి, ఆ తర్వాత దాన్లో నూనె నింపవలసి ఉంటుంది. నూనె చల్లారిపోతే, తిరిగి గిన్నె ఖాళీ చేసి వేడి చేసి, నూనెను నింపాలి. ఇలా చేయకుండా నూనెను నేరుగా పొయ్యి మీద ఉంచి వేడి చేసినా, అదే పద్ధతిలో పదే పదే వేడి చేసినా తైలంలోని విలువైన ఔషధ గుణాలు నష్టమవుతాయి. చూర్ణాలను చిన్న మంట మీద వేడి చేయాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.