విజిలెన్స్‌ అధికారుల దాడులు

ABN , First Publish Date - 2020-06-04T08:51:50+05:30 IST

గుంటూరు జిల్లాలో ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, పురుగుమందు నిల్వలు పెద్దఎత్తున వెలుగులోకి వస్తున్నాయి.

విజిలెన్స్‌ అధికారుల దాడులు

నిషేధిత పురుగుమందుల అమ్మకం రికార్డులు సీజ్‌

 ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


గుంటూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలో ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, పురుగుమందు నిల్వలు పెద్దఎత్తున వెలుగులోకి వస్తున్నాయి.  బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘నిషేధానికి నీళ్లు వదిలారు.. కొందరు అధికారుల అండతో నెల్లూరుకు తరలింపు’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై ప్రకాశం, గుంటూరు జిల్లాల విజిలెన్‌ ్స అధికారులు దాడులు చేశారు. ఆ శాఖకు చెందిన సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు ఉమాపతి (ప్రకాశం), వాసంతి (గుంటూరు) దాడుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలో ఎరువుల షాపు యజమాని నిషేధించిన కలుపు మందు అమ్మినట్లు, గుంటూరులోని జాతీయ రహదారి అంజనేయస్వామి విగ్రహం సమీపంలోని ఒక డీలర్‌ సరఫరా చేసినట్లు చెప్పారు.


దీంతో ఏటూకూరు సమీపంలోని పురుగు మందులు, ఎరువుల గిడ్డంగిపై దాడులు చేసి పరిశీలించగా సుమారు 50వేల లీటర్ల నిషేధించిన కలుపు మందు అమ్మినట్లు తేలింది. ఈ మేరకు రికార్డులను సీజ్‌చేశారు. అయితే ఈ గిడ్డంగిపై మూడు వారాల క్రితం వ్యవసాయశాఖ జిల్లా కార్యాలయం అధికారులు తనిఖీచేసి, ఎటువంటి ఎరువులు, పురుగుమందులు లేవని రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం! నిషేధించిన కలుపుమందు నిల్వలకు సంబంధించి లీటర్‌కు రూ.20 చొప్పున కమీషన్‌  తీసుకుని తనిఖీల్లో నిల్‌ రిపోర్టు చూపించినట్లు తెలుస్తోంది.


సీఎం పేషీ ఆరా...

ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయం అధికారులు ఆరాతీసినట్లు సమాచారం. అలాగే సీఎం పేషీ ఉన్నతస్థాయి అధికారి ధనుంజయరెడ్డి కూడా వివరాలు సేకరించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-06-04T08:51:50+05:30 IST