Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఆటో.. అస్తవ్యస్తం

twitter-iconwatsapp-iconfb-icon
ఆటో.. అస్తవ్యస్తంచెత్తా చెదారంతో నిండిన డ్రైనేజీలు

మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్న ఆటోనగర్‌

స్తంభించిన డ్రైనేజీ వ్యవస్థ

కొద్దిపాటి వర్షానికే రోడ్లు గుంతలమయం

నేటికీ నెరవేరని మంచినీటి కల

కరెంటు స్తంభాలున్నా చీకట్లోనే పారిశ్రామికవాడ

నగరానికే గర్వకారణమైన జవహర్‌ ఆటోనగర్‌ నేడు అస్తవ్యస్తంగా తయారైంది. కనీస మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో ఆటోనగర్‌ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోవడంతో చిన్నపాటి వర్షానికే నిండిపోయి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ గుంతలమయమై ప్రమాదకరంగా మారుతున్నాయి. దశాబ్దాలు గడిచినా మంచినీటి కల నెరవేరనే లేదు. వీధి వీధికీ కరెంట్‌ స్తంభాలున్నా అందులో బల్బులు లేకపోవడంతో పారిశ్రామికవాడ చీకట్లోనే మగ్గిపోతోంది. 

ఆటోనగర్‌, జూన్‌ 26 : ప్రతిష్టాత్మక విజయవాడ జవహర్‌ ఆటోనగర్‌ ప్రాంతం మౌలిక వసతుల లేమితో కునారిల్లుతోంది. ఆటోమొబైల్‌ పారిశ్రామికవాడ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ కనీస అవసరాలైన డ్రైనేజీ వ్యవస్థ, కార్మికులకు మంచినీళ్లు అందించడంలో ప్రభుత్వం, అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. విశాలమయిన 100, 80 అడుగుల రోడ్లు ఆక్రమణకు గురై ఇరుకు సందులను తలపిస్తున్నాయి. మెజారిటీ రోడ్లకు డ్రైనేజీ కాల్వల ఆనవాళ్లు కనిపించడం లేదు. డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయి చిన్నపాటి గుంతలను తలపిస్తున్నాయి. దీంతో రోడ్లు నానిపోయి వాహనాల తాకిడికి గుల్లవుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే ఇలా ఉంటే రానున్న కాలం లో భారీ వర్షాలకు నీటి రాకపోకలు నిలిచిపోయి ఆటోనగర్‌లో కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షాకాలంలో వచ్చే ఇలాంటి సమస్యలకు ముందుగానే పరిష్కారం చూపాల్సిన అధికారులు, సంఘాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయం. 

నేటికీ నెరవేరని మంచినీటి కల

మంచినీటి సమస్య పరిష్కరించేందుకు సంబంధించిన గట్టిప్రయత్నం ఏపీఐఐసీ అధికారులు ఇప్పటికీ చేయలేదనేది స్థానిక పారిశ్రామికవేత్తల ఆరోపణ. ఇప్పటికీ కంపెనీల యజమానులు, కార్మికులు తమ నీటి అవసరాలను తామే సమకూర్చుకోవడం, లేదంటే స్థానిక హోటళ్లలో లభించే అపరిశుభ్ర నీటితో సరిపుచ్చుకుని రోగాలు కొని తెచ్చుకోవడం మామూలైపోయింది. దీనికి తోడు మలేరియా, డెంగీ లాంటి విషజ్వరాల ఉధృతి ఎక్కువగా ఉండడంతో పారిశ్రామిక వాడ ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. 

వెలగని దీపాలు

అధికారుల నిర్లక్ష్యానికి గురైన మరో అంశం వీధిదీపాలు. ప్రతి రోడ్డులోనూ లక్షలు వెచ్చించి విద్యుత్‌ స్థంభాలు ఏర్పాటు చేసినా నిర్వహణ లోపంతో వెలుగులీనాల్సిన ఆటోనగర్‌ చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో రాత్రిపూట దొంగల హల్‌చల్‌ ఎక్కువైంది. తెల్లారేసరికి బ్యాటరీలు, విలువైన వస్తువులు మాయమవుతుండడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఏళ్ల తరబడి ఎదురుచూసిన పరిశ్రమల .యమానులు ఈ పరిస్థితి ఎప్పటికీ ఇంతేలే నిట్టూరుస్తున్నారు. అన్నివర్గాల కంటే గరిష్ట స్థాయిలో పన్నులు చెల్లించేది తామే అయినా అధికారులు తమపట్ల సీత కన్నువెయ్యడం బాధిస్తోందని ఆటోనగర్‌వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నాం.. వసతులు కల్పించండి

షేక్‌ దస్తగిరి, మెకానిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ

ఎన్నో ఏళ్లుగా గరిష్టంగా పన్నులు చెల్లిస్తున్నాం. కానీ ఏపీఐఐసీ, మునిసిపల్‌ అధికారులు మౌలిక వసతులు పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తామంటున్నారేకానీ కనీసం పట్టించుకోవడం లేదు. వర్షాకాలం వస్తుందంటే భయం వేస్తోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.