దుర్మార్గం

ABN , First Publish Date - 2020-04-22T06:19:21+05:30 IST

మహారాష్ట్ర ఉత్తర ప్రాంతంలోని పాల్‌గఢ్‌ జిల్లాలో గత వారం జరిగిన ఒక దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సాధువులను, వారి వాహనం డ్రైవర్‌ను గడ్‌చించలే అనే గ్రామం వద్ద ఒక మూక అడ్డగించి, దారుణంగా కొట్టి చంపారు...

దుర్మార్గం

మహారాష్ట్ర ఉత్తర ప్రాంతంలోని పాల్‌గఢ్‌ జిల్లాలో గత వారం జరిగిన ఒక దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సాధువులను, వారి వాహనం డ్రైవర్‌ను గడ్‌చించలే అనే గ్రామం వద్ద ఒక మూక అడ్డగించి, దారుణంగా కొట్టి చంపారు. ఈ మూకదాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమై, రకరకాల కథనాలు వెల్లువెత్తాయి. నిస్సహాయులు, వయోధికులు అయిన ఆ ఇద్దరు సాధువులను, అల్లరి మూక అత్యంత దారుణంగా, అమానుషంగా కొట్టి చంపడం ఆ వీడియోలు చూసినవారందరినీ తీవ్రంగా కలచివేసింది. దాడిచేసినవారు, దాడికి గురయినవారు సామాజికంగా ఏ వర్గాలకు చెందినవారన్న విషయంలో అనేక ఊహాగానాలు ప్రారంభమై, ఈ సంఘటనకు మతహింస రంగు అంటుకున్నది. హిందూ సాధువులను మైనారిటీ మూక దాడిచేసి చంపిందనే విధంగా, బాధ్యత కలిగిన రాజకీయపార్టీలు, అనేక మతతత్వ సంస్థలు ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రిపబ్లిక్‌ టీవీ ప్రముఖుడు అర్నబ్‌ గోస్వామి, తన ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యానంలోనే, ఈ సంఘటన బాధితులు హిందువులు కావడం వల్లనే జరిగిందని, దేశంలోని మేధావులు, మీడియా పెద్దలు ఈ విషయంపై మాట్లాడకపోవడం సిగ్గుచేటని, తాను ఎడిటర్స్‌ గిల్డ్‌ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ సంఘటన మతపరమైనది కాదని, దుండగులు, బాధితులు ఒకే మతవర్గానికి చెందినవారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్‌మంత్రి స్పష్టం చేసినప్పటికీ, ఈ సంఘటనపై చిలవలుపలవలుగా వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. అక్కడ మైనారిటీలు లేరా, అయితే సరే, నక్సలైట్లు ఉన్నారేమో చూడండి, వారే చేయించి ఉంటారు బీమా కోరేగావ్‌ లాగా– అని ఒక బిజెపి నాయకుడు వ్యాఖ్యానించారు.


అంత్యక్రియలకు హాజరయ్యే నిమిత్తం పశ్చిమ మహారాష్ట్ర నుంచి సిల్విస్సాకు వెడుతున్న ఈ సాధువుల వాహనం, ప్రధాన రహదారిలో కరోనా కట్టడి ఉండడం కారణంగా, గ్రామీణ మార్గంలోకి మళ్లింది. గుజరాత్‌, దాదర్‌ సరిహద్దుల్లోని పాల్‌ఘడ్‌ ఉత్తరప్రాంతం, బాగా వెనుకబడిన ప్రాంతం. గిరిజనులు అధికంగా నివసిస్తారు. ఈ ప్రాంతంలో పిల్లలను అపహరించే దొంగలు సంచరిస్తున్నారనే వదంతులు ఈ మధ్యకాలంలో చాలా వ్యాపించాయి. కొన్ని రోజుల కిందట విశ్వాస్‌ వాల్వీ అనే వైద్యుడు ఈ ప్రాంతంలోని ఒక గ్రామంలో కరోనా వ్యాప్తి పరిశీలన కోసం జ్వరనిర్ధారణలు చేయడానికి వస్తే, ఆయన వాహనంపై దాడిచేసి ధ్వంసం చేశారు. ఆ సంఘటనలో నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. తాజా సంఘటనలో చనిపోయిన ఇద్దరు సాధువులు, కల్పవృశ్‌ గిరి (70), సుశీల్‌గిరి (35)– ఈ ఇద్దరూ ఆదివాసులే. ఈ ప్రాంతంలో ఉన్న గోసావి అనే సంచార తెగకు చెందిన వీరు, వారణాసికి చెందిన ‘‘శ్రీ పంచదశ్‌నమ్‌ జునా అఖాడా’’ అనే సాధుకోవకు చెందినవారు. ఈ గోసావి తెగ వారిపై దాడులు కూడా కొత్త కాదు. ధూలే జిల్లాలోని రైన్‌పడ అనే గ్రామంలో 2018లో ఐదుగురు గోసావి తెగవారిని కొట్టి ఒక గిరిజన గ్రామంలో చంపారు. రాష్ట్రంలోని 43 సంచార, గతనేరస్థజాతులలో గోసావి కూడా ఒకటి. ఆ తెగవారిపై ఇతరులకు అనేక అపోహలు ఉన్నాయి. సంచారజీవనం చేసేవారిపై ఉండే అనుమానాలతో ఈ సాధువులను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. ఆ మారుమూల దారిలో ప్రయాణించడానికి, వారు చెబుతున్న కారణానికి సంబంధం ఉన్నట్టు నమ్మకం కుదరక, దాడికి తెగబడ్డారు. అది అత్యంత దుర్మార్గమైన, పాశవికమైన దాడి. పిల్లల అపహరణ అక్కడ ఎందుకంత ఆందోళనకరమైన అంశంగా ఉన్నదో, ఆ ప్రాంతంలో అపహరణలు ఎక్కువగా జరగిన నేపథ్యం ఉన్నదేమో విచారించాలి. 


