చర్యలు ఒక్కరిపైనేనా..?

ABN , First Publish Date - 2020-12-02T06:47:51+05:30 IST

ఉపాధ్యాయ బదిలీల్లో సమన్యాయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దగ్గరి స్థానాలు పొందేందుకు బోగస్‌, ఫోర్జరీ సర్టిఫికెట్లతో సమర్పించిన 60 దరఖాస్తులను విద్యాశాఖ ఉన్నతాధికారులు తిరస్కరించారు

చర్యలు ఒక్కరిపైనేనా..?

టీచర్ల బదిలీల్లో కనిపించని సమన్యాయం..

దొడ్డిదారిన సమర్పించిన 60 దరఖాస్తుల తిరస్కరణ

ఒకరిపై సస్పెన్షన్‌ వేటు.. మిగిలిన వారికి వర్తించదా..?

తప్పించుకునేందుకు ఒత్తిడి పెంచుతున్న కొందరు నాయకులు

విద్యాశాఖ ఉన్నతాధికారుల అడుగెటు..?

అనంతపురం విద్య, డిసెంబరు 1: ఉపాధ్యాయ బదిలీల్లో సమన్యాయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దగ్గరి స్థానాలు పొందేందుకు బోగస్‌, ఫోర్జరీ సర్టిఫికెట్లతో సమర్పించిన 60 దరఖాస్తులను విద్యాశాఖ ఉన్నతాధికారులు తిరస్కరించారు. నిబంధనల మేరకు సమర్పించిన వారందరిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఒక్కరిని మాత్రమే సస్పెండ్‌ చేశారు. మిగతా వారి సంగతి తేల్చట్లేదు. అక్రమ మార్గాలను ఎంచుకున్న కొందరు ఉపాధ్యాయ నేతలు తప్పించుకునేందుకు అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాశాఖాధికారులు.. అక్రమార్కులందరిపై చర్యలు తీసుకుంటారా? ఒత్తిళ్లకు తలొగ్గుతారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులుగా చెప్పుకునే కొందరు అక్రమాలకు పాల్పడితే.. వారిని వదిలేసి, సామాన్యులపై మాత్రమే విద్యాశాఖాధికారులు కొరడా ఝళిపించటం విమర్శలకు తావిస్తోంది. బదిలీల్లో దగ్గరి స్థానాల కోసం అడ్డదారిలో వచ్చిన వారిపై నిఘా పెట్టిన అధికారులు ఇప్పటికే 49 దరఖాస్తులను తిరస్కరించారు. మంగళవారం మరో 11 బోగస్‌ అని తేల్చారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటంలో మాత్రం సమన్యాయం కరువైంది.


60 దరఖాస్తుల తిరస్కరణ

నిబంధనలకు విరుద్ధంగా ఫోర్జరీ, బోగస్‌ సర్టిఫికెట్లతో సమర్పించిన దరఖాస్తులను విద్యాశాఖాధికారులు తిరస్కరించారు. వాటిని డీఈఓ శామ్యూల్‌.. జాయింట్‌ కలెక్టర్‌ సిరి దృష్టికి తీసుకెళ్లి, పరిశీలించారు. జేసీ ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిలో గతంలో 49 దరఖాస్తులను తిరస్కరించారు. తాజాగా మరో 11 రిజెక్ట్‌ చేశారు. ఈ లెక్కన 60 దరఖాస్తులను తొలగించారు. దీంతో అర్హులైన టీచర్లకు న్యాయం చేకూరుతుంది. వారికి మంచి స్థానాలు లభిస్తాయనటంలో సందేహం లేదు. మరికొందరు స్పౌజ్‌ కేటగిరీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీరిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఒత్తిళ్లకు తలొగ్గుతారా..?

బదిలీల్లో అక్రమాలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీలకు సంబంధించి ఇటీవల విడుదలైన జీవో 54లోని 21 రూల్‌ ప్రకారం టీచర్‌, ప్రధానోపాధ్యాయుడు తప్పుడు సమాచారమిచ్చినా.. బోగస్‌ సర్టిఫికెట్లు అందజేసినా.. క్రమశిక్షణ చర్యలతోపాటు విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బదిలీల లబ్ధిని కూడా రద్దు చేస్తారు. అంతేకాకుండా రీ కేటగిరీ 4, 3 ఏరియాలకు రిపోస్టు చేస్తారు. అదే బోగస్‌ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, డీవైఈఓ, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాళ్లు ధ్రువీకరిస్తే.. వారిపై సైతం క్రమశిక్షణ చర్యలతోపాటు, విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బోగస్‌ సమాచారమిచ్చిన టీచర్లతోపాటు సంఘాల నాయకులపై కూడా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్‌ ఫోర్జరీ చేయటంతో ఎస్‌జీటీని సస్పెండ్‌ చేశారు. 20 హెచ్‌ఆర్‌ఏ స్థానాలు, ఇతర ప్రయోజనాల కోసం కొందరు సంఘాల నాయకులు సైతం గతంలో స్పౌజ్‌, ప్రిఫరెన్సియల్‌ వాడుకుని కూడా.. మళ్లీ దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఓ సంఘం నాయకుడు తప్పు చేసి, అభియోగాలు నమోదవటంతో తనపై ఎలాంటి అక్షింతలు లేకుండా సంఘం నాయకులను వెంట బెట్టుకుని, సైన్స్‌ సెంటర్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. విద్యాశాఖ ఉన్నతాఽధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నాడు. ఇప్పటికే తిరస్కరించిన దరఖాస్తుదారులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరిని సస్పెండ్‌ చేసి, కంటితుడుపు చర్యలుగా మమ అనిపిస్తారో చూడాలి.


ఫిర్యాదులొస్తే.. విచారించి చర్యలు : శామ్యూల్‌, డీఈఓ

బదిలీల్లో సర్టిఫికెట్‌ ఫోర్జరీ, బోగస్‌ సమాచారమిచ్చిన వారిపై చర్యలకు ఉపక్రమించాం. సస్పెండ్‌ చేసి, తీరతాం. ప్రతి స్పౌజ్‌ సర్టిఫికెట్‌నూ పరిశీలిస్తున్నాం. ఇకపై కూడా ఏవైౖనా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తే.. విచారించి, అక్రమం అని తేలితే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-12-02T06:47:51+05:30 IST