నిబంధనలకు పాతర...

ABN , First Publish Date - 2020-10-31T09:34:38+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిబంధనలకు నీళ్లు వదిలి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లేఔట్లు వేస్తూ జోబులు నింపుకుంటున్నారు.

నిబంధనలకు పాతర...

పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు

ప్రభుత్వ ఆదాయానికి గండి

పట్టించుకోని అధికారులు


గార్లదిన్నె, అక్టోబరు 30: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిబంధనలకు నీళ్లు వదిలి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లేఔట్లు వేస్తూ జోబులు నింపుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మండలంలో అక్రమ లేఅవుట్లలో రియల్‌ ఎస్టేట్‌ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మండల కేంద్రమైన గార్లదిన్నె పట్టణంతోపాటు మండలంలోని కల్లూరు గ్రామాల్లో రియల్‌ వ్యాపారులు అనుమతులు తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు నాళాలు చెల్లించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. అనుమతులు తీసుకున్న తరువాత రోడ్లు, గుడి, బడి, సామాజిక అవసరాలకు తగినంత భూమిని కేటాయించి పంచాయతీకి రిజిస్ట్రేషన్‌ చేయించాలి. ఆ తర్వాత లే అవుట్‌కు అప్రూవల్‌ కోసం ధరఖాస్తు చేసుకోవాలి.


అయితే కల్లూరు గ్రామంలో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎలాంటి అనుమతులు పొందకుండా, పంచాయితీ అప్రూవల్‌ తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వెంచర్లు వేస్తు జోబులు నింపుకుంటున్నారు. దీంతో కల్లూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. ముఖ్యంగా జీరో 8 భూములను సైతం వదలకుండా వ్యాపారస్థులు ప్లాట్లు వేసి విక్రయిస్తున్న్జాకరి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్లూరు మేజర్‌ పంచాయితీ కావడంతో పాటు అక్కడ అధికంగా పరిశ్రమలు ఉండడంతో ప్రభుత్వం కల్లూరు పంచాయతీని అహుడ కింద ఎంపిక చేసింది. అయినప్పటికీరియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వ్యాపారం సాగిస్తున్నారు. అధికారులెవరైనా ప్రశ్నిస్తే మా ప్రభుత్వం అంటు అధికారులతో వాగ్వివాదానికి దిగిన సంఘటనలు లేకపోలేదు. రియల్‌ వ్యాపారులు ఇలా అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తు సెంటు స్థలం రూ.లక్షల్లో పలుకుతోంది. దీంతో మండల కేంద్రంలోని లేని విధంగా ఎకరా భూమి రూ.కోట్లల్లో పలుకుతోంది. ఇటీవల కల్లూరులో ఎకరా భూమి రూ.1.52 కోట్లకు కొనుగోలు చేస్లి విక్రయించినట్లు సమాచారం. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి కళ్ళెం వేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు..  వెంకటలక్ష్మి, ఈఓఆర్డీ.

మండలంలోని ఎక్కడ అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు ఇవ్వకుండా ఎక్కడ లే ఆవుట్లు వేసినట్లు తమ దృష్టికి రాలేదు. ఇటీవల కల్లూరులో ఒకరు అక్రమంగా లే ఆవుట్‌ వేయడంతో వారికి నోటిసులు జారీ చేశాం. అనుమతులు లేకుండా లే ఆవుట్లు వేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అప్రూవల్‌ లేని లేఔట్లలో ఎవరు ప్లాట్లు కొనుగోలు చేయకూడదు. 

               

Updated Date - 2020-10-31T09:34:38+05:30 IST