Covaxinను గుర్తించిన ఆస్ట్రేలియా.. వారికి తీపి కబురు

ABN , First Publish Date - 2021-11-01T21:59:58+05:30 IST

భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన

Covaxinను గుర్తించిన ఆస్ట్రేలియా.. వారికి తీపి కబురు

కాన్‌బెర్రా: భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను గుర్తించిన ప్రభుత్వం దానిని ట్రావెలర్స్ వ్యాక్సినేషన్ స్టేటస్‌లో చేర్చింది. ఫలితంగా ఆ టీకా తీసుకున్న ప్రయాణికులను దేశంలోకి అనుమతించనుంది. భారత్‌లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాను గత నెలలో గుర్తించిన ఆస్ట్రేలియా తాజాగా కొవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.


అలాగే, సినోఫార్మ్‌కు చెందిన బీబీఐబీపీ-కోర్‌విని కూడా ఈ జాబితాలో చేరుస్తూ ఆస్ట్రేలియా ఫార్మా రెగ్యులేటర్ థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ (టీజీఏ) నిర్ణయం తీసుకుంది.


12 ఏళ్లు పైబడి కొవాగ్జిన్ తీసుకున్న వారిని, 18-60 మధ్య ఉండి ‘బీబీఐబీపీ-కోర్‌వి’ టీకా తీసుకున్న వారిని దేశంలోకి అనుమతించనున్నట్టు టీజీఏ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా తాజా నిర్ణయంతో అంతర్జాతీయ విద్యార్థులు, కార్మికులకు ఊరటలభించినట్టు అయింది.


టీకా తీసుకోని వారు దేశంలో అడుగుపెట్టాలంటే క్వారంటైన్ నిబంధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, విమానం ఎక్కడానికి ముందు కరోనా నెగటివ్ సర్టిఫికెట్ కూడా చూపించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-11-01T21:59:58+05:30 IST