‘మనోళ్ల’కే ఎత్తుపీట

ABN , First Publish Date - 2020-07-12T11:20:04+05:30 IST

ద్రావిడ విశ్వవిద్యాలయం మరోసారి వివాదాస్పద నిర్ణయాలకు కేంద్రబిందువుగా మారుతోందన్న విమర్శలొస్తున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా

‘మనోళ్ల’కే ఎత్తుపీట

రేపటి ద్రావిడ వర్శిటీ ఈసీ భేటీలో ఆమోదముద్రకు యత్నాలు 


 కుప్పం, జూలై 11: ద్రావిడ విశ్వవిద్యాలయం మరోసారి వివాదాస్పద నిర్ణయాలకు కేంద్రబిందువుగా మారుతోందన్న విమర్శలొస్తున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా కొందరికి ప్రయోజనాలు చేకూర్చే నిర్ణయాలను ఉన్నతాధికారులు తీసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగి పోతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న ఈసీ సమావేశంలో జరిగిన ,జరగాల్సిన నియామకాలు, పదోన్నతులపై చర్చ జరగనుంది.ద్రావిడ వర్శిటీ అధికారులు ‘అస్మదీయుల’కోసమే ప్రత్యేకంగా ఒక అజెండా తయారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవేమిటంటే..


కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్టుమెంట్‌ ప్రొఫెసర్‌గా రిటైరైన వ్యక్తిని ఓఎస్‌డీగా నియమిస్తూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఉత్తర్వులు ఇటీవల వివాదాస్పదం కావడంతో ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఓఎస్డీ నియామకంతోపాటు, ఆయనకు పే ఫిక్షేషన్‌ సైతం తామనుకున్న రీతిలో ఆమోదం పొందడానికి వీలుగా రికార్డులను ఈసీ సమావేశం కోసం సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది.ఫవర్శిటీ ఇంజనీరింగ్‌ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన.. పదేళ్ల క్రితం నియామకం పొందిన ఏఈఈ ఒకరికి ఇటీవల డీఈఈగా పదోన్నతి లభించిన అంశం కూడా ఈసీలో చర్చకు రానుంది.


రెగ్యులరైజ్‌, టైమ్‌ స్కేల్‌:  ద్రావిడ వర్శిటీలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న 244మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల టైమ్‌ స్కేల్‌ అంశం కూడా ఈసీ ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. వీరిలో తమకు అనుకూలమైన కొందరికే మేలు జరిగేలా పావులు కదులుతున్నాయనే విమర్శలున్నాయి. ఫవర్శిటీలో రూ.5 లక్షలకు మించిన అభివృద్ధి పనులకు టెండర్లు పిలవాలి. అలా కాకుండా రూ.20 లక్షల విలువ కలిగిన బోర్ల డ్రిల్లింగ్‌, విద్యుత్తు మోటార్లు, పైపులైన్ల ఏర్పాటు వంటి ఒకే కేటగిరీకి చెందిన పనిని ఐదు విభాగాలుగా విభజించి అస్మదీయులకే కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ అంశం కూడా ఈసీలో చర్చకు రానుంది.



అన్నీ సక్రమమే

ద్రావిడ విశ్వవిద్యాలయంలో వ్యవహారాలన్నీ నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయి. కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల నిరంతర పర్యవేక్షణకోసం ఓఎస్డీ నియామకం ఈసీ అనుమతితోనే చేశాం. వేతనం మాత్రం ఈసీ ఆమోదంతోనే నిర్ణయిస్తాం.ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, పదోన్నతులల్లో అవకతవకలు చోటు చేసుకోలేదు.

-ఎన్‌.సుశీల, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌

Updated Date - 2020-07-12T11:20:04+05:30 IST