‘ప్రజల్లో చులకన అవుతున్నాం’

ABN , First Publish Date - 2022-01-22T04:59:22+05:30 IST

‘గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్ట లేకపోతున్నాం. కనీస వసతులు కల్పించలేకపోతున్నాం. ఎటువంటి సమస్యలు పరిష్కరించ లేకపోతున్నాం. అధికారులను అడుగుతుంటే నిధుల కొరతను సాకుగా చూపుతున్నారు. ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోంది’...అంటూ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.

‘ప్రజల్లో చులకన అవుతున్నాం’
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధి చెక్కును అందిస్తున్న జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసరావు

అభివృద్ధి లేదు..నిధులు రావు

 జడ్పీ చైర్మన్‌ ఎదుట సర్పంచ్‌ల ఆవేదన 

విజయనగరం (ఆంధ్రజ్యోతి), జనవరి 21: ‘గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్ట లేకపోతున్నాం. కనీస వసతులు కల్పించలేకపోతున్నాం. ఎటువంటి సమస్యలు పరిష్కరించ లేకపోతున్నాం. అధికారులను అడుగుతుంటే నిధుల కొరతను సాకుగా చూపుతున్నారు. ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోంది’...అంటూ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఎదుట తమ ఆవేదనను వెళ్లగక్కారు. అలాగని వీరంతా విపక్ష సర్పంచ్‌లంటే పొరబడినట్టే. ఏకగ్రీవంగా గెలుపొందిన అధికార పార్టీ సానుభూతిపరులే. శుక్రవారం జిల్లాలో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్న 146 పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రూ.8.75 కోట్ల ప్రోత్సాహకాలను జడ్పీ చైర్మన్‌ చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. పంచాయతీలను అభివృద్ధి చేయాలన్న తలంపుతో సర్పంచ్‌లుగా ఎన్నికైతే.. అటువంటి పరిస్థితి ఏమీలేదని ఎక్కువ మంది తమ ఆవేదనను వెలిబుచ్చారు. సర్పంచ్‌లు అడిగిన ప్రశ్నలకు జడ్పీ చైర్మన్‌ ఉక్కిరిబిక్కిరయ్యారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఒకవైపు రోజుకు వేలాది కరోనా కేసులు నమోదువుతున్న వేళ వందలాది మందితో కార్యక్రమం నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. కార్యక్రమానికి హాజరైన పంచాయతీ కార్యదర్శులు ఆరుబయటే నిల్చోవాల్సి వచ్చింది. చాలామంది మహిళా సర్పంచ్‌లకు బదులు వారి భర్తలు ప్రతినిధులుగా హాజరుకావడం విశేషం. 



Updated Date - 2022-01-22T04:59:22+05:30 IST