జనాభా నియంత్రణ బిల్లుపై యోగిని ప్రశ్నించిన ఒవైసీ

ABN , First Publish Date - 2021-08-01T21:01:51+05:30 IST

యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన ఉత్తరప్రదేశ్ జనాభా నియంత్రణ బిల్లును..

జనాభా నియంత్రణ బిల్లుపై యోగిని ప్రశ్నించిన ఒవైసీ

న్యూఢిల్లీ: యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన ఉత్తరప్రదేశ్ జనాభా నియంత్రణ బిల్లును ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. కోవిడ్ నిర్వహణా లోపాలపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. సంతానాన్ని నిర్బంధంగా కుదించే ఆలోచన ఏదీ లేదని ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం 2020లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించిందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. దీనిపై మొదట యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇవ్వాలని ప్రశ్నిచారు.


''జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్ఎశ్) 1999-2000 గణాంకాల ప్రకారం హిందువుల్లో సంపూర్ణ సంతానోత్పత్తి సామర్థ్యం (టీఎఫ్ఆర్) 1.2 శాతంగా, ముస్లింలలో 1.66 శాతంగా ఉంది. ఈ గణాంకాలు నిజమా కాదా ముందు చెప్పాలని బీజేపీకి సవాలు చేస్తున్నాను. అదే నిజమైతే, బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏముంది?'' అని ఒవైసీ ప్రశ్నించారు. పాపులేషన్ ప్రొజెక్షన్ రిపోర్ట్ ప్రకారం దేశ జనాభా తగ్గుతూ వస్తోందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ డాటా ప్రకారం, 65 శాతం జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లేననని, ఈ వర్గానికి ఉద్యోగాల కల్పన గురించి కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదని ఒవైసీ ప్రశ్నించారు.


కోవిడ్ నిర్వహణా లోపాల వల్ల దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉద్యోగాలు పోయాయని, వ్యాపారాలు దెబ్బతిన్నాయని, పరిస్థితి ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతోందని అన్నారు. 6 నెలల నుంచి ఆరేళ్ల లోపు  పోషకాహార లోపం ఉన్న 9 లక్షల మంది పిల్లల్లో 4 లక్షల మంది యూపీలోనే ఉన్నారని, పీహెచ్‌సీ సబ్ సెంటర్లు కూడా తక్కువేనని అన్నారు. కమ్యూనిటీ హెల్త్‌కేర్ సెంటర్లు 50 శాతానికి కంటే దిగువనే ఉన్నాయని అన్నారు. మృతదేహాలు సముద్రాల్లో తేలుతున్నాయని, కరోనా కాలంలో ఆక్సిజన్ కొరతతో జనం ప్రాణాలు కోల్పోయారని, ఇందులో ఏ ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవని ఆయన నిలదీశారు. కోవిడ్ వ్యాప్తి జరిగిన వాస్తవ పేషెట్ల సంఖ్య అధికారికంగా ప్రకటించిన వాటి కంటే ఎక్కువేనని ఐసీఎంఆర్ సర్వే కూడా చెప్పిందన్నారు. ప్రజలకు చికిత్స అందించడం మరచిపోయిన వారు కనీసం లెక్కలైనా సరిగా చూపించడంలో శ్రద్ధ చూపించ లేదని ఒవైసీ తప్పుపట్టారు.

Updated Date - 2021-08-01T21:01:51+05:30 IST