రూ.2కోట్ల విలువైన సిల్వర్‌ దొంగలించేందుకు ప్రయత్నం

ABN , First Publish Date - 2022-05-23T06:29:55+05:30 IST

రూ. 2 కోట్ల విలువైన సిల్వర్‌ దొంగలించేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్‌, క్లీనర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

రూ.2కోట్ల విలువైన సిల్వర్‌ దొంగలించేందుకు ప్రయత్నం
పట్టుకున్న సిల్వర్‌ను చూపిస్తున్న ఎస్‌పీ శ్రీనివాస్‌రెడ్డి

- దొంగతనం చేదించిన జిల్లా పోలీసులు

- డ్రైవర్‌,క్లీనర్‌ను జక్రాన్‌పల్లి వద్ద పట్టుకున్న పోలీసులు

కామారెడ్డి/ భిక్కనూర్‌,మే 22: రూ. 2 కోట్ల విలువైన సిల్వర్‌ దొంగలించేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్‌, క్లీనర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హర్యానా రాష్ట్రంలోని ముగ్రుడిన్‌ రోడ్‌లైన్‌ ట్రావెల్స్‌కు చెందిన ఒక లారీ చైన్నె నుంచి ఢిల్లీకి రూ.2కోట్ల విలువైన సిల్వర్‌ను తీసుకుని వెళ్తుందని తెలిపారు. లారీ లొకేషన్‌ తెలుసుకోవడానికి ట్రావెల్స్‌కు చెందిన జలాలుద్దీన్‌ జీపీఎస్‌ను సైతం లారీలో ఏర్పాటు చేయగా అందులోని సిల్వర్‌ వస్తువులను దొంగలించేందుకు డ్రైవర్‌, క్లీనర్‌లు పన్నాగం వేసి భిక్కనూర్‌ గ్రామంలోని హరియాణ దాబా వద్ద జీపీఎస్‌ను లారీ నుంచి తొలగించారని ఎస్పీ తెలిపారు. వెంటనే ట్రావెల్స్‌ నిర్వాహకులు 100కు కాల్‌చేసి సమాచారం అందించడంతో జిల్లా పోలీసులతో పాటు చుట్టు పక్కల ఉన్న నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిర్మల్‌ జిల్లాల్లోని పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి భిక్కనూర్‌ సీఐ తిరుపతయ్య బృందం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జక్రాన్‌పల్లి వద్ద లారీతో పాటు నిందితులైన డ్రైవర్‌ సాహిద్‌, క్లీనర్‌ సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ట్రావెల్స్‌కు చెందిన జలాలుద్దీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన సీఐ తిరుపతయ్య, శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌గౌడ్‌, ఉస్మాన్‌, ఏఎస్‌ఐ రాజేశ్వర్‌రావులను అభినందిస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2022-05-23T06:29:55+05:30 IST