విజృంభిస్తోన్న కరోనా

ABN , First Publish Date - 2021-04-21T06:26:25+05:30 IST

కరోనా వైరస్‌ రెం డో దశ వ్యాప్తి ఉధృతి జిల్లా ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి.

విజృంభిస్తోన్న కరోనా

 24 గంటల్లో 275 మందికి పాజిటివ్‌

ఇంకా 3 వేల శాంపుల్స్‌ పెండింగ్‌

రోజులు గడిచినా ఫలితాల కోసం ఎదురుచూపులే..

ఆందోళనలో బాధితులు

కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో అందుబాటులో లేని అంబులెన్సలు

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 20: కరోనా వైరస్‌ రెం డో దశ వ్యాప్తి ఉధృతి జిల్లా ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 3093 మందికి పరీక్షలు నిర్వహించగా 275 మంది కరోనా బారినపడ్డారు. మరో ముగ్గురు బాధితులు వై రస్‌కు బలయ్యారు. మంగళవారం 115 మంది డిశ్చార్జ్‌ కాగా, 275 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హిందూపురంలో 67, అనంతపురంలో 49, గుంతకల్లులో 31, పరిగిలో 15 కేసులు నమోదయ్యాయి.


రెట్టింపు స్థాయిలో బాధితుల సంఖ్య

జిల్లాలో అధికార యంత్రాంగం కరోనా కట్టడికి నిరంతరం ప్రణాళికలు రచిస్తున్నా.. వైరస్‌ విజృంభణకు అడ్డుకట్ట పడటంలేదు. నివారణ చర్యల అమలులో విఫలమవుతున్నారు. దీంతో బాఽఽధితుల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరిగిపోతోంది. ల్యాబ్‌ నిర్వహణ, శాంపుల్‌ సేకరణ, వివరాల నమోదు, బెడ్ల ఏర్పాటు, బాఽధితుల తరలింపు.. ఇలా కరోనా పరీక్షల నుంచి కొవిడ్‌ చికిత్స అందించే ప్రక్రియ వరకు అడుగడుగునా యంత్రాంగంలో అలసత్వం ఆవరించింది. ఇదిలా ఉండగా.. ప్రజలను చైతన్య పరిచేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదు. గ్రామాల్లో వైరస్‌ బారిన పడకుండా చేట్టాల్సిన నివారణ మార్గాలను అనుసరించడంలేదు. దరిమిలా ప్రజలు వైరస్‌ కోరల్లో చిక్కుకుపోతున్నారు. కరోనా విస్తరణకు సరైన అడ్డుకట్ట వేయకపోతే బాధితులు వందల నుంచి వేల సంఖ్యకు చేరుకునే ప్రమాదం లేకపోలేదు.


పట్టణ ప్రాంతాలకే ఎక్కువ ముప్పు 

జనాభా రద్దీగా వున్న ప్రాంతాల్లో వంద శాతం కరోనా సోకుతుందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నా ప్రజలు జాగ్రత్తలు పాటించడంలో పెడచెవిన పెడుతున్నారు. కూరగాయల మార్కెట్‌ నుంచి కార్యాలయాల వరకు గుంపులుగానే పనిచేసుకుంటూ వెళుతున్నారు. కనీసం మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది.


అంబులెన్సల కోసం ఎదురుచూపులే... 

కరోనా బారినపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆసుప్రతికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అత్యవసర వైద్య సేవలకు అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుప్రతిలో 25, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 49 వెంటిలేటర్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సర్వజన ఆసుప్రతిలోని కొవిడ్‌ ఓపీలో నుంచి బాధితులను సూపర్‌ స్పెషాలిటీ ఆసుప్రతికి తరలించడం కష్టతరంగా మారింది. అక్కడ అంబులెన్సలు అందుబాటులో ఉండడం లేదు. దీంతో బాధితులు వేచిచూస్తూ వేసారి నీరసించిపోతున్నారు. మరోవైపు కేన్సర్‌ ఆసుపత్రి, సూపర్‌ స్పెషాలిటీ కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారికి సీటీ స్కాన వంటి పరీక్షల నిర్వహణకు అక్కడ ఏర్పాట్లు లేవు. దీంతో బాధితులను సర్వజనాస్పత్రికి తీసుకురావాలి. అక్కడ అంబులెన్సలు ఏర్పాటు చేయకపోవడంతో మధ్యలోనే ఆరోగ్యం విషమించిన బాధితులు ప్రాణాలను వదులుకోవాల్సి వస్తోంది.


పెండింగ్‌లో 3 వేల శాంపుళ్లు

సర్వజన ఆసుప్రతిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ ఓపీలో గత నాలుగు రోజుల నుంచి సేకరించిన 3 వేల శాంపుళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. శ్యాంపుల్స్‌ ఇచ్చిన వారి వివరాలను కంప్యూటర్‌లో ఆనలైన నమోదు చేయకపోవడంతో పెండింగ్‌లో చూపుతున్నాయి. దీంతో బాధితులు కరోనా పరీక్ష ఫలితాల మెసేజ్‌ల కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ‘మీ నుంచి కరోనా శాంపుల్స్‌ తీసుకున్నాం.. త్వరలోనే పరీక్ష ఫలితం వస్తుంది’ అంటూ వస్తున్న మెసేజ్‌లు బాధితులను మరింత విస్తుగొల్పుతున్నాయి. దీంతో ఆందోళనతో వేచిచూడాల్సి వస్తోంది. ఈ సమయంలో కరోనా మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదు. ఈనెల 16న శాంపుల్స్‌ ఇచ్చిన వారికి 20వ తేదీ వరకు పరీక్ష ఫలితాల మెసేజ్‌లు వెళ్లలేదంటే వైద్యాధికారుల నిర్వహణ తేటతెల్లమవుతోంది. 

Updated Date - 2021-04-21T06:26:25+05:30 IST