Abn logo
Jun 18 2021 @ 01:08AM

ఇసుక అక్రమార్కులకు రూ.లక్షల్లో ఆదాయం

బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్యదొడ్డి ఇసుక రీచ్‌ వద్ద నిలిచి ఉన్న టిప్పర్లు

అధికారం అండగా.. అక్రమ రవాణా..

ఇసుక అక్రమార్కులకు రూ.లక్షల్లో ఆదాయం 

 అజ్జయ్యదొడ్డి రీచ్‌లో యథేచ్ఛగా ఇసుక తరలింపు

రీచ్‌ వద్ద క్యూకట్టిన టిప్పర్లు 

ఆఫ్‌లైన్‌ ముసుగులో దోపిడీ 

నియంత్రణలో అధికార యంత్రాంగం విఫలం

కళ్యాణదుర్గం, జూన్‌ 17: బ్రహ్మసముద్రం మండ లం అజ్జయ్యదొడ్డి ఇసుక రీచ్‌ అక్రమాలకు నిలయంగా మారింది. ఆఫ్‌లైన్‌ ముసుగులో లక్షల రూపాయల విలువచేసే ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక రీచ్‌ల నిర్వహణను ప్ర భుత్వం తమిళనాడుకు చెందిన జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి అప్పజెప్పింది. దీంతో నెల రోజులుగా ఆఫ్‌లైన్‌లో ఇసుకను తరలిస్తూ లక్షల రూ పాయలు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇసుక కోసం ఇతర ప్రాంతాల నుంచి టిప్పర్లు వస్తున్నాయి. సుమారు మూడు కిలోమీటర్ల మేర టి ప్పర్లు క్యూ కడుతున్నాయి.  అజ్జయ్యదొడ్డి రీచ్‌ నుంచి కర్ణాటక, కర్నూలు, శ్రీశైలం, నంద్యాల, సున్నిపెంట తదితర ప్రాంతాలకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. స్థానికులకు మాత్రం ఒక ట్రాక్టర్‌ ఇసుక కూడా దొరకడంలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్‌ విధానాన్ని రద్దుచేసి ఆఫ్‌లైన్‌ ద్వారా ఇసుక సరఫరా చేయడంతో ఇసుక దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పలుకుబడి ఉంటేకాని సామాన్య ప్రజలకు ఇసుక దొరికే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. ఇసుక తరలింపునకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం పైరవీలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  పోలీస్‌ అధికారులను అడ్డుపెట్టుకుని టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్యదొడ్డి, ముదిగుబ్బ మండలం నల్లబోయినపల్లి, యల్ల్లనూరు మండలం లక్షుంపల్లి రీచ్‌లు మాత్రమే ఉన్నాయి. అజ్జయ్యదొడ్డి మినహా ఇతర రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరగడంలేదని భూగర్భజల శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. అజ్జయ్యదొడ్డి రీచ్‌లో ఇసుక అధికంగా ఉండడం, వైసీపీ అధినాయకులకు కల్పతరువుగా మారింది. 


ఇసుక కోసం పడిగాపులు 

ఒక ట్రాక్టర్‌ ఇసుక కావాలంటే అజ్జయ్యదొడ్డి రీచ్‌ వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి స్థానికులకు నెలకొంది. రెండు నెలలుగా ఇసుక రీచ్‌లను ప్రభుత్వం నిలిపివేయడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇటీవల ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ఎత్తివేసి ఆఫ్‌లైన్‌ విధానాన్ని అమలు చేసింది. తమిళనాడుకు చెందిన జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు ఇసుక రీచ్‌లను అ ప్పగించింది. టన్ను ఇసుక రూ.475 ప్రకారం ధరను ఖరారు చేసింది. రవాణా చార్జీలపై ఎలాంటి నిబంధనలు, నియంత్రణ ఇవ్వలేదు. దీంతో వాహనదారులు (టిప్పర్‌, ట్రాక్టర్‌ యజమానులు) అద్దెరూపంలో వినియోగదారుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు చేసుకుంటున్నారు. రీచ్‌ వద్ద బరువు తూచే యంత్రం కానీ, సీసీ కెమెరాలు కానీ లేవు. పలుకుబడి ఉన్న నాయకులు పోలీస్‌ అధికారులను అడ్డుపెట్టుకుని  ఇసుకను తరలిస్తున్నారు. టిప్పర్‌ కు ఎన్ని టన్నుల ఇసుక పడుతుందో వినియోగదారులకు అర్థం కావడంలేదు. ఒక కిలోమీటరుకు ఎంత అద్దె విధిస్తున్నారో తెలియడంలేదు. అజ్జయ్యదొడ్డి రీచ్‌ నుంచి కళ్యాణదుర్గంకు 20 కిలోమీటర్లు ఉంది. రీచ్‌ నుంచి పట్టణానికి ఇసుక చేరాలంటే టిప్పర్‌కు రూ.20 వేలు చెల్లించాల్సిందే. ఇసుక తరలింపు ప్రక్రియ ప్రజాప్రతినిధుల కనుసన్నుల్లోనే సాగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. అధి కార పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణాతో భారీగా సంపాదిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులకు ఇసుక దొరక్కపోవడంతో భవన నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో కా ర్మికులు, భవన నిర్మాణ యజమానులు లబోదిబోమంటున్నారు. 


అక్రమ ఇసుక రవాణాను నియంత్రించేదెవరు ?

 ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణ సాగుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇసుక కావాల్సిన బడాబాబులు ప్రైవేటు కంపెనీ యజమానులతో కుమ్మక్కు అ యి ఆఫ్‌లైన్‌లో వే బిల్లులు తీసుకుని టిప్పర్ల ద్వారా కర్ణాటక రాష్ర్టానికి తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇసుక కావాలంటే ఎవరిని సంప్రదించాలో దిక్కుతోచని స్థితి నెలకొంది. రీచ్‌ వద్ద తమిళనాడుకు చెందిన వారు ఉండటం, ఇసుక కోసం టిప్పర్లు క్యూలో ఉండటంతో రీచ్‌వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక కోసం సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. వినియోగదారులకు ఇసుక కావాలంటే దళారులను ఆశ్రయించక తప్పడం లేదు.  

నగదు తీసుకుని ఇసుక వేబిల్లు ఇస్తున్న కంపెనీ సిబ్బంది


జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ కంపెనీ బిల్లు ఓచర్‌


అజ్జయ్యదొడ్డి రీచ్‌లో ఇసుక తవ్వకాలు చేపడుతున్న దృశ్యం