Abn logo
Aug 12 2020 @ 02:30AM

ఎందుకిలా..?

 జిల్లాలో ఆగని మృత్యు ఘోష 

 పిట్టల్లా రాలిపోతున్న జనం

 జిల్లాలో కరోనా వైరస్‌ విస్ఫోటనం

 ఒక్కరోజే 13 మంది మరణించటంతో ఆందోళన

 లెక్క తప్పినా.. 200కి చేరువలో మృతుల సంఖ్య

సకాలంలో వైద్యం అందని దుస్థితి

భరోసా నింపడంలోనూ అధికార యంత్రాంగం విఫలం

బాధితుల గోడు పట్టని వైనం


అనంతపురం, ఆగస్టు11(ఆంద్రజ్యోతి): జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. మహమ్మారి దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. వైద్యమందకో.. భరోసా లేకో.. కారణమేదైనా.. ప్రజల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. బాధితుల కుటుంబాలను కరోనా మరణాలు కలవరపెడుతున్నాయి. మరణాలంటూ లేనిరోజు లేకపోవటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. గత నాలుగు నెలలు ఒక ఎత్తయితే.. ఆగస్టు ఆరంభం నుంచి పరిస్థితి మరింత అదుపు తప్పుతోంది.


జిల్లాలో ఇప్పటి వరకూ 25697 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన జిల్లాలో కరోనా మొట్టమొదటి కేసు ప్రారంభం నాటి నుంచి గత నెలాఖరు (జూలై 31) వరకూ 14699 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్యలో ఇది 57.27 శాతం. ఈ నెల ఆరంభం నుంచి మంగళవారం వరకు 11 రోజుల్లో 10998 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో ఇవి 42.80 శాతం. దీనిని బట్టి చూస్తే కరోనా వైరస్‌ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో అర్థమవుతోంది. మరణాల విషయంలోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల మేరకు.. మంగళవారం వరకూ 188 మంది మరణించారు. గడిచిన నాలుగు నెలల్లో 114 మంది కరోనాతో చనిపోగా.. ఈ నెలలోనే ఇప్పటి వరకూ 74 మంది మృత్యువాత పడ్డారు.


మరణాల సంఖ్య కరోనా బాధితులతోపాటు వారి కుటుంబాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మరణాల సంఖ్యను వెల్లడించటంలో రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లా యంత్రాంగం తప్పటడుగులు వేస్తున్నాయి. ఒక్కో బులెటిన్‌లో ఒక్కో సంఖ్యను చూపుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 188 మందే చనిపోయినట్లు లెక్కలు చూపుతుండగా.. జిల్లా యంత్రాంగం లెక్కల్లో మాత్రం ఇప్పటికే 217కి చేరుకోవటం గమనార్హం. మరణాల సంఖ్యలో లెక్క తప్పినా.. జిల్లాలో 200కి చేరువలో ఆ సంఖ్య ఉండటం శోచనీయం.


వైద్యమందకా? భరోసా లేకా?

జిల్లాలో కరోనా బాధితులకు అన్ని రకాల సౌకర్యాలందిస్తున్నామనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యంత్రాంగం పదేపదే ప్రకటిస్తోంది. కొవిడ్‌ సెంటర్లలోని బాధితుల్లో భరోసా నింపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అయినా.. జిల్లాలో రోజురోజుకీ మరణాల సంఖ్య పెరుగుతుండటం దేనికి సంకేతమన్నది అంతుచిక్కట్లేదు.


గడిచిన 11 రోజుల్లో 74 మంది వైద్యం అందక చనిపోయారా? సరైన భరోసా లేకా.. అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మృతుల్లో 23 ఏళ్ల నుంచి 60 ఏళ్లు పైబడిన వారున్నారు. ఈ లెక్కన అన్ని వయసుల వారూ వైరస్‌కు బలవుతున్నారని తేటతెల్లమవుతోంది. సరైన వైద్యం అందకే చనిపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు. విషమ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అందక ప్రాణాలొదులుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో వైద్యులు స్పందించటంలో జాప్యం చేస్తున్నారన్న అభిప్రాయం బాధిత వర్గాల నుంచి వినిపిస్తోంది. మందులు సక్రమంగా ఇవ్వట్లేదన్న అభిప్రాయమూ లేకపోలేదు. కొన్ని కొవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితుల చెంతకు వెళ్లని పరిస్థితులున్నాయని ఆ కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి. కరోనాతో భయపడుతున్న బాధితులకు భరోసా కరువవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మైకుల ద్వారానైనా భరోసా నింపే ప్రయత్నాలు ఏ కొవిడ్‌ ఆస్పత్రిలోనూ చేయట్లేదు. దీనిని బట్టి చూస్తే.. కరోనా బాధితుల మరణాలకు ఎన్నో కారణాలని స్పష్టమవుతోంది. మరణాల కట్టడికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో విషమంగా ఉన్న, భయపడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటే తప్పా.. కరోనా మరణాల కట్టడి సాధ్యం కాదన్నది నిర్వివాదాంశం.


ఎవరికీ పట్టని స్వీయనియంత్రణ

జిల్లాలో రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 13 మంది కరోనాతో చనిపోయారు. దీనిని బట్టి చూస్తే కరోనా ఏ స్థాయిలో భయపెడుతోందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా కనబడుతోంది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నా, బాధితులు చనిపోతున్నా ఎవరిలోనూ ఆ మృత్యుభయం కనిపించకపోవటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కాపాడుకోవాలన్న బాధ్యతను గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా... ప్రజల్లో మార్పు వస్తే తప్పా.. కరోనా నుంచి బయట పడలేమనటంలో సందేహం లేదు. ఆగస్టు నెలలో కరోనా విపరీతంగా వ్యాపిస్తోంది. రోజుకు సగటున 900 నుంచి 1000 మంది వైరస్‌ బారిన పడుతుండటం కరోనా నిబంధనలను విస్మరిస్తున్నారనటానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించటం తప్పా.. మరో మార్గం లేదన్నది నిర్వివాదాంశం.

Advertisement
Advertisement
Advertisement