ఆడిందే ఆట!

ABN , First Publish Date - 2020-12-02T06:46:12+05:30 IST

వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఆడిందే ఆట అనటానికి ఇది పరాకాష్ట. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఆడిట్‌ తనిఖీలు అంటూ హడావుడి చేశారు.

ఆడిందే ఆట!

నోటీసులివ్వకుండానే తనిఖీలు

లక్షలు డిమాండ్‌?

నిలదీస్తే యాంటీడేట్‌తో బలవంతంగా నోటీసులు

పన్నుల శాఖలో ఓ ఏసీటీఓ, ఉద్యోగి నిర్వాకం

ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవటంలో ఆంతర్యమేంటో?

మెయిల్‌లో డీలర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఏమైంది..?

అనంతపురం కార్పొరేషన్‌, డిసెంబరు1: వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఆడిందే ఆట అనటానికి ఇది పరాకాష్ట. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఆడిట్‌ తనిఖీలు అంటూ హడావుడి చేశారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలినా.. లక్షలు డిమాండ్‌ చేశారు. డీలర్‌ ప్రశ్నించటంతో తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ అడ్డదారులు తొక్కారు. ఏకంగా ముందస్తు తేదీతో బలవంతంగా నోటీసులిచ్చారు. బాధితుడు చేసిన ఫిర్యాదును కూడా మెయిల్‌లో లేకుండా మాయం చేశారు. వారు ఆడిందే ఆటగా తయారైందనటానికి ఇది నిదర్శనం.జీఎస్టీ చెల్లించే డీలర్లతో కొందరు పన్నుల శాఖాధికారులు ఆడుకుంటున్నారు. ఇష్టారాజ్యం గా నోటీసులు పంపుతూ వారిలో  ఆందోళన రేపుతున్నారు. చెప్పినట్లు వినకపోతే ఇబ్బందులూ సృష్టిస్తున్నారు. నోటీసుల ముసుగులో లక్షలాది రూపాయలు డిమాండ్‌ చేస్తున్నా రు. జీఎస్టీ చెల్లిస్తున్న వ్యాపారులు, డీలర్లకు పన్నుల శాఖాధికారుల పుణ్యమా అని కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. నోటీసులు పంపకుండానే అధికారులు కొందరు వ్యాపార నిర్వహణకు సంబంధించి లెక్కలు తే ల్చడానికి నిర్వహించే ఆడిట్‌ తనిఖీలు చేస్తున్నారు. త మకు నోటీసులు రాలేదని మొత్తుకున్నా ముందే పంపామంటూ దబాయిస్తున్నారు. నిలదీసిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంతం ఆ శాఖలో కలకలం రేపుతోంది. గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్న ఓ డీలర్‌పై ఇదే వ్యవహారం నడిపారు. జిల్లా కేంద్రంలోని సీటీఓ సర్కిల్‌-2లో పనిచేస్తున్న ఓ ఏసీటీఓ, ఓ ఉద్యోగి తమదైన శైలిలో దూకుడు ప్రదర్శించి, నోటీసులు పంపకుండానే వ్యాపారం చేస్తున్న ప్రాంతంలో ఆడిట్‌ చేశారు. తనిఖీలో తప్పుడు లెక్కలు బయటపడకపోయినా.. లకారాల్లో డిమాండ్‌ చేసినట్లు సమాచారం. తమకు నోటీసులు అందలేదని ఆ వ్యాపారి చెప్పుకొచ్చినా వినలేదు. ఆ తరువాత కార్యాలయానికి వ్యాపార సంస్థ ప్రతినిధిని పిలిపించి, ఫొటో తీసుకుని యాంటీ డేట్‌ (ముందుగానే నోటీస్‌ సర్వ్‌ చేసినట్లు)తో నోటీసులు అందజేశారు. ఆ అధికారులే ఇలాంటి వ్యవహారాలు కొన్ని నడిపినట్లు తెలిసింది. చిన్నచిన్న దుకాణాలకు కూడా జీఎస్టీ బోర్డు లేదంటూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.


