జాబితాల్లో కిరికిరి..!

ABN , First Publish Date - 2020-12-05T06:34:43+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీల సీనియారిటీ జాబితాల్లో కిరికిరి చేశారా..? చీకటి ఒప్పందం చేసుకున్న కొందరు నాయకులకు అలాగే పా యింట్లు పెట్టారా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి.

జాబితాల్లో కిరికిరి..!

అక్రమార్కులకు తొలగని పాయింట్లు

తీసేశామంటున్నా లిస్టులో అలాగే ఉన్న వైనం 

డైరెక్టర్‌ పేరు చెప్పి.. మరికొందరికి లబ్ధి

24 గంటలు ఆలస్యంగా సవరించిన జాబితా

జిల్లాలోనే ఎందుకిలా?

సాక్ష్యాలు లేకుండా పేర్లు గల్లంతు

భారీగా అక్రమాలు

అనంతపురం విద్య, డిసెంబరు 4: ఉపాధ్యాయుల బదిలీల సీనియారిటీ జాబితాల్లో కిరికిరి చేశారా..? చీకటి ఒప్పందం చేసుకున్న కొందరు నాయకులకు అలాగే పా యింట్లు పెట్టారా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ముందుగానే సీనియారిటీ జాబితాలు వస్తే.. అనంతలో మాత్రం ఆలస్యమవటం, అక్రమార్కులకు అలాగే పాయింట్లు ఉంచటం, గతంలోని బదిలీల జాబితాల్లో కొందరి పేర్లు గల్లంతవటం చూస్తుంటే కొం దరు అధికారులు, నాయకులు కుమ్మక్కై అక్రమాలకు భారీగా తెరతీశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


లిస్టుల్లో పేర్ల గల్లంతు

గతంలో చేపట్టిన బదిలీలకు సంబంధించిన జాబితాలను గురువారం రాత్రి డీఈఓ కార్యాలయ అధికారులు డీఈఓ బ్లాగులో పెట్టారు. 2009, 2012 బదిలీల్లో స్పౌజ్‌, 2015లో ప్రిఫరెన్సియల్‌, 2017లో ఈ రెండు కేటగిరీలను వాడిన వారి జాబితాలు ఉంచారు. గతంలో జరిగిన బదిలీల జాబితాలు ఉంచాలంటూ డీఈఓ శామ్యూల్‌ అధికారులను ఆదేశించారు. కొందరు కిందిస్థాయి అధికారులు.. డీఈఓకు మస్కా కొట్టి.. లిస్టుల్లో కొన్ని పేర్లు తొలగించినట్లు సమాచారం. గతంలో స్పౌజ్‌, ఇతర కేటగిరీల్లో లబ్ధి పొంది ఈసారి సైతం ప్రయోజనం పొందేందుకు పలువురు ప్రయత్నించారు. వారి వివరాలు తెలియకుండా ఉండాలంటే.. గతంలోని జాబితాల నుంచి వారి పేర్లు తొలగిస్తే పోలా అంటూ కొందరు విద్యాశాఖలోని అధికారులు సుమారు ఏడుగురి పేర్లను మాయం చేసినట్లు సమాచారం. జువైనల్‌ డయాబెటీస్‌, పీహెచ్‌ కింద ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారు గతంలోనూ ప్రిఫరెన్సియల్‌ కేటగిరీలో లబ్ధి పొందా రు. లిస్టుల్లో పేర్లు గల్లంతు చేస్తే.. వారు తాజా జాబితాలో చేరుతారు. సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు ఈ వ్యూ హం పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


అయినా ఆగని అక్రమాలు

బదిలీల్లో లద్ధి పొందేందుకు కొందరు అక్రమ మార్గాల్లో వస్తే.. వారిని కట్టడి చేయాల్సిన అధికారులు సైతం గేట్లు తెరిచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బయటకు తొలగించామంటూనే కొందరు అధికారులు అక్రమాలకు సీనియారిటీ జాబితాల్లో పాయింట్లు కేటాయించటంపై విమర్శలు వస్తున్నాయి. బత్తలపత్తిలో ఓ మహిళా టీచర్‌ చెవుడు లేకున్నా.. ఉన్నట్లు దరఖాస్తు చేసిందనీ, ఆమెకు పాయింట్లు కేటాయించి, నమోదు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ నాయకుడిపై అభియోగాలు నమోదైనా (ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జస్‌) ఆయనకు స్పౌజ్‌ పాయింట్లు నమోదు చేశారు. మరి కొందరు సైతం అక్రమ మార్గాల్లో పాయింట్లు పొందినట్లు తెలుస్తోంది. అడ్డదారుల్లో వచ్చి ప్రిఫరెన్సియల్‌ కేటగిరీలో దరఖాస్తు చేసిన  పలువురికి సైతం పాయింట్లు ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం అభ్యంతరాల స్వీకరణకు 32 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం సైతం అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి సవరణ తర్వాత జాబితాను ఈనెల 10వ తేదీలోపు జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తారు. ఆలోపైనా అక్రమార్కుల పాయింట్లు తొలగిస్తారా, లేక ఓకే చెబుతారో చూడాలి.

Updated Date - 2020-12-05T06:34:43+05:30 IST