రష్యా దాడుల్లో ఏడుగురి మృతి, 9 మందికి గాయాలు : ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-02-24T19:27:48+05:30 IST

రష్యా జరిపిన దాడుల్లో దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని

రష్యా దాడుల్లో ఏడుగురి మృతి, 9 మందికి గాయాలు : ఉక్రెయిన్

కీవ్ : రష్యా జరిపిన దాడుల్లో దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, తొమ్మిది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై గురువారం సైనిక చర్యను ప్రకటించిన తర్వాత పరిణామాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. రాజధాని నగరం కీవ్‌లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి, ఎయిర్ సైరన్ల మోత మోగిపోతోంది. 


మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, ఉక్రెయిన్ వైమానిక స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్ రీజియన్‌లో రెండు పట్టణాలను తాము స్వాధీనం చేసుకున్నామని రష్యా మద్దతుగల వేర్పాటువాదులు ప్రకటించారు. 


ఉక్రెయిన్‌లో మార్షల్ లాను దేశాధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కియి గురువారం ప్రకటించారు. రష్యాను ఓడిస్తామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి శపథం చేశారు. నల్ల సముద్రం జలమార్గాలు బోస్ఫోరస్, డర్డనెల్లెస్ జల సంధులను రష్యా వినియోగించుకోకుండా మూసివేయాలని టర్కీని ఉక్రెయిన్ కోరింది. నల్ల సముద్రం సరిహద్దుల్లో రష్యా, ఉక్రెయిన్, టర్కీ ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడి సమర్థనీయం కాదని టర్కీ పేర్కొంది. అయితే రష్యాపై ఆంక్షలను వ్యతిరేకించింది. 1936లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ జలసంధులపై నియంత్రణాధికారం టర్కీకి ఉంది. యుద్ధం తదితర సమయాల్లో యుద్ధ నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించవచ్చు. 


Updated Date - 2022-02-24T19:27:48+05:30 IST