దళితులపై దాడి

ABN , First Publish Date - 2021-04-16T06:31:51+05:30 IST

కౌతాళం మండలం ఉప్పరహాల్‌ గ్రామంలో బుధవారం అంబేడ్కర్‌ చిత్రపటంతో ఊరేంగింపుగా వెళ్తున్న దళితులపై అదేగ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గం వారు దాడి చేశారు.

దళితులపై దాడి

  1. అంబేడ్కర్‌ జయంతి ఊరేగింపును అడ్డుకున్న వైనం 
  2. 10 మందికి పైగా గాయాలు


కౌతాళం/ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 15: కౌతాళం మండలం ఉప్పరహాల్‌ గ్రామంలో బుధవారం అంబేడ్కర్‌ చిత్రపటంతో ఊరేంగింపుగా వెళ్తున్న దళితులపై అదేగ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గం వారు దాడి చేశారు. దీంతో పదిమందికి పైగా గాయపడ్డారు.  అంబేడ్కర్‌ జయంతి పురస్కరించుకుని అంబేడ్కర్‌ చిత్రపటాన్ని ట్రాక్టర్‌పై ఊరేగింపుగా తీసుకెళ్తుండగా ఓ సామాజికవర్గంవారు తమ వీధిలోకి ఎలా  వస్తారని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో పాటు రాళ్లు రువ్వుకున్నారు. అంతేగాక అంబేడ్కర్‌ చిత్రపటాన్ని చించివేసి దళితులపై కట్టెలు, వేటకొడవళ్లతో దాడి చేశారు. దీంతో పదేళ్ల బాలుడితోపాటు హనుమంతు, శేఖర్‌, గౌరప్ప, ఆలంబాషా తదితరులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. హనుమంతు ఫిర్యాదు మేరకు చిన్నమాదేవ, మాదేవ, సూగప్ప, మారెన్న, బీరప్ప, మరో 11మందిపై ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసును కౌతాళం పోలీసులు నమోదు చేశారు. 


గ్రామంలో పర్యటించిన డీఎస్పీ, ఆర్డీవో


ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్‌ల గ్రామంలో పర్యటించారు. ఇరువర్గాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ ఘటనపై విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా  అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-04-16T06:31:51+05:30 IST