తప్పు చేసి.. యాంటీడేట్‌తో నోటీసులు

నగర శివారులోని బళ్లారి బైపా్‌సలో ఆనంద్‌ గ్రానైట్స్‌ పేరుతో ఓ వ్యక్తి వ్యాపారం నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితం పన్నుల శాఖ రెండో సర్కిల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఏసీటీఓ, మరో ఉద్యోగి కలిసి ఆడిట్‌ నిర్వహించారు. నిబంధనల మేరకు ఆడిట్‌ చేసే ముందు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా నేరుగా ఆడిట్‌ చేశారు. ఆ సమయంలో వ్యాపార లావాదేవీల్లో ఆ అధికారులకు తప్పుడు లెక్కలు కనిపించనట్లు తెలిసింది. ఆ డీలర్‌ నుంచి లక్షల్లో డిమాండ్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో విస్తుపోయిన ఆ డీలర్‌ తానేమీ ఇవ్వలేననీ, అయినా తనకు నోటీసులు పంపకుండా ఎలా ఆడిట్‌ చేస్తారని నిలదీశారు. పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానని కాస్త గట్టిగానే చెప్పారు. దీంతో కంగారుపడిన పన్నుల శాఖ అధికారులు వెనక్కు వచ్చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఆడిట్‌ చేసిన విషయం తెలిస్తే.. తమకు ఇబ్బంది కలుగుతుందని మరో ఎత్తుగడ వేశారు. వాస్తవానికి గతేడాది సెప్టెంబరు 26న అప్పటి జాయింట్‌ కమిషనర్‌ జీఎస్టీ ఐఎన్‌ఎ్‌స-1 నోటీస్‌ జారీ చేశారు. ఆ నోటీస్‌ ఆధారంగా అదే ఏడాది అక్టోబరు 10వతేదీలోపు సమన్లు పంపాలి. ఆ ఏడాది జూలై 11వ తేదీనే సమన్లు పంపినట్లు ఆ మేరకు ఆ సంస్థకు నోటీసు ఇచ్చేలా ప్రయత్నించారు. అందులో భాగంగా ఆ గ్రానైట్స్‌ సంస్థ డీలర్‌ కింద పనిచేసే గుమస్తాను తమ కార్యాలయానికి రప్పించారు. బలవంతంగా అతడి ఫొటో తీసుకుని, నోటీసులు ముందుగానే పంపినట్లు గతంలో తేదీ (యాంటీ డేట్‌తో) వాటిని తీసుకున్నట్లుగా సంతకం కూడా చేయించుకున్నట్లు తెలిసింది. అది చూసిన గ్రానైట్స్‌ సంస్థ యజమాని బిత్తరపోయాడు. అలా ఎలా ఇస్తారని.. ఎలా తీసుకున్నావని గుమాస్తాను అడిగాడు. తన నిమిత్తం లేకుండా చేశారని ఆ గుమస్తా వాపోయాడు. ఇందులో పాత తేదీతో ఇచ్చిన నోటీసు కాపీలో ఆ సర్కిల్‌ సీటీఓ సంతకం కూడా ఉందట. వాస్తవానికి ఆ రోజున (11.07.2019) ఆయన లేరు. అలా ఎలా చేస్తారని మార్చి పంపాలని ఆయన కోరినా.. దాన్ని వారు మార్చనట్లు తెలిసింది. ఈ విషయంపై ఈ ఏడాది అక్టోబరు 28న డీలర్‌ తమకు ఎలాంటి నోటీసు అందలేదనీ, తమ చిరునామా పలానా అంటూ లేఖ ద్వారా తెలియజేశారు. దానికి సమాధానం లేదు.


ఆంతర్యం ఏంటో..?

తనకు యాంటీ డేట్‌తో నోటీసులు పంపడంపై డీలర్‌ ఆందోళన చెందాడు. నిబంధనలకు విరుద్ధంగా సంబంధిత ఏసీటీఓ ఇలా నోటీసులు పంపటంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా తమను యాంటీడేట్‌తో మోసం చేసిన ఏసీటీఓపై చర్యలు తీసుకోవాలని విన్నవించాడు. ఆ డీలర్‌ ఈ ఫిర్యాదును గత నెల 11వ తేదీన మెయిల్‌ ద్వారా ఆ శాఖ జిల్లా ఇన్‌చార్జ్‌ జాయింట్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌కు కూడా పంపాడు. 20 రోజులైనా చర్యలు తీసుకోలేదు. ఇందులో ఆంతర్యం ఏంటనేది అంతుబట్టడం లేదు. వాస్తవానికి డీలర్‌ పంపిన మెయిల్‌.. ఓపెన్‌ మెయిల్‌లో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు అందరూ చూసే వీలుంది. పై అధికారులకు అవసరమైన మెయిల్స్‌ వారి కింద పనిచేసే ఉద్యోగులు పంపాలి. మరి ఆ ఉన్నతాధికారులు మెయిల్‌ చూడలేదా..? చూసినా చర్యలు తీసుకోకుండా సంబంధిత ఏసీటీఓ, మరో ఉద్యోగి మానేజీ చేశారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Updated Date - 2020-12-02T06:46:12+05:30 IST