మోదీ టీంలో ‘అటల్ శిష్యులు’ నలుగురే....

ABN , First Publish Date - 2021-07-08T21:29:26+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని ఊహించని స్థాయిలో విస్తరించారు. ఆయా మంత్రుల పనితీరును బేరీజు

మోదీ టీంలో ‘అటల్ శిష్యులు’ నలుగురే....

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని ఊహించని స్థాయిలో విస్తరించారు. ఆయా మంత్రుల పనితీరును బేరీజు వేసుకోవడం, వివిధ రాష్ట్రాల ఎన్నికలు, సామాజిక సమీకరణాలను రంగరించి, కేబినెట్ కూర్పు చేశారు. అయితే సీనియర్లైన జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, డాక్టర్ హర్షవర్ధన్, రమేశ్ పోఖ్రియాల్, సదానంద గౌడ, సంతోశ్ కుమార్ గాంగ్వార్ లాంటి వారికి మోదీ ఉద్వాసన పలికారు. దీంతో అందరూ విస్తుపోయారు. అయితే ఈ నేతలందరూ మాజీ ప్రధాని వాజ్‌పాయ్, బీజేపీ అగ్రనేత అద్వాణీ శిష్య గణమే. వారిద్దరూ ఉన్న సమయంలో ఈ నేతలందరూ ఓ వెలుగు వెలిగారు. వీరందరూ ప్రస్తుతం మోదీ కేబినెట్ నుంచి నిష్క్రమించారు. ఇక వాజ్‌పాయ్ శిష్యులంటూ మోదీ కేబినెట్‌లో ఉన్నది నలుగురంటే నలుగురే. అందులో అత్యంత సీనియర్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈయన ఒక్కరే ప్రస్తుతం కేబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. ఈయన యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే అటల్ బిహారీ వాజ్‌పాయ్ కేబినెట్‌లో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మోదీ కేబినెట్‌లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ రెండో సారీ విజయం సాధించిన తర్వాత కీలకమైన రక్షణ శాఖను చూస్తున్నారు. ఇక ఈ కోవలోకే మరో ముగ్గురు కూడా వస్తారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. ఈయన అటల్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 


శ్రీపాద యశో నాయక్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా అటల్ మంత్రివర్గంలో సేవలందించారు. వీరు ఇప్పటికీ మోదీ కేబినెట్‌లో ఉన్నారు. అయితే అటల్ కాలంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు మరికొందరు ఇప్పటికీ ఉన్నారు. అయితే వారందరూ మోదీ మొదటి కేబినెట్‌లో పనిచేశారు. మేనకా గాంధీ, ఉమా భారతి, సురేశ్ ప్రభు, రాజీవ్ ప్రతాప్ రూఢీ, విజయ్ గోయల్, అనంత్ గీతే.. లాంటి వారు మోదీ నేతృత్వంలోని మొదటి కేబినెట్‌లో ఉన్నారు. ప్రస్తుత కేబినెట్‌లో వీరెవ్వరూ లేరు. ఇక అరుణ్ జైట్లీ, అనంత కుమార్, సుష్మా స్వరాజ్, రాంవిలాస్ పాసవాన్ కూడా అటల్ బిహారీ వాజ్‌పాయ్ మంత్రివర్గంలో ఉండేవారు. ఆ తర్వాత మోదీ కేబినెట్‌లో కూడా ఉన్నారు. అయితే ఈ నలుగురు ప్రస్తుతం జీవించి లేరు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు అటల్ బిహారీ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత మోదీ కేబినెట్‌లో కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్నారు. 


ప్రస్తుతం మోదీ టీంలో ఉన్న అటల్ శిష్యులు

1. రాజ్‌నాథ్ సింగ్ 2. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ 3. శ్రీపాద యశోనాయక్ 4. ప్రహ్లాద్ సింగ్.

Updated Date - 2021-07-08T21:29:26+05:30 IST