అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2022-05-24T05:26:42+05:30 IST

అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యతనిచ్చి రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు ఏర్పాటు చేయాలని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సూచించారు.

అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి

రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు తవ్వండి 

నర్సరీల్లో ఉన్న మొక్కలను కాపాడుకోవాలి

హరితహారానికి ప్రముఖుల రాక 

మెదక్‌కు సీఎం కేసీఆర్‌ వచ్చే అవకాశం

మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ 


మెదక్‌, మే 23: అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యతనిచ్చి రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు ఏర్పాటు చేయాలని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో మండల పరిషత్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, అటవీశాఖ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ విడత హరితహారానికి ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా వచ్చే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండి పని చేయాలని హెచ్చరించారు. అన్ని రహదారుల వెంట మూడు వరుసలుగా పెద్ద మొక్కలతో పాటు మధ్య మధ్య పూల మొక్కలు నాటేలా మంగళవారం నాటికి మండలాల వారీగా ప్రణాళిక రూపొందించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 10 నర్సరీలలో 5 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. నర్సాపూర్‌, తూప్రాన్‌, మెదక్‌ రహదారుల వెంట ఒకటిన్నర మీటర్ల తరువాత ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా మొక్కలు నాటాలని సూచించారు. మొక్కల సంరక్షణకు నాణ్యమైన ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ పక్కన కొద్ది మేర ఖాళీ స్థలం ఉంచి మొక్కలు నాటేందుకు అనువుగా గుంతలు తీయాలని చెప్పారు. పెద్ద మొక్కలు కొనుగోలు చేయడానికి అనుమతి లేదని, నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను కాపాడుకోవాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మొక్కలు పెంచడానికి అవసరమైన అంచనా రూపొందించాలన్నారు. మున్సిపల్‌ ప్రాంతాల్లో నర్సరీల నిర్వాహణకు పంచాయితీ కార్యదర్శులను కేటాయించామని వారి సేవలు వినియోగించుకోవాలన్నారు.  సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో శైలేష్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీపీవో తరుణ్‌ కుమార్‌, నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్‌ రావు, ఎంపీడీఓలు, అటవీ శాఖ అధికారులు, మున్సిపల్‌ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:26:42+05:30 IST