Abn logo
Sep 22 2020 @ 05:07AM

నగరంలో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి...

Kaakateeya

స్టేషన్‌ కు వెళ్లకుండానే సేవలు, సమాచారం

ఎస్‌ఐ అంతకంటే పైస్థాయి అధికారులకు ట్యాబ్‌లు ఇచ్చే యోచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌ను రెండు, మూడు రోజుల్లో నగరవాసులకు అందుబాటులోకి తేవాలని పోలీసులు కసరత్తురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌ను రెండు, మూడు రోజుల్లో నగరవాసులకు అందుబాటులోకి తేవాలని పోలీసులు కసరత్తు ప్రారంభించారు. అందుకోసం ఇప్పటికే ఐటీ కోర్‌తోపాటు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.


నగర ప్రజలకు అవసరమైన సేవలను యాప్‌ ద్వారానే అందజేసేందుకు వీలుగా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీపీ మనీష్‌కుమార్‌సిన్హా ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఆయా విభాగాల సిబ్బంది ఇప్పటికే ఆ విధుల్లో తలమునకలై ఉన్నారు. యాప్‌ ద్వారా ప్రజలు కోరిన సమాచారం ఇవ్వడంతోపాటు ఫిర్యాదులను తక్షణం స్వీకరించడం, అవసరమైన సహాయం అందించేందుకుగాను నగర కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఎస్‌ఐ అంతకంటే పైస్థాయి అధికారులందరికీ ట్యాబ్‌లను అందజేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని పోలీస్‌ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. 


యాప్‌ ఎలా పనిచేస్తుంది

స్మార్ట్‌ ఫోన్‌ను కలిగి వున్నవారందరూ గూగుల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ‘ఏపీ పోలీస్‌సేవ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నపుడు తమకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరెనా పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకన్నా, చేసిన ఫిర్యాదులకు రశీదు కావాలనుకున్నా, తమ ఫిర్యాదు మేరకు ఏ చర్యలు తీసుకున్నారు, ఎవరిని అరెస్టు చేశారు, ఏఏ సెక్షన్లు నమోదుచేశారు, దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా ఇంటి వద్ద నుంచే తెలుసుకోవచ్చు. 


అలాగే పోలీసు పర్మిషన్లు, ఎన్‌ఓసీలు, లైసెన్సులు, పాస్‌పోర్టు సేవలు, పోలీస్‌వెరిఫికేషన్‌, రహదారి భద్రత, సైబర్‌ సెక్యూరిటీ, చోరీలనియంత్రణ, చోరీ కేసుల్లో నిందితులను అరెస్టుచేసినపుడు రికవరీచేసిన సొత్తు వివరాలతో 58 రకాల సేవలను యాప్‌ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. యాప్‌ద్వారా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పోలీసులకు ఫిర్యాదు, వీడియోకాల్‌ సౌకర్యం కూడా ఉంటుంది. సోషల్‌ మీడియాలో అనేక ఫేక్‌ వీడియోలు, సమాచారం వైరల్‌ అవుతుండడంతో వాటిలో వాస్తవం ఎంతవరకు ఉందనేది కూడా యాప్‌ ద్వారా నిర్ధారించుకోవచ్చు.


ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే సమీపంలో ఉన్న ఆస్పత్రులు, బ్లడ్‌బ్యాకులు, మందుల దుకాణాల వివరాలు కూడా యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మనం ప్రయాణించే మార్గంలో బ్లాక్‌స్పాట్‌లు, యాక్సిటెండ్ల మ్యాప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళల భద్రతకు ఉపయోగపడేలా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు, టోల్‌ఫ్రీ నంబర్లు, న్యాయశాఖకు సంబంధించిన సమాచారం ఉంటుంది.రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి యాప్‌ సేవలు:

ఏపీ పోలీస్‌సేవ యాప్‌ సేవలు నగరంలో అందుబాటులోకి వచ్చేందుకు రెండు,మూడు రోజులు సమయం పడుతుందని డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి తెలిపారు. యాప్‌కు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.


యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం చాలా సులభమన్నారు. నగరంలో ఎలా అమలుచేయాలి, ప్రజలకు సమర్థమైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటనేదానిపై చర్చించి ఆ మేరకు అమలుచేస్తామన్నారు. 

Advertisement
Advertisement