విద్యాశాఖలో అవార్డుల పంచాయితీ

ABN , First Publish Date - 2020-10-01T10:33:44+05:30 IST

జిల్లా విద్యాశాఖలో అవార్డుల పంచాయితీ రచ్చకెక్కింది. మిగతా జిల్లాల్లో అవార్డుల ప్రక్రియ పూర్తయినా ఆసిఫాబాద్‌లో ఇప్పటికీ కార్యక్రమం నిర్వహించక పోవడం పట్ల

విద్యాశాఖలో అవార్డుల పంచాయితీ

గురుపూజోత్సవం సందర్భంగా ప్రతి ఏటా పురస్కారాలు

ఈసారి కరోనా, మాజీ రాష్ట్రపతి మృతితో ఆలస్యం

ఇంకా ఎంపిక కొలిక్కి రాలేదంటున్న డీఈవో

నలుగురు పేర్లను ఖరారు చేశారంటున్న ఉపాధ్యాయ సంఘాలు

నేడు సంఘాల ఆధ్వర్యంలో సన్మానం 


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లా విద్యాశాఖలో అవార్డుల పంచాయితీ రచ్చకెక్కింది. మిగతా జిల్లాల్లో అవార్డుల ప్రక్రియ పూర్తయినా ఆసిఫాబాద్‌లో ఇప్పటికీ కార్యక్రమం నిర్వహించక పోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాలే కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానిం చేందుకు  సిద్ధమయ్యాయి. ఈ మొత్తం వ్యవహా రంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు డీఈవోను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయడం జిల్లాలో చర్చనీయంశంగా మారింది. విద్యాశాఖలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యా యులకు ప్రతిఏటా గురుపూజోత్సవం సందర్భంగా అవార్డులు అందజే యడం సంప్రదాయంగా వస్తోంది. 


ఉపాధ్యాయుడి స్థాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన   డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జ్ఞాపకార్థం విద్యా వ్యవస్థలో విశేషమైన సేవలందించిన ఉపాధ్యా యులకు అవార్డులు ఇస్తున్నారు. ఇందుకు  సర్వేపల్లి జయంతిని ప్రామాణికంగా తీసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ప్రతి సంతవ్సంర ఎంపిక చేస్తుంటారు.  జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సదరు ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజే యడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ దఫా అవార్డుల ప్రదానం అనుకున్న సమయానికి జరగలేదు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదే శాలను అనుసరించి ఈసారి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక, అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలను ఎంఈవోల చేతుల మీదుగా మండల స్థాయిలోనే జరుపుకోవాలని సూచించింది. 


ఎంపికకు నిబంధనలు

ఈక్రమంలో సెప్టెంబరు 2న ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లాలోని ఉపాధ్యాయులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో 5, 6 తేదీల్లో అన్ని దరఖాస్తులను  స్ర్కూటిని చేసి నిబంధనల ప్రకారం అర్హులైన ఉపాధ్యాయుల జాబితాను తయారు చేశా రు. అవార్డుల గైడ్‌లైన్స్‌ ప్రకారం 10 సంవత్సరాల పైబడి సర్వీసు కలిగిన ఉపాధ్యాయులను మాత్రమే అవార్డులకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆసిఫాబాద్‌ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్‌, స్ర్కూటిని ప్రక్రియ పూర్తయినప్పటికీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మృతిచెందడంతో అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేశారు. కాగా  మిగతా జిల్లాల్లో సెప్టెంబరు 7,8 తేదీల్లోనే అవార్డుల ప్రదానోత్సవాన్ని ముగించేశారు. 


జిల్లా విద్యాధికారి పాణిని ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఉపాధ్యాయుల ఆరోపణ. అటు ఉపాధ్యాయ సంఘాలు కూడా జిల్లా విద్యాశాఖ అలసత్వ వైఖ రిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గురువారం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన నలుగురు ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అయితే స్ర్కూటిని ప్రక్రియ పూర్తి చేసి అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను  కలెక్టర్‌ ఆమోదం కోసం పంపామని ఆయన సంతకం కాగానే కార్యక్రమం నిర్వహిస్తామని డీఈవో పాణిని చెబుతున్నారు. జాబితా ఖరారు చేయనిదే జిల్లా విద్యాధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులు సంతకాలు చేసిన లిస్ట్‌ ఎలా విడుదల అయిందనేది ఉపాధ్యాయ వర్గాల వాదన. ఈ వ్యవహారంతో విద్యాశాఖలో అవార్డుల లొల్లి రచ్చకెక్కినట్లయింది. 


కలెక్టర్‌కు చేరిన జాబితా 

జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి అనుభవం, వారందించిన సేవలు, సర్వీసు పాయింట్ల ప్రతిపాదికన నలుగురిని ఖరారు చేసి కలెక్టర్‌కు పంపిచారు. ఇందులో దహెగాం మండలం కొంచవెల్లిలో పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.పోచయ్య, కెరమెరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గోడం భరత్‌రావు, ఇట్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హెచ్‌ఎం జె.సత్తయ్య, తిర్యాణి జడ్పీఎస్‌ఎస్‌లో పీడీగా పనిచేస్తున్న పి.సాంబశివరావు పేర్లు ఉన్నాయి. 


కలెక్టర్‌ అనుమతి రాగానే అవార్డుల ప్రదానం-పాణిని, డీఈవో

కరోనా, మాజీ రాష్ట్రపతి మృతితో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రదానోత్సవం జాప్యం అయిన మాట వాస్తవమే. నలుగురు పేర్లను ఖరారు చేసి కలెక్టర్‌ ఆమోద ముద్ర కోసం పంపాం. కలెక్టరేట్‌లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా కలెక్టర్‌ ఇంతవరకు ఈ ఫైల్‌ను చూడలేదు. ఒకటి, రెండు రోజుల్లో కలెక్టర్‌ సంతకం కాగానే మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి అవార్డులు ఇవ్వాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేస్తాం. 


డీఈవో ఉదాసీనత వల్లే ఆలస్యం-ఎ.శ్రీనివాస్‌రావు, పీఆర్టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు

జిల్లా విద్యాధికారి అవార్డుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. కరోనా సాకు చూపి నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. విద్యాశాఖ నుంచి ఇప్పటికే ఉపాధ్యాయుల పేర్లు ప్రకటించారు. విద్యాశాఖ దీనిపై స్పందించక పోవడంతో ఉపాధ్యాయ సంఘాల తరపున మేమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. గురువారం జాబితాలోని నలుగురు ఉపాధ్యాయులను పిలిచి అవార్డుల ప్రదానోత్సవాన్ని  నిర్వహిస్తాం. 

Updated Date - 2020-10-01T10:33:44+05:30 IST