Abn logo
Apr 19 2021 @ 00:54AM

305 మందికి కరోనా

ఉగ్రరూపం

305 మందికి కరోనా

అనంతలోనే 85 పాజిటివ్‌ కేసులు

అమలు కాని కొవిడ్‌ నిబంధనలు

ఫలితాల కోసం అదే నిరీక్షణ

ల్యాబ్‌లలో సిబ్బంది కొరత

పెరుగుతున్న బాధితుల సంఖ్య

అనంతపురం, ఏప్రిల్‌18(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొవిడ్‌ సెకెండ్‌వేవ్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయే తప్పా తగ్గటం లేదు.  ఆదివారం మరో 305 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గతేడాది జూన్‌, జూలైలో ఏ స్థాయిలో అయితే కరోనా కేసులు పెరిగాయో అదే స్థితి ప్రస్తుతం కనిపి స్తోంది.  అనంతపురం నగరంలోనే ప్రతిరోజూ నమోద య్యే పాజిటివ్‌ కేసుల్లో 40 శాతం ఉంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే జిల్లా కేంద్రం కరోనా కౌగిలిలో చిక్కినట్టు  అర్థమవుతోంది. కరోనా నిబంధనలు అమలు కాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ‘నో మాస్క్‌... నో ఎంట్రీ’ బోర్డులు వ్యాపార సముదాయాల ముందు ఉంచినా... దుకాణాల లోపల మాత్రం ఏ ఒక్కరూ మాస్కులు ధరించడం లేదు.  టీ కేఫ్‌లు, రెస్టారెంట్లు, బార్లలోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో హిందూపురం, గుంతకల్లు, పుట్టపర్తి, ఉరవకొండ, ధర్మవరం తదితర పట్టణాల్లోనూ రోజుకు సగటున 15 నుంచి 20 కేసుల దాకా నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు కరోనా సెకెండ్‌వేవ్‌ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంది. పోలీసు, రెవెన్యూ, వైద్యాధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు ఎప్పటి కప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ కరోనాపై అవగాహన కల్పించాల్సి ఉంది. 


45 ప్రాంతాల్లో 305 కేసులు నమోదు...

జిల్లాలో తాజాగా 305 కేసుల్డు నమోదు కాగా... అందులో 85 పాజిటివ్‌ కేసులు అనంతలోనే నిర్ధారణ అయ్యాయి. హిందూపురంలో 24, గుంతకల్లులో 20, పుట్టపర్తిలో 19, ఉరవకొండలో 15, ధర్మవరం, గోరంట్లలో 14 మందికి చొప్పున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ యింది. గార్లదిన్నె, లేపాక్షిలలో 9 మంది, బుక్కరాయ సముద్రం, కదిరి, కంబదూరులో 8 చొప్పున కరోనా కేసులు న మోదయ్యాయి. కొత్తచెరువులో 7, కళ్యాణదుర్గంలో 5, తనకల్లులో 5, అమడగూరులో 4, మడకశిరలో 4, న ల్లచెరువులో 4 కేసులు నమోదుకాగా... సీకేపల్లి, తలుపుల, పరిగి, ఓడీ చెరువు, ముదిగుబ్బ, గుడిబండ, గాండ్లపెంట, డీ. హీరేహాళ్‌లో రెండేసి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అమరాపురం, ఆత్మకూరు, బత్తలపల్లి, బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, బు క్కపట్నం, గుత్తి, నల్లమా డ, పెద్దవడుగూరు, రామగిరి, శెట్టూరు, శింగనమల, సో మందేపల్లి, తాడిమర్రి, తాడిపత్రిలలో ఒక్కో పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయిం ది.  ఇతర జిల్లాలకు సంబంధించి క ర్నూలు 2, చిత్తూరు 1 కేసు నమోదు కాగా... ఇతర రాష్ర్టాలకు సంబంధించి ఐదుగురికి(ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 


ఫలితాల కోసం తప్పని నిరీక్షణ...

జిల్లాలో ప్రతిరోజూ సగటు న 9 వేల మందికి శాంపిళ్లు సేకరిస్తున్నారు. వాటిని పరీక్షల కోసం వైద్యకళాశాలలోని ప్రత్యేక ల్యాబ్‌కు పంపుతున్నారు. అయితే ల్యాబ్‌లో రోజు కు సగటున 3500 నుంచి 4 వేల శాంపిళ్లకు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. ఇలా ప్రతిరోజూ 6 వేల శాంపిళ్లు మిగిలిపోతున్నాయి. దీంతో కరోనా టెస్టింగ్‌కు ఇచ్చిన ప్రజలకు ఫలితం వచ్చే సరికి నాలుగైదు రోజులు సమయం పడుతోంది. ఆ తరువాత వచ్చిన ఫలితాల్లో ఎవరికైనా పాజిటివ్‌ వచ్చినా ఆలోపు కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య తిరిగి ఉండటంతో  వైరస్‌ వ్యాప్తి కారకులవుతు న్నారు. ఫలితాల కోసం నిరీక్షణే జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోం ది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షల సామర్థ్యాన్ని పెంచా ల్సిన అవసరం ఉంది. కరోనా పరీక్షల కోసం జిల్లా కేంద్రం లో ఒకే ఒక ల్యాబ్‌ ఉంది. ల్యాబ్‌లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యం జరుగుతోందని సంబంధీకులు చెబుతున్నారు. ల్యాబ్‌లో 12 మంది టెక్నీషియన్‌లు ఉండాల్సి ఉండగా... ఐదుగురు మాత్రమే ఉన్నారు. శాంపిల్‌ ఇచ్చిన వ్యక్తి డేటాను కంప్యూ టర్‌లో పొందుపరిచేందుకు అవసరమైన సిబ్బంది లేకపో వడమూ ఫలితాల వెల్లడికి ఆలస్యమవుతోందని వినిపిస్తోంది. 12 మంది ఆపరేటర్లు ఉండాల్సి ఉండగా...  ముగ్గురితోనే నెట్టుకొస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తే ఫలితాల కోసం ప్రజలు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. 

Advertisement