ఆటోలో తోట.. ఆశ్చర్యపోతున్న ప్రయాణికులు

ABN , First Publish Date - 2020-10-13T19:10:00+05:30 IST

పచ్చని ప్రకృతి.. పైరగాలి.. చెరువుగట్టు.. ప్రశాంతమైన వాతావరణం.. పల్లటూరు అంటే చాలు మన మనసుల్లో ఇవే మెదులుతాయి. ప్రస్తుతం పట్టణాల్లో బిజీబిజీగా జీవనం గడిపేస్తున్న చాలా మంది ఏదో ...

ఆటోలో తోట.. ఆశ్చర్యపోతున్న ప్రయాణికులు

భువనేశ్వర్: పచ్చని ప్రకృతి.. పైరగాలి.. చెరువుగట్టు.. ప్రశాంతమైన వాతావరణం.. పల్లటూరు అంటే చాలు మన మనసుల్లో ఇవే మెదులుతాయి. ప్రస్తుతం పట్టణాల్లో బిజీబిజీగా జీవనం గడిపేస్తున్న చాలా మంది ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చినవారే. వారంతా జీవితంలో ఎదగాలనే కోరికతో సొంత ఊరిని వదిలిపెట్టి నగరానికి చేరుకుని ఇక్కడి హడావిడి జీవితంతో కుస్తీ పడుతుంటారు. అయితే ఏదో ఒక సమయంలో సొంత ఊరు, అక్కడి పచ్చటి పొలాలు.. ఆహ్లాదరకవైన వాతావరణం గుర్తుకొచ్చి బాధపడుతుంటారు. బిజీ లైఫ్‌స్టైల్‌తో ప్రకృతికి, ప్రశాంతతకు దూరమవుతున్నామని కలత చెందుతుంటారు. సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతారు.. ఒడిశాకు చెందిన సుజిత్‌ డిగల్‌.


సుజీత్‌ దిగ్గల్‌ సొంత ఊరు.. కాందమాల్‌ జిల్లాలోని ఫూల్‌బని ప్రాంతం. తన ఊరంటే సుజీత్‌కు ప్రాణం. అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తూ హాయిగా ఉండేవాడు. తన ఊరిని వదిలి వెళ్లాల్సి వస్తుందని సుజిత్‌ కలలో కూడా అనుకోలేదు. కానీ కరోనా నేపథ్యంలో ఊరిలో పనిలేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని పట్టణం రాక తప్పలేదు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు చేరుకుని ఆటో డ్రైవర్‌ జీవనం సాగిస్తున్నాడు. అంత పెద్ద నగరంలో సుజీత్‌ ఒంటరి. దాంతో ఆటోనే ఇంటిగా మార్చుకుని.. పగలూ, రాత్రీ అందులోనే ఉంటున్నాడు. పండుగలు, వేడుకలప్పుడు ఊరికి వెళ్లి కుటుంబాన్ని కలిసి వస్తుండేవాడు. అయినా ఊరి నుంచి దూరంగా ఉంటున్నాననే బాధ సుజీత్‌ను ఎప్పుడూ బాధించేది. దీనికి తోడు గతేడాది క్రిస్‌మస్‌ సమయంలో ఊరికి వెళ్లలేకపోవడం సుజీత్‌ను తీవ్రంగా కలచివేసింది. ఆ బాధను పోగొట్టుకోవడానికి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. ఊరికి తాను వెళ్లలేకపోతే ఏం.. ఊరినే తన వద్దకు తెచ్చుకోవాలనుకున్నాడు. అందులో నుంచే ఈ ఆటో గార్డెన్‌ ఆలోచన పుట్టింది.


సుజీత్‌ సృష్టించిన ఎన్విరాన్మెంటల్‌ ఫ్రెండ్లీ ఆటో గార్డెన్‌ ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. పచ్చటి మొక్కలు.. పిట్టల కిచకిచలు.. కుందేళ్ల కదలికలు.. నీటిలో చేప పిల్లల టపటపలు.. వీటన్నింటితో ఏదో కొత్త లోకంలా ఉంటుంది.. ఈ ఆటో గార్డెన్‌. ఇందులో ఎక్కిన ప్రయాణికులను మైమరపింపజేస్తోంది. ఆటోను ఇలా మార్చడానికి సుజీత్‌ ఎంతగానో కష్టపడ్డాడు. చాలా ఖర్చు కూడా పెట్టాడు. అయినా తన ఊరి దూరంగా ఒంటరిగా ఉన్నాననే బాధ పోగొట్టుకోవాలనే ఆలోచన ముందు.. ఈ కష్టమంతా చాలా తక్కవగా అనిపించింది సుజీత్‌కి.


ఆటోనే గార్డెన్‌గా మార్చాలనే ఆలోచనపై సుజీత్‌ మాట్లాడుతూ, ఇంత పెద్ద నగరంలో తాను ఒంటరిగా ఉండలేకపోయేవాడినని, మాటిమాటికీ ఊరు గుర్తుకొచ్చేదని, కానీ ఊరికి వెళ్లలేక.. ఇక్కడ ఒంటకిగా బతకలేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవాడినని సుజీత్‌ చెప్పుకొచ్చాడు. అందుకే ఊరి వాతావరణం తన ఆటోలోనే ఉండేలా ఈ ఏర్పాటు చేసుకున్నానని, ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ఇది ఇలాగే కొనసాగిస్తానని చెబుతున్నాడు. అయితే తన ఆటోలో ఎక్కే ప్రయాణికులంతా ఎంతో ఆనందపడుతున్నారని, వారికి కూడా ఈ ఏర్పాటు ఎంతగానో నచ్చుతోందని, ప్రతి ఒక్కరూ తనను ప్రశంసిస్తున్నారని సుజీత్‌ అంటున్నాడు. వారందరికీ తాను కుదిరినన్ని మొక్కలు నాటమని, పచ్చదనాన్ని పెంచమని సూచిస్తానని, అందరికీ చెబుతుంటే ఎవరో ఒకరు.. ఏదో ఒకరోజు కచ్చితంగా మొక్కలు నాటతారని, అది తన విజయమేనని సుజీత్‌ చెబుతున్నాడు. గ్రేట్‌ కదా.. ప్రకృతిని కాపాడాలని, పచ్చదనాన్ని పెంచాలని మీరూ కోరుకుంటే.. ఈ రోజే ఓ మొక్క నాటండి.

Updated Date - 2020-10-13T19:10:00+05:30 IST