అసాంజే వేట

ABN , First Publish Date - 2021-12-16T06:20:11+05:30 IST

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించవచ్చునంటూ లండన్ హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రభుత్వాల పాలనలో పారదర్శకతనూ, పాత్రికేయ స్వేచ్ఛనూ కోరుతున్నవారిని తీవ్రంగా కలవరపరుస్తున్నది....

అసాంజే వేట

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించవచ్చునంటూ లండన్ హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రభుత్వాల పాలనలో పారదర్శకతనూ, పాత్రికేయ స్వేచ్ఛనూ కోరుతున్నవారిని తీవ్రంగా కలవరపరుస్తున్నది. ఫిలిప్పీన్స్, రష్యాకు చెందిన ఇద్దరు పాత్రికేయులు తమ ప్రభుత్వాలను ధిక్కరించి, నిష్ఠురమైన నిజాలను వెలికితీస్తున్నందుకు మెచ్చిఇచ్చిన నోబెల్ శాంతి పురస్కారాన్ని వారు ఓస్లోలో స్వీకరించిన నాడే ఈ తీర్పు వెలువడింది. ప్రస్తుతం బ్రిటన్ జైలులో నిర్బంధంలో ఉన్న అసాంజేను అమెరికాకు అప్పగించనక్కరలేదంటూ దిగువ కోర్టు ఒకటి ఈ ఏడాది తొలివారంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు తలకిందులు చేసింది. దశాబ్దం క్రితం పలు సైనిక, దౌత్య రహస్యాలతో కూడిన డాక్యుమెంట్లను ప్రపంచం ముందు ఉంచి, ప్రధానంగా ఇరాక్, అఫ్ఘానిస్థాన్ లలో అమెరికా తీవ్ర యుద్ధనేరాలకు పాల్పడిందని వికీలీక్స్ బయటపెట్టడం అమెరికాను ఆగ్రహపరిచింది. అసాంజేను అమెరికా వెంటాడుతోంది. అమెరికాలో ఆయనమీద దాదాపు డజనున్నర కేసులున్నాయి. ఇవి గనుక రుజువైతే ఆయనకు రెండితల జీవితకాలం కూడా చాలనంత శిక్షపడుతుందని అంటారు. 


అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి ‘ప్రజాస్వామ్య సదస్సు’ ఇటీవల జరిగింది. ఈ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొన్న చాలాదేశాలు నిజానికి ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ ప్రజాస్వామ్యస్ఫూర్తికి దూరమని విమర్శించినవారూ ఉన్నారు. సదస్సు నిర్వహించే అర్హత అసలు అమెరికాకు లేదన్నవారూ ఉన్నారు. సదస్సు ఆరంభిస్తూ జో బైడెన్ ఎన్నోమాటలు చెప్పారు. పటిష్ట ప్రజాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛ ఎంతో ముఖ్యమనీ, ప్రజలకు నిజాలు చెబుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న మీడియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఉన్నదని ఆయన అన్నారు. ఎవరికీ వెరవని సర్వస్వతంత్ర మీడియాకు తన మద్దతు, సహకారం ఎప్పటికీ ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఒకపక్క ఈ సదస్సు జరుగుతుండగానే, అసాంజే విషయంలో లండన్ కోర్టు తీర్పు వెలువడటం విశేషం. అసాంజే విషయంలో అమెరికా ప్రదర్శిస్తున్న కఠిన వైఖరి బైడెన్ ప్రసంగ సారాంశానికి పూర్తి భిన్నంగా ఉంది. నిజాలు వెలుగుచూడటాన్నీ, వాటిని బయటపెట్టిన వ్యక్తులనూ అమెరికా సహించలేకపోతున్నది. అమెరికా దుశ్చర్యలనూ, అధికారిక అకృత్యాలను, వేసుకున్న ముసుగులను విప్పిచూపినవారు దాని దృష్టిలో ద్రోహులైనారు. 


అసాంజే కన్నుమూసేవరకూ అమెరికా వేటాడుతూనే ఉంటుందనీ, అతడు బయటకు రాకుండా జైళ్ళలోనే మగ్గేట్టు చేస్తున్నదని సన్నిహితులు వాపోతున్నారు. అసాంజే మానసిక ఆరోగ్యం, అమెరికా జైల్లో ఎదుర్కొనే పరిస్థితులు, ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఇత్యాది అంశాల ఆధారంగా బ్రిటన్ దిగువకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దీనిని వమ్ముచేయడానికి హైకోర్టుకు అమెరికా ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అసాంజేను సరిగా చూసుకుంటామని అంటూనే, ఆయన ప్రవర్తనపై ఆధారపడి తమ నిర్ణయాలుంటాయన్నది. అమెరికా చెబుతున్న ప్రకారం ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్యన సుదీర్ఘకాలం ఒంటరిగా ఖైదుచేసే అవకాశాలే అధికమని సన్నిహితులు అంటున్నారు. అమెరికా, బ్రిటన్ లు అసలు అసాంజేను ఇలా ఎందుకు ఇచ్చిపుచ్చుకోవాలన్నది అనేకుల ప్రశ్న. వికీలీక్స్ ద్వారా ఆయన వెలుగులోకి తెచ్చిన యుద్ధ, దౌత్య విషయాలన్నీ ప్రపంచానికి ఉపకరించేవే తప్ప హానిచేసినవి కావు. అసాంజే లేకుంటే అవేవీ బయటకు పొక్కేవి కావు. ఇరాక్ యుద్ధానికి అమెరికా బ్రిటన్ లు ఎన్ని కుట్రలు చేశాయో, నిజాలు దాచిపెట్టి కుట్రకథనాలతో ఎన్ని నేరాలు చేశాయో ప్రపంచానికి క్రమంగా అర్థమైంది. ఆ నేరాలకు ఘోరాలకు ప్రభుత్వాలు ఎవరినీ బాధ్యులను చేయలేదు, కేసులు పెట్టలేదు, శిక్షలు వేయలేదు. నిజంచెప్పిన అసాంజే మాత్రం జైల్లో మగ్గుతున్నాడు. ఆయనను ఎంత కష్టపడి అమెరికా తీసుకువచ్చినా గూఢచర్యం సహా చాలా కేసుల్లో శిక్షపడేట్టుచేయడం కష్టమని న్యాయనిపుణుల అభిప్రాయం. మిగతా ప్రపంచం నియంతృత్వ పోకడలు పోతున్న ఈ పాడుకాలంలో తాను ప్రజాస్వామ్యానికి ఆశాజ్యోతిగా నిలుస్తున్నానని చెప్పుకున్న జో బైడెన్ వెంటనే అసాంజే మీద అన్ని కేసులూ ఉపసంహరించుకోవాలి.

Updated Date - 2021-12-16T06:20:11+05:30 IST