అతలాకుతలం

ABN , First Publish Date - 2022-05-17T06:02:11+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామువరకు కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. పలు మండలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కల్లాల్లో నీళ్లు చేరడంతో నింపిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. వర్షంతో రోడ్లవెంట ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. అకాల వర్షం రైతులకు కన్నీళ్లు తెప్పించగా పలు మండలాల పరిధిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

అతలాకుతలం

జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం   

కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన ధాన్యం

కొట్టుకుపోయిన రోడ్లపై ఆరబోసిన వడ్లు 

తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అధికారులు

నిజామాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/న్యూస్‌ నెట్‌వర్క్‌: జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామువరకు కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. పలు మండలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కల్లాల్లో నీళ్లు చేరడంతో నింపిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. వర్షంతో రోడ్లవెంట ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. అకాల వర్షం రైతులకు కన్నీళ్లు తెప్పించగా పలు మండలాల పరిధిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు త్వరగా చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయడంతో పాటు తరలించాలని కోరారు. పలుచోట్ల తడిసిన ధాన్యాన్ని అధికారులు పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆరబోసిన తర్వాత కొనుగోలు చేస్తామని తెలిపారు. 

జిల్లాలో సరాసరి 14.9 మి.మీల వర్షపాతం 

జిల్లాలో అకాల వర్షం రైతులకు కన్నీరు తెప్పించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జిల్లాలో సరాసరి 14.9 మి.మీల వర్షం పడింది. జిల్లాలో నవీపేట మండలంలో అత్యధికంగా 60.5 మి.మీల వర్షం, అత్యల్పంగా రెంజల్‌ మండలంలో 1.5 మి.మీల వర్షం పడింది. జిల్లాలోని నిజామాబాద్‌ రూరల్‌లో 59.1, మాక్లూర్‌లో 43.7, నిజామాబాద్‌నార్త్‌ లో 31.5, ఎడపల్లిలో 22.8, నిజామాబాద్‌సౌత్‌లో 23.4మి.మీల వర్షం పడింది. ఇతర మండలాల్లో 2 నుంచి 10 మి.మీల లోపు వర్షం నమోదైంది. ఈ వర్షం కొన్ని గ్రామా ల పరిధిలో ఎక్కువ పడడంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాలు రోడ్లపై ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. పలు కొనుగోలు కేంద్రా ల్లో నిల్వ ఉంచిన ధాన్యానికి వరద నీరు రావడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తిప్పలు పడ్డారు. జిల్లాలో ఈ వర్షానికి ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌, మెండో రా, బాల్కొండ, సిరికొండ, నిజామాబాద్‌రూరల్‌, మోపాల్‌, నందిపేట, మాక్లూర్‌, నవీపేట, మాక్లూర్‌, భీంగల్‌ రూరల్‌తో పాటు పలు మండలాల పరిధిలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు చేసిన ధాన్యం కూడా లారీలతో తరలించకపోవడం వల్ల ఆ ధాన్యం కూడా తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నెల రోజులుగా ధాన్యం కొనుగోలు

జిల్లాలో నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వెంట వెంటనే లారీలను సమకూర్చి తరలిస్తున్నా ఇంకా అవసరమైన వాహనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. ప్రతిరోజూ 20వేల మెట్రిక్‌ ట న్నుల వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నా తరలింపు సాధ్యం కావడంలేదు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి పదుల సంఖ్యలో లారీలు పంపినా తరలింపు పూర్తికాలేదు.

కరెంటు కోత

జిల్లాలో అకాల వర్షంతో  చెట్లు పడిపోయాయి. ఒకే సారి పలు ప్రాంతాల్లో భారీ వర్షం నుంచి ఓ మోస్తారు వర్షం పడడం తో కరెంటు నిలిచిపోయి ంది. ఆర్మూర్‌ పట్టణం లో ని సబ్‌స్టేషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి రూ.15 లక్ష ల విలువైన కంప్యూటర్‌లు, ఇతర సామగ్రి కాలిపోయింది. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. జిల్లాలోని పలు గ్రామాల పరిధిలో మామాడి రాలిపోయింది. కొన్నిచోట్ల  వరి నేలవాలింది. కూరగాయలు సైతం వర్షానికి నేల రాలిపోయాయి. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్ర భుత్వం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

రైతుల రాస్తారోకో

జిల్లాలో అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోవడంతో పలు మండలాల పరిధిలో రైతులు రాస్తారోకోలు నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సొసైటీల పరిధిలో త్వరగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లనే తమ ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆరోపించారు. మాక్లూర్‌ మండలం అమ్రాద్‌లో ధర్నా నిర్వహించిన రైతులు సొసైటీకి తాళం వేశారు. సొసైటీ పరిధిలో 10 రోజుల క్రితమే రైతులు కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని తీసుకువచ్చినా కొనుగోలు చేయకపోవడం వల్లనే తమ ధాన్యం తడిసిపోయిందని వారు వాపోయారు. ఆర్మూర్‌ దోభీఘాట్‌లో తడిసిన ధాన్యాన్ని వెంటనే తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ధర్నా చేశారు. భీంగల్‌ మండలం సుదర్శన్‌నగర్‌ తండాలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై ధర్నా చేశారు. వరికోసి నెలన్నర అవుతున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు వాపోయారు. నందిపేట మండలం తల్వేదలో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

అధికారుల పరిశీలన..

జిల్లాలో అకాల వర్షం పడి ధాన్యం తడవ డంతో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ నాళేశ్వరం పరిధిలో ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర అధి కారులు కూడా ఆయా కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించి తడిసిన ధాన్యాన్ని చూశారు. రైతులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాలను స్థా నిక అధికారులు పరిశీలించారు. తడిసిన ధా న్యాన్ని ఆరబోయాలని రైతులను కోరారు. వారికి ఇబ్బంది రాకుండా కొనుగోలు చే యడంతో పాటు తరలిస్తామని తెలిపా రు. రోడ్లు, ఇతర ప్రాంతాల్లో ఆరబోసిన రైతులు సాయంత్రం కాగానే కుప్పలు పోయడంతో పాటు టార్ఫాలిన్‌లు కప్పుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన ఽధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 

మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం: సి. నారాయణరెడ్డి, కలెక్టర్‌

జిల్లాలో అకాల వర్షంతో తడిసిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తాం. రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబోయగానే కొనుగోలును చేస్తాం. రోడ్లు, ఇతర ప్రాంతాల్లో ఆరబోసిన రైతులు రాత్రివేళల్లో కుప్పలుపోసి టార్ఫాలిన్‌లను కప్పుకోవాలి. కొనుగోలు కేంద్రాల్లో తరలింపు వాహనాల సమస్య ఉంది. దాన్ని కూడా అధిగమించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. రైతులకు కూడా నష్టం కలిగించకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-05-17T06:02:11+05:30 IST