రేషన్‌ బండి.. పొలానికి చేరెనండి..!

ABN , First Publish Date - 2021-02-27T06:40:51+05:30 IST

ఇక ఎవరూ రేషన్‌ సరుకుల కోసం చౌకధాన్యపు డిపోల వద్దకెళ్లాల్సిన అవసరం లేదనీ, ఇంటింటికీ పంపిణీ చేస్తామని పాలకులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు.

రేషన్‌ బండి..  పొలానికి చేరెనండి..!
జెల్లిపల్లి సమీపంలో పొలాలకు వెళ్లే దారిలో రేషన్‌ వాహనాన్ని నిలబెట్టి లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకుంటున్న దృశ్యం

కంబదూరు, ఫిబ్రవరి 26: ఇక ఎవరూ రేషన్‌ సరుకుల కోసం చౌకధాన్యపు డిపోల వద్దకెళ్లాల్సిన అవసరం లేదనీ, ఇంటింటికీ పంపిణీ చేస్తామని పాలకులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. ఆ మేరకు రూ.కోట్లు పోసి, వాహనాలు కొన్నారు. వాటికి డ్రైవర్లను కూడా నియమించారు. ఇక ఇంటి గుమ్మం వద్దకే సరుకులు వస్తాయని లబ్ధిదారులు ఆశపడ్డారు. ఇంటి తలుపు వద్దకు రావటం సంగతి దేవుడెరుగు.. ఏకంగా పొలాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. సిగ్నల్‌ సమస్యతో సరుకుల పంపిణీ వాహనాన్ని ఊరి బయట పొలాలకు తీసుకెళ్లి, అక్కడ లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుంటున్నారు. మండలంలోని జెల్లిపల్లిలో ఈ దుస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా నెట్‌వర్క్‌ సమస్యతో రేషన్‌ బియ్యాన్ని సక్రమంగా పొందలేక గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా శుక్రవారం ఇంటింటికీ వెళ్లే రేషన్‌ బియ్యం మినీ వాహనాన్ని గ్రామానికి కిలోమీటరు దూరంలోని పొలాల వద్ద సిగ్నల్‌ దొరకటంతో అక్కడే లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకున్నారు. అనంతరం అదే వాహనంలో ఇంటింటికీ వెళ్లి, సరుకులను అందజేస్తున్నారు. గ్రామంలో సుమారు 200 రేషన్‌ కార్డులున్నాయి. ప్రతినెలా ఈ సమస్య తలెత్తుతోంది. నెట్‌వర్క్‌ సమస్యను తీర్చాలని గతంలో అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, గ్రామంలో సిగ్నల్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-02-27T06:40:51+05:30 IST