డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీల జారీకి బ్రేక్‌

ABN , First Publish Date - 2021-04-16T06:39:03+05:30 IST

అనంత ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీల జారీకి బ్రేక్‌ పడింది. మూడు నెలలుగా కార్డులు లేకపోవటంతో ప్రిటింగ్‌ ఆపేశారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీల జారీకి బ్రేక్‌
అనంత ఆర్టీఓ కార్యాలయం (ఫైల్‌ )

మూడు నెలలుగా ఆపేసిన వైనం 

వందలాది మంది వాహనదారుల ఎదురుచూపులు

పోలీసుల తనిఖీల సమయంలో ఇబ్బందులు

అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్‌ 15:  అనంత ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీల జారీకి బ్రేక్‌ పడింది. మూడు నెలలుగా కార్డులు లేకపోవటంతో ప్రిటింగ్‌ ఆపేశారు. ఈ పరిస్థితుల్లో కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీతోపాటు రెన్యూవల్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వందలాది మంది వాహనదారులకు నిరీక్షణ తప్పట్లేదు. తరచూ అనంత ఆర్టీఓ కార్యాలయం వద్దకు వెళ్లి, అధికారులు, సిబ్బందిని అడిగినా సరైన సమాధానం లభించట్లేదు. వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ తప్పనిసరి. అలాంటి ముఖ్యమైన కార్డుల జారీపై అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలకు తావిస్తోంది. కార్డులు లేవన్న సాకుతో చేతులు దులుపుకుంటున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, కార్డులు తెప్పించి, ప్రింట్‌ చేయడంపై దృష్టిపెట్టడం లేదు. గతంలో ప్రింట్‌ తీసిన కార్డులను వాహనదారుల అడ్ర్‌సకు పంపటంపైనా ఆ విభాగ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిసింది. ఏజెంట్లు రెఫర్‌ చేసిన వాహనదారుల కార్డులను నేరుగా వారికే అప్పగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మిగిలిన వారికి కార్డులు పంపడంలో జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. తద్వారా పోలీసులతోపాటు ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేసే సమయంలో వాహనదారులు కార్డులు చూపించలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఆర్టీఓ కార్యాలయం నుంచే కార్డులు రాలేదని చెప్పినా.. పోలీసులు వినిపించుకోవడం లేదు. ఏదో రకంగా జరిమానా విధిస్తుండటంతో వాహనదారులు నష్టపోతున్నారు.


డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డు ఎప్పుడిస్తారో.. ఏమో..?:

ద్విచక్రవాహనం డ్రైవింగ్‌లైసెన్స్‌ ఎప్పుడిస్తారో ఏమో అర్థం కావడం లేదు. మూడు నెలల క్రితం అనంత ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరై, పాస్‌ అయ్యా. త్వరలోనే కార్డు ఇంటికి వస్తుందని అధికారులు చెప్పారు. ఇంకేం ఇబ్బంది లేదని సంతోష పడ్డా. నెల రోజుల తర్వాత కార్యాలయం వద్దకు పలుసార్లు వెళ్లి, అడిగినా కార్డులు స్టాక్‌ లేవని చెబుతున్నారు. ఎప్పటిలోగా కార్డు వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

- వెంకటనాయుడు, వాహనదారుడు, బత్తలపల్లి 

సమస్యను పరిష్కరిస్తాం

పెండింగ్‌లోని వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌

అనంత ఆర్టీఓ కార్యాలయంలో కార్డుల సమస్య ఉన్నట్లు నా దృష్టికొచ్చింది. ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లి, కార్డులు తెప్పించేలా చూస్తాం. వీలైనంత త్వరలో పెండింగ్‌లోని వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీలు ఇంటి చిరునామాలకు పోస్టు ద్వారా పంపేలా చర్యలు తీసుకుంటాం.

- శివరాంప్రసాద్‌, డీటీసీ

Updated Date - 2021-04-16T06:39:03+05:30 IST