ఈ సంఘటన మనకు అనేక ఇతర ఘటనలను గుర్తుకు తెస్తుంది. పిల్లలను అపహరించేవారు వస్తున్నారన్న వదంతులతో, దక్షిణాది రాష్ట్రాలలో జరిగిన మూకదాడులు, గోమాంసం దాచిపెట్టాడని, పశువులను అక్రమ రవాణా చేస్తున్నారని మైనారిటీ వర్గీయులపై జరిగిన హంతకదాడులు మన స్మృతిపథంలో ఉన్నాయి. మూకదాడి – ఎవరిమీద ఎవరు చేసినా అది అమానుషమైనది. అబద్ధం మీద, ఆవేశం మీద ఆధారపడి, విచక్షణ కోల్పోయిన మూక పాల్పడే దాడి అది. అందులో, చనిపోయేది మనుషులు మాత్రమే కాదు, సత్యం మరణిస్తుంది, సభ్యత మరణిస్తుంది, సమాజంలో ఉన్న సమష్టి భావన మరణిస్తుంది. భద్రత అంతరిస్తుంది. ఆ నాడే అందరం ఈ దుర్మార్గాన్ని నిలువరించి ఉంటే, మూకదాడులు కొనసాగితే కలిగే ప్రమాదాన్ని ప్రభుత్వం తగినంతగా గుర్తించి ఉంటే ఇప్పుడు ఇటువంటి దుస్సంఘటన జరిగేది కాదు. కరోనా కాలంలో సుదీర్ఘ ప్రయాణం చేయబోయిన ఈ సాధువులను ఈ మారుమూల ప్రాంతంలోకి రాకముందే ప్రధాన రహదారిపైనే అడ్డగించి ఉంటే ఇంత ఘోరం తప్పిపోయేది. కరోనా వల్ల రాష్ట్రాల సరిహద్దుల్లో నిరాశ్రయులుగా వేలాది మంది వలసకూలీలు నిలిచిపోవడం, వారి విడిదుల సమీప గ్రామాల్లో రకరకాల అభద్రతను సృష్టిస్తున్నది. దానికితోడు, వదంతులను, అసత్యాలను ప్రచారం చేసే దండు ఉండనే ఉన్నది. 

మూకదాడులను సామాజిక మాధ్యమం మీదికి సగౌరవంగా తీసుకువచ్చి, వాటికి పచ్చి అబద్ధాలతో ముస్తాబు చేసేవారు ఊచకోతలు కోసేవారితో సమానం. స్థానికంగా ప్రచారమయ్యే వదంతులకు, వీరి పోస్టులకు తేడా లేదు. జరగనిదానిని జరిగినట్టుగా ప్రచారం చేసి, జరిగినదానిని వక్రీకరించి ప్రజల మనస్సుల్లో ఒక ద్వేషాన్ని స్థిరపరిచే శక్తులను గట్టిగా అడ్డుకోవలసిన అగత్యం ఉన్నది. సత్యాన్ని పదేపదే, దృఢంగా వ్యాపింపజేయడం ఒక్కటే ఇందుకు మందు. ప్రజల సమస్యలను, ప్రజల మనోభావాలను సవ్యమైన రీతిలో సామాజిక మాధ్యమాలలో పంచుకునేవారిపై రాజద్రోహాలు, సైబర్‌చట్టాలు, ఊపాలూ ఉత్సాహంగా ప్రయోగించే పాలకులు, ఈ ద్వేషభక్తుల అబద్ధాల స్వారీని మాత్రం ఎందుకు సహిస్తున్నారో అర్థం కాదు.

Updated Date - 2020-04-22T06:19:21+05:30 IST