ప్రభుత్వ విప్‌ అనుచరుల వీరంగం

ABN , First Publish Date - 2021-01-21T06:56:33+05:30 IST

ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులు క్రషర్‌ కబ్జాకు యత్నించి, విధ్వంసం సృష్టించారు.

ప్రభుత్వ విప్‌ అనుచరుల వీరంగం
గాయపడిన క్రషర్‌ కార్మికులు

క్రషర్‌ కబ్జాకు యత్నం 

ఇనుపరాడ్లు, కర్రలతో కార్మికులపై దాడులు

నలుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

క్రషర్‌తోపాటు వాహనాలు ధ్వంసం

ఎస్పీకి విన్నవించిన క్రషర్‌ యజమానురాలు

కాపు తనయుడిపై ఫిర్యాదు

రాయదుర్గం రూరల్‌, జనవరి 20: ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులు క్రషర్‌ కబ్జాకు యత్నించి, విధ్వంసం సృష్టించారు. రాయదుర్గం మండలంలోని చదం గ్రామ సమీపాన ఉన్న క్రషర్‌లో బుధవారం వారి విధ్వంసంలో నలుగురు కార్మికులు గాయపడగా.. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్రషర్‌తోపాటు అక్కడుండే వాహనాలను ధ్వంసం చేశారు. విప్‌ కాపు తనయుడు ప్రవీణ్‌ రెడ్డి కనుసన్నల్లోనే విధ్వంసం సాగిందని క్రషర్‌ యజమానురాలు లక్ష్మీదేవి జిల్లా ఎస్పీ సత్యయేసుబాబును కలిసి, ఫిర్యాదు చేశారు. చదం గ్రామ సమీపంలో లక్ష్మీదేవికి సంబంధించిన గణేష్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెల్ల కంకర క్రషింగ్‌ యూనిట్‌ నడుస్తోంది. కొద్ది కాలంగా క్రషర్‌ను తమకు వదిలిపెట్టాలని తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు బాధితురాలు పేర్కొంటున్నారు. కాపు అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న రాత్రి తీవ్రస్థాయిలో దాడికి యత్నించారు. అప్రమత్తమైన యజమానురాలు లక్ష్మీదేవి క్రషర్‌ వద్దకెళ్లగా.. ఆమె వాహన అద్దాలను పగులగొట్టి, బెదిరింపులకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. బుధవారం ఉదయం ఒక్కసారిగా ద్విచక్రవాహనాల్లో 30 మందిదాకా కర్రలు, ఇనుపరాడ్లతో క్రషర్‌లోకి చొరబడి, బీభత్సం సృష్టించారు. అక్కడున్న టిప్పర్లు, వాహనాల అద్దాలను పగులగొట్టి, విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించారు. ఆఫీసులోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అక్కడ పనిచేసే కార్మికులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఎక్స్‌కవేటర్‌ ఆపరేటర్‌ తిమ్మేష్‌ (35), ఫిరోజ్‌ (30)పై కర్రలు, రాడ్లతో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డారు. రాళ్లు రువ్వుతూ దాడులకు తెగబడటంతో కార్మికులు పరుగులు తీశారు. అయినా.. కార్మికులు సద్దాం, ఇస్మాయిల్‌ను వెంటా డి, దాడి చేశారు. విషయం తెలుసుకున్న సీఐలు ఈరణ్ణ, రాజా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను పోలీసు వాహనాల్లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ రమ్య పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవీణ్‌రెడ్డి కనుసన్నల్లోనే తమపై దాడులు జరిగాయని క్రషర్‌ యజమానురాలు లక్ష్మీదేవి స్పష్టం చేశారు. ఆమె బుధవారం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబును కలిసి, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తనయుడు ప్రవీణ్‌రెడ్డితోపాటు తిమ్మన్నగౌడ్‌, శివరాజు పదేపదే ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. 16వ తేదీన విజయ్‌కుమార్‌ రెడ్డి, వెంకటేష్‌ క్వారీలోకి వచ్చి, రాళ్లతో దాడి చేశారన్నారు. క్వారీని వదిలి వెళ్లిపోవాలనీ, లేకుంటే పెట్రోల్‌ పోసి, చంపుతామని బెదిరించారన్నారు. 19వ తేదీన విజయ్‌కుమార్‌ ఎక్స్‌కవేటర్‌తో వచ్చి, క్వారీలోని రోడ్డు, స్థలాన్ని తవ్వించే ప్రయత్నం చేశాడన్నారు. మంగళవారం రాత్రి 10 గంటలకు తిమ్మన్నగౌడ్‌, మరికొందరు వచ్చి తన కారు అద్దాలను ధ్వంసం చేశారనీ, దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. నిబంధనలకు అనుగుణంగా కంకర క్వారీ నిర్వహిస్తున్న తమను దౌర్జన్యంగా బెదిరిస్తూ క్రషర్‌పై దాడికి పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.






పోలీసుల నిర్లక్ష్యమే దాడులకు కారణం? 

దాడికి పోలీసుల నిర్లక్ష్యం కూడా కారణమని తెలుస్తోంది. మంగళవారం రాత్రి జరిగిన దాడితో అప్రమత్తమై, పికెట్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. నిర్లక్ష్య ధోరణి అవలంబించటంతో బుధవారం మళ్లీ దాడికి తెగబడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఇలాంటి దాడుల కారణంగా పోలీసు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లి, పారిశ్రామికవర్గాల్లో అభద్రతాభావం నెలకొంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-01-21T06:56:33+05:30 IST