ఆటోడ్రైవర్ అయితేనేం.. కరోనా వేళ శభాష్ అనిపించుకుంటున్నాడు!

ABN , First Publish Date - 2021-05-17T00:59:58+05:30 IST

కరోనా మహమ్మారి ప్రస్తుతం ఏమాత్రం దయలేకుండా విరుచుకుపడిపోతోంది. నిర్దయగా ప్రవర్తిస్తూ ఎంతోమంది ప్రాణాలు బలిగొంటోంది. దీని దెబ్బకు ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు ఏమాత్రం సరిపోవడం లేదు.

ఆటోడ్రైవర్ అయితేనేం.. కరోనా వేళ శభాష్ అనిపించుకుంటున్నాడు!

బెంగళూరు: సాయం చేసే మనసు ఉండాలి కానీ దానికి పేద, గొప్ప తేడాలు ఉండవని నిరూపించాడు బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్. కరోనా మహమ్మారి ప్రస్తుతం ఏమాత్రం దయలేకుండా విరుచుకుపడిపోతోంది. నిర్దయగా ప్రవర్తిస్తూ ఎంతోమంది ప్రాణాలు బలిగొంటోంది. దీని దెబ్బకు ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు ఏమాత్రం సరిపోవడం లేదు. మరోవైపు కొవిడ్ బారినపడుతున్న వారు ఆసుపత్రుల్లో బెడ్లు లేక, అక్కడి వరకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. 


కరోనా బారినపడిన వారిని అంటరాని వారిగా చూస్తూ వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక అంబులెన్సులను ఆశ్రయించాలంటే వేలకువేలు ఖర్చు చేయాల్సిందే. మరింత అంత ఖర్చును భరించలేని వారి పరిస్థితి ఏమిటి? మరోవైపు లాక్‌డౌన్. మరి వారిని ఆసుపత్రులకు ఎవరు తీసుకెళ్లాలి? నేను ఉన్నానంటూ ముందుకొచ్చాడు కలబురగికి చెందిన యువ ఆటో డ్రైవర్. కరోనా బారినపడి అంబులెన్సుల ఖర్చు భరించలేని వారికి తన ఆటోలో ఉచితంగా ఆసుపత్రులకు తీసుకెళ్తూ తన దయాగుణాన్ని చాటుకున్నాడు. 


కొవిడ్ రోగులకు సేవలు అందిస్తున్న ఆ ఆటో డ్రైవర్ పేరు ఆకాశ్ డెనూర్. నిజానికి ఆర్మీలో చేరి సరిహద్దుల్లో ఉండి దేశానికి సేవలు అందించాలని కలలు కనేవాడినని, కానీ అది నెరవేరలేదని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తనకు సేవ చేసే అవకాశం వచ్చిందని, కరోనా బారినపడి వారికి సేవ చేస్తూ తన కోరికను నెరవేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.


 కరోనా లాక్‌డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ మూతపడిందని, అంబులెన్సులు కానీ ఆటోలు కానీ అందుబాటులో లేవని ఆకాశ్ పేర్కొన్నాడు. కాబట్టి తాను బాధితులను ఉచితంగా ఆసుపత్రులకు తరలిస్తూ తనకు చేతనైన పని చేస్తున్నానని వివరించాడు. తాను నాలుగేళ్లుగా ఆటో నడుపుతున్నానని చెప్పాడు. ఆర్మీలోకి వెళ్లాలన్న కోరిక తీరకపోవడంతో ఇలా సేవ చేస్తున్నానని పేర్కొన్నాడు.


అవసరార్థుల నుంచి ఫోన్ వచ్చిన వెంటనే వారి ఇంటికి వెళ్లి రోగులను ఆసుపత్రులకు తరలిస్తున్నానని ఆకాశ్ తెలిపాడు. కరోనా వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో తాను చేయగలిగిన సాయం ఇదేనని చెప్పిన ఆకాశ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఆకాశ్ అందిస్తున్న సేవల గురించి తెలిసిన వారు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2021-05-17T00:59:58+05:30 IST