జాతీయవాదం అనే పదం వద్దు

ABN , First Publish Date - 2020-02-21T07:43:14+05:30 IST

‘జాతీయవాదం’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని మానుకోవాలని ప్రజలకు ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పిలుపునిచ్చారు.

జాతీయవాదం అనే పదం వద్దు

  • హిట్లర్‌ నాజీయిజానికి అర్థం ఈ మాట
  • దేశం, జాతీయత.. మాటలు వాడండి: భాగవత్‌

రాంచీ, ఫిబ్రవరి 20: ‘జాతీయవాదం’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని మానుకోవాలని ప్రజలకు ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పిలుపునిచ్చారు. జాతీయవాదం అనే మాట, అడాల్ఫ్‌ హిట్లర్‌ సిద్ధాంతాలైన నాజీయిజం, ఫాసిజం అర్థాలను సూచిస్తుందని, అందుకే ఆ పదాన్ని పలకడం మానుకోవాలని సూత్రీకరించారు. జాతీయవాదానికి బదులుగా దేశీయ, దేశం, జాతీయత అనే మాటలను ఉపయోగించవచ్చునని పేర్కొన్నారు. హిందుత్వ అజెండా అమలు దిశగానే సీఏఏ, ఎన్‌ఆర్సీలను కేంద్రంలోని బీజేపీ తెరమీదకు తెచ్చిందంటూ విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భాగవత్‌, పైవిధంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగవత్‌  ప్రసంగించారు. దేశభక్తిని, హిందుత్వాన్ని పెంపొందించడమే సంఘ్‌ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


భారత సమాజంలో ఐకమత్యం పరిఢవిల్లే విధంగా పనిచేసి, ప్రపంచానికే గురువుగా భారత్‌ ఎదిగేలా చేస్తామన్నారు. తమ స్వార్థం కోసం కాకుండా ఒకరి కోసం ఒకరు బతికే విధంగా బతకాలని.. ప్రపంచం మనకెంతో ఇచ్చిందని, దాన్నంతా ప్రపంచం మేలు కోసమే తిరిగిచ్చేసి కృతజ్ఞతను చాటుకోవాలని సంఘ్‌ భావిస్తుందని పేర్కొన్నారు. హిందూ సమాజాన్ని ఐక్యం చేయడమే సంఘ్‌ ఽధ్యేయం అని, అలా అని దేశ సమాఖ్య వ్యవస్థలో ఆర్‌ఎ్‌సఎస్‌ జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం నేపథ్యంలో ఆర్‌ఎ్‌సఎస్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ, అమిత్‌ షాలు, పార్టీకి ఎప్పుడూ విజయాలు అందించరని, ఢిల్లీలో పార్టీ పునర్‌ నిర్మాణం జరగాలని సూచించింది. ఇక  జాతీయవాదంపై భాగవత్‌ వ్యక్తం చేసిన అభిప్రాయంతో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఏకీభవించారు. పాశ్చాత్య దేశాల్లో జాతీయవాదం అనేది తప్పుడు పదమని, దీన్ని భగవత్‌ తెరమీదకు తీసుకురావడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు.

Updated Date - 2020-02-21T07:43:14+05:30 IST