మరణాలు... మాయలు

ABN , First Publish Date - 2020-08-06T09:34:06+05:30 IST

మరణాలు... మాయలు

మరణాలు... మాయలు

కరోనా మృతుల ప్రకటనలో మతలబు

రాష్ట్ర బులెటిన్‌లో ఇద్దరు... జిల్లా బులెటిన్‌లో 10 మంది చనిపోయినట్లు ధ్రువీకరణ

మొత్తం 140 మంది మృత్యువాత

ఆగని వైరస్‌ ఉధృతి

20 వేలు దాటిన కేసులు

తాజాగా  1260 మందికి పాజిటివ్‌ 


అనంతపురం వైద్యం, అగస్టు 5: జిల్లాలో కరోనా కేసులు, మరణాల ప్రకటనలో మాయ లు, కనికట్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో నమోదవుతున్న కే సులకు, రాష్ట్ర స్థాయిలో వెల్లడిస్తున్న లెక్కలకు తేడా ఉంటోంది. ఆది నుంచీ జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. తాజాగా బుధవారం వెల్లడైన బులెటిన్లలో మరోసారి ఇది నిరూపితమైంది. రాష్ట్ర బులెటిన్‌లో 24 గంటల్లో జిల్లాలో ఇద్దరు కరోనా బాధితులు మరణించినట్లు చూయించారు. జిల్లా అధికారులు వెల్లడించిన బులెటిన్‌లో మా త్రం 10 మంది చనిపోయారని ప్రకటించారు. రాష్ట్ర బులెటిన్‌లో మరణాల సంఖ్య 132గా చూపించగా.. జిల్లా సమాచారంలో 140 అని ప్రకటిస్తున్నారు. ఇందులో మతలబు ఏంటో అఽర్థం కావట్లేదు. జిల్లా అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వానికి మరణాలు తగ్గించి, చూపుతున్నారా... లేదంటే వాటిని లెక్కించటంలో అధికారుల మధ్య సమన్వయం లోపించిందా అన్నది అర్థం కావడంలేదు. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడంలేదు. కొత్తగా బుధవారం 24 గంటల్లో 1260 మంది కరోనా బారిన పడ్డారు. ఈ లెక్కన జిల్లాలొ కరోనా కేసుల సంఖ్య 20061కి చేరిపోయింది. వీరిలో 12667 మంది కోలుకోగా.. 7262 మంది కరోనాతో పోరాడుతున్నారు.


అనంతపురం నగరం కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిపోయింది. ప్రస్తుతం నమోదయిన 20 వేల కేసుల్లో అనంతపురం నగరంలోనే 10 వేలకుపైగా ఉన్నాయంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా అనంత నగరంలోనే అత్యధికంగా 239 కేసులు వచ్చాయి. గుంతకల్లులో 204, తాడిపత్రిలో 149, ధర్మవరంలో 140, పుట్టపర్తిలో 51, రాయదుర్గంలో 42, పెద్దవడుగూరులో 40, హిందూపురంలో 39, గుత్తిలో 32, యాడికిలో 30, ఉరవకొండలో 27, కళ్యాణదుర్గంలో 24, పెనుకొండలో 20, పామిడిలో 17, ఎల్లనూరులో 16, కొత్తచెరువులో 14, ముదిగుబ్బ, పుట్లూరులో 13, బుక్కరాయసముద్రం, కదిరి, నార్పలలో 10 కేసుల చొప్పున బయటపడ్డాయి. ఇతర మండలాల్లో 10కిలోపు నమోదయ్యాయి. కాగా.. జిల్లాలో కరోనా నుంచి పెద్ద సంఖ్యలో కోలుకున్నారు. బుధవారం 1596 మందిని కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ చేశారు.


కరోనా భయంతో వృద్ధురాలి ఆత్మహత్య

వజ్రకరూరు: ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కమలపాడులో బుధవారం చోటుచేసుకుంది. గత నెల 31న గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించగా 70 సంవత్సరాల వృద్ధురాలికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంకొక ఇంటిలో హోం క్వారంటైన్‌లో ఉంచారు. పలకరించడానికి కూడా ఎవరూ రాకపోవడంతో మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు ఉదయం ఇంటి పైకప్పుకున్న దూలానికి చీరతో ఉరి వేసుకుంది. గమనించిన స్థానికులు వృద్ధురాలి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Updated Date - 2020-08-06T09:34:06+05:30 IST