తొలిరోజే ప్రతిపక్షం వాకౌట్‌

ABN , First Publish Date - 2022-01-06T16:15:10+05:30 IST

ఈ ఏడాది ప్రథమంగా ప్రారంభమైన శాసనసభ సమావేశాల తొలి రోజే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వాకౌట్‌ చేసింది. డీఎంకే అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, నిషేధిత గుట్కా, గంజాయి తదితర

తొలిరోజే ప్రతిపక్షం వాకౌట్‌

- రాష్ట్రంలో శాంతిభద్రతలేవీ?

- మండిపడిన ఎడప్పాడి

- గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించిన డీపీఐ సభ్యులు


చెన్నై: ఈ ఏడాది ప్రథమంగా ప్రారంభమైన శాసనసభ సమావేశాల తొలిరోజే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వాకౌట్‌ చేసింది. డీఎంకే అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, నిషేధిత గుట్కా, గంజాయి తదితర మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదని, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరుతో అమల వుతున్న పథకాలను రద్దు చేస్తోందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే శాసనసభ నుంచి నిష్క్రమించింది. కొత్త సంవత్సరం తొలి శాసనసభ సమావేశాలు స్థానిక చేపాక్‌ కలైవానర్‌ అరంగంలో బుధవారం ఉదయం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. సభలో తమిళ్‌తాయ్‌ ప్రార్థనాగీతం తర్వాత గవర్నర్‌ ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా అన్నాడీఎంకే సభాపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆ తర్వాత కలైవానర్‌ అరంగం వెలుపల ఎడప్పాడి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యలు, మానభంగాలు, మహిళలపై లైంగిక వేధింపులు అధికమయ్యాయని, దోపిడీలు, చోరీలు పెరిగాయని, మొత్తానికి శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిం చాయని మండిపడ్డారు. ఈ కారణంగానే తమ పార్టీ శాసనసభ్యులంతా సభ నుంచి వాకౌట్‌ చేశారని చెప్పారు. రాష్ట్రంలో నిషేధిత గుట్కా తదితర మాదకద్రవ్యాల అక్రమరవాణా జోరుగా సాగుతోందని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థికసాయం అందించకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. అమ్మా క్లినిక్‌లను మూసి డీఎంకే ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్యంపై తమకున్న నిర్లక్ష్య వైఖరిని చాటుకుందని విమర్శించారు. తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలపై తప్పుడు కేసులు బనాయించి, విచార ణ పేరుతో డీఎంకే ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో ఈశాన్య ప్రభావిత వర్షాలు ప్రారంభం కాకమునుపే వాన నీటి కాల్వలను మెరుగుపరచి వుంటే వరద పరిస్థితులు ఉండేవి కావని, వాస్తవం ఇలా ఉండగా వరదలకు అన్నా డీఎంకే ప్రధానకారణమంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.


డీపీఐ సభ్యుల వాకౌట్‌...: శాసనసభలో డీఎంకే మిత్రపక్షమైన డీపీఐ శాసనసభ్యులు గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించారు. నీట్‌ రద్దు తీర్మానంపై గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడాన్ని నిరశిస్తూ డీపీఐకి చెందిన సిందనై సెల్వం, తిరుప్పోరూరు బాలాజీ సహా నలుగురు శాసనసభ్యులు బుధవారం ఉదయం సభ నుండి నిష్క్రమించారు. వీరంతా గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే చిహ్నంపై పోటీ చేసినవారు కావడం గమనార్హం.

Updated Date - 2022-01-06T16:15:10+05:30 